ప్రభాస్‌ మూవీ కోసం లెజండరీ దర్శకుడు

ఒకప్పుడు వరుస షూటింగ్‌లు.. ఆడియో ఫంక్షన్లు, ప్రతి శుక్రవారం ఓ సినిమా. ఇలా చిత్ర పరిశ్రమ నిత్యం ఏదో ఒక సందడితో కళకళలాడుతుండేది. కరోనా కారణంగా

Updated : 21 Sep 2020 15:18 IST

హైదరాబాద్‌: ఒకప్పుడు వరుస షూటింగ్‌లు.. ఆడియో ఫంక్షన్లు, ప్రతి శుక్రవారం ఓ సినిమా. ఇలా చిత్ర పరిశ్రమ నిత్యం ఏదో ఒక సందడితో కళకళలాడుతుండేది. కరోనా కారణంగా ఆ సందడి అంతా కనుమరుగైంది. షరతులతో కూడిన చిత్రీకరణలకు ప్రభుత్వాలు అనుమతులు ఇవ్వడంతో ఇప్పుడిప్పుడే ఒక్కో సినిమా మళ్లీ పట్టాలెక్కుతోంది. దీంతో రోజుకో ఆసక్తికర విషయాన్ని చిత్ర బృందాలు అభిమానులతో పంచుకుంటున్నాయి. సోమవారం టాలీవుడ్‌లోని కొత్త విషయాలు, ఆసక్తికర విశేషాలు మీకోసం..

ప్రభాస్‌-నాగ్‌ అశ్విన్‌ సినిమా కోసం సింగీతం

సాంకేతికపరిజ్ఞానం అంతగా అందుబాటులో లేని రోజుల్లోనే ప్రయోగాత్మక చిత్రాలను తెరకెక్కించి అందరినీ ఆశ్చర్యపరిచిన దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు. ఇప్పుడు ఈయన ప్రభాస్‌ కథానాయకుడిగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్‌ చిత్రానికి మెంటార్‌గా వ్యవహరించనున్నారు. చిత్ర బృందానికి తనదైన సూచనలు, సలహాలు ఇవ్వనున్నారు. సోమవారం సింగీతం పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ, ఆయన సృజనాత్మక ఆలోచనలు తమకు ఎంతగానో ఉపయోగపడతాయని చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేసింది. ఇక ఈ సినిమాలో దీపిక పదుకొణె కథానాయికగా నటిస్తున్నారు.

బస్తీ బాలరాజును చూశారా?

యువ కథానాయకుడు కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తున్న చిత్రం ‘చావు కబురు చల్లగా’. కౌశిక్‌ పెగల్లపాటి దర్శకుడు. సోమవారం కార్తికేయ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఇందులో కార్తికేయ మృతదేహాలను తరలించే వాహన డ్రైవర్‌ బస్తీ బాలరాజు పాత్రలో నటిస్తున్నారు. ఆమని కీలక పాత్ర పోషిస్తున్నారు.

అల్లుడు అదుర్స్‌ షూటింగ్‌ షురూ

బెల్లకొండ సాయి శ్రీనివాస్‌ కథానాయకుడిగా సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘అల్లు అదుర్స్‌’. నభా నటేశ్‌ కథానాయిక. కరోనా కారణంగా వాయిదా పడిన ఈ చిత్ర షూటింగ్‌ తిరిగి ప్రారంభమైంది. ప్రకాశ్‌రాజ్‌, సాయి శ్రీనివాస్‌ల మధ్య కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది.

‘ఉప్పెన’ నుంచి కృతి మరో లుక్‌

వైష్ణవ్‌ తేజ్‌, కృతి శెట్టి కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఉప్పెన’. బుచ్చిబాబు దర్శకుడు.  వేసవి కానుకగా విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. అయితే, దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూర్చిన రెండు పాటలు మాత్రం యువతను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం కథానాయిక కృతి శెట్టి పుట్టిన రోజు సందర్భంగా చిత్ర బృందం ప్రత్యేక పోస్టర్‌ను అభిమానులతో పంచుకుంది. పరిస్థితులు చక్కబడిన వెంటనే సినిమాను విడుదల చేయనున్నారు.

ఏడు మిలియన్ల ఏ పిల్ల.. పరుగున పోదామా!

నాగచైతన్య, సాయిపల్లవి నాయకనాయికలుగా నటిస్తున్న చిత్రం ‘లవ్‌స్టోరీ’. శేఖర్‌ కమ్ముల దర్శకుడు. కరోనా కారణంగా వాయిదా పడిన ఈ చిత్ర షూటింగ్‌ ఇటీవల మొదలైంది. కాగా, ఈ సినిమాలోని ‘ఏ పిల్ల.. పరుగున పోదామా’ లిరికల్‌ వీడియో వ్యూస్‌ ఏడు మిలియన్లు దాటింది. పవన్‌ స్వరాలు సమకూర్చిన ఈ గీతాన్ని హరిచరణ్‌ ఆలపించారు. చైతన్య స్వరాలు సమకూర్చారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని