Tiger 3: పోరాటాలకు సిద్ధం

అందాల తారే కాదు.. ఆడపులి అని బాలీవుడ్‌ కథానాయిక కత్రినా కైఫ్‌ను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు అభిమానులు. జోయా పాత్రలో వెండితెరపై ఆమె చేయనున్న స్టంట్స్‌ చూడటానికి ఎదురుచూస్తున్నారు.

Updated : 06 Mar 2022 12:49 IST

అందాల తారే కాదు.. ఆడపులి అని బాలీవుడ్‌ కథానాయిక కత్రినా కైఫ్‌ను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు అభిమానులు. జోయా పాత్రలో వెండితెరపై ఆమె చేయనున్న స్టంట్స్‌ చూడటానికి ఎదురుచూస్తున్నారు. తాజాగా విడుదలైన ‘టైగర్‌ 3’ ప్రచార వీడియో గురించే వారిలా స్పందిస్తున్నారు. ‘ఏక్‌ థా టైగర్‌’, ‘టైగర్‌ జిందా హై’ చిత్రాల్లో సల్మాన్‌ ఖాన్‌, కత్రినా కైఫ్‌ జంట ప్రేక్షకులను సమ్మోహనపరిచింది. ఆ చిత్రాల్లో టైగర్‌గా సల్మాన్‌ సాహసాలు, జోయాగా కత్రినా గ్లామర్‌ వహ్వా అనిపించాయి. ఇప్పుడు ఆ సిరీస్‌లో తదుపరి చిత్రంగా ‘టైగర్‌ 3’ వస్తోంది. మనీశ్‌ శర్మ దర్శకత్వంలో యష్‌రాజ్‌ ఫిల్మ్స్‌పై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్‌ 21న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తాజాగా ప్రకటించింది. దీనికి సంబంధించి ఓ వినూత్న వీడియోను పంచుకుంది. అందులో కత్రినా చేతిలో చిన్న కత్తి పట్టుకుని కళ్లు చెదిరే రీతిలో స్టంట్స్‌ సాధన చేస్తూ కనిపించింది. ఆ తర్వాత అక్కడే నిద్ర పోతున్న సల్మాన్‌ను లేపి ‘ఫైటింగ్‌కు నువ్వు సిద్ధమేనా’ అని కత్రినా ప్రశ్నించడం, ‘టైగర్‌ సదా సిద్ధం’ అని ఆయన సమాధానమివ్వడం ఆకట్టుకుంటోంది. దీన్నిబట్టి ఈ చిత్రంలో    సల్మాన్‌కు దీటుగా కత్రినా ఫైట్స్‌తో చెలరేగిపోవడం ఖాయమని అర్థమవుతోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని