అలా.. మొదలై..ఇలా.. కుదేలై.. మళ్లీ.. విడుదలై..

తెలుగు చిత్రసీమకి విజయాలు అరకొరే. యేటా వందల సంఖ్యలో సినిమాలు విడుదలైతే... అందులో లాభాలు సొంతం చేసుకొనేవి వేళ్లపై లెక్కపెట్టేటన్నే! ఒక విజయం వరించిందంటే... పది పరాజయాలు వెంటాడుతుంటాయి. ఆ ఒక్క విజయమే స్ఫూర్తిగా కొత్త చిత్రాలు....

Updated : 31 Dec 2020 11:04 IST

విజయాలతో ఊరించి.. కరోనాతో ముంచి

బైబై 2020

తెలుగు చిత్రసీమకి విజయాలు అరకొరే. యేటా వందల సంఖ్యలో సినిమాలు విడుదలైతే... అందులో లాభాలు సొంతం చేసుకొనేవి వేళ్లపై లెక్కపెట్టవచ్చు! ఒక విజయం వరించిందంటే... పది పరాజయాలు వెంటాడుతుంటాయి. ఆ ఒక్క విజయమే స్ఫూర్తిగా కొత్త చిత్రాలు పట్టాలెక్కుతుంటాయి. బయట నుంచి చూసేవాళ్లకే విజయాలు, పరాజయాలు అనే లెక్కలు. చిత్రసీమకి మాత్రం ప్రతి సినిమా సమానమే. సినిమాపై అభిరుచి.. ఆకర్షణతో ఎప్పటికప్పుడు కొత్త నిర్మాతలు అడుగు పెడుతూనే ఉంటారు. విజయాలొచ్చినా రాకపోయినా పరిశ్రమ ఎప్పుడూ కళకళలాడుతూ కనిపిస్తుందంటే కారణం అదే. కానీ, కరోనాతో ఈసారి ఆ కళే మాయమైంది. థియేటర్లు మూతపడటంతో రిలీజ్‌ల ఊసే లేదు. సెట్స్‌పైన ఉన్న సినిమాలన్నీ ఆగిపోయాయి. మునుపటి స్థాయిలో కొత్తవి మొదలు కాలేదు. నిర్మాతల పెట్టుబడులన్నీ స్తంభించిపోయాయి. వడ్డీల భారం పెరిగిపోయింది. కార్మికులకి ఉపాధి కరవైంది. యేడాదిలో దాదాపుగా 200 సినిమాల్ని ఉత్పత్తి చేసే తెలుగు చిత్రసీమ ఈసారి 50 చిత్రాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. విజయాలతో ఊరించి.. కరోనాతో ముంచేసిన ఈ యేడాది ఎలా గడిచిందో చూద్దాం...

ఆరంభం అదుర్స్‌

ప్రతీ యేడాదిలాగే 2020 సినీ క్యాలెండర్‌ జోష్‌తో మొదలైంది. ఒకటో తేదీ నుంచే కొత్త సినిమాలు క్యూ కట్టాయి. అగ్ర తారల సినిమాలు ఊరించాయి. అందుకు తగ్గట్టే సంక్రాంతి సినిమాలు వసూళ్ల వర్షం కురిపించాయి. ఎప్పట్లాగే ఈసారి సంక్రాంతికి నాలుగు చిత్రాలు విడుదలయ్యాయి. రజనీకాంత్‌ ‘దర్బార్‌’,  మహేష్‌బాబు ‘సరిలేరు నీకెవ్వరు’, అల్లు అర్జున్‌ ‘అల... వైకుంఠపురములో’, కల్యాణ్‌రామ్‌ ‘ఎంత మంచివాడవురా’ విడుదలయ్యాయి. వీటిలో ‘సరిలేరు...’, ‘అల...’  విజయాల్ని సొంతం చేసుకున్నాయి. ఇవి రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టడంతో చిత్రసీమలో ఉత్సాహం కనిపించింది. ఆ ఊపు కొనసాగుతుందనే నమ్మకాలు కనిపించినా... అదే నెలలోనే విడుదలైన కొన్ని సినిమాలు పరాజయాల్ని మూటగట్టుకున్నాయి. నితిన్‌ ‘భీష్మ’, విజయ్‌ దేవరకొండ ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’, శర్వానంద్‌ - సమంతల ‘జాను’ చిత్రాలతో ఫిబ్రవరి ఊరించింది. విష్వక్‌సేన్‌ ప్రధానపాత్రలో హీరో నాని నిర్మించిన ‘హిట్‌’ కూడా అదే నెల విడుదలైంది. వీటిలో ‘భీష్మ’, ‘హిట్‌’ సినిమాలు విజయాల్ని సొంతం చేసుకున్నాయి. ఈ నెలలోనే  విడుదలైన ‘కనులు కనులను దోచాయంటే’ సరైన ప్రచారం లేక ప్రేక్షకులకి చేరువ కాలేకపోయింది. ‘భీష్మ’ తర్వాత సరైన విజయాల్లేక సతమతమవుతూ వేసవివైపు చూసింది చిత్రసీమ. మార్చిలో ఏ సినిమా కూడా సరైన ఫలితాన్ని రాబట్టలేదు. ప్రేక్షకులు లేక పలు షోలు రద్దయ్యాయి కూడా. ‘పలాస 1978’ ఒక్కటే విమర్శకుల మెప్పు పొందింది. వసూళ్లు మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు. కరోనాతో మార్చి 15 నుంచే థియేటర్లు మూతపడ్డాయి. వేసవి సినిమాల విడుదల ఆగిపోయింది.

ఏప్రిల్‌ నుంచి ఓటీటీలో

థియేటర్ల మూతతో ప్రేక్షకులు వినోదం కోసం కొత్త దారుల్ని వెదుక్కున్నారు. ఓటీటీ  వేదికలకి అలవాటు పడిపోయారు. అది గుర్తించిన చిత్రసీమ సినిమాలను ఓటీటీ ద్వారానే విడుదల చేయాలని నిర్ణయించింది. దాంతో ఏప్రిల్‌ నుంచే ఓటీటీలో సినిమాల రాక మొదలైంది. కీర్తిసురేష్‌ ‘పెంగ్విన్‌’ మొదలుకొని ‘కృష్ణ అండ్‌ హిజ్‌ లీల’, ‘అమృతారామమ్‌’, ‘రన్‌’ తదితర చిత్రాలు పలు ఓటీటీ వేదికల్లో విడుదలయ్యాయి. థియేటర్లు తెరిచే వరకు వేచిచూసి, వడ్డీల భారం మోయడం కంటే ఓటీటీల్లో విడుదల చేయడమే మేలనుకున్నారు పలువురు నిర్మాతలు. దాంతో జులై నుంచి పలు సినిమాలు ఓటీటీ వేదికల ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చాయి. వాటిలో నాని - సుధీర్‌బాబు ‘వి’, అనుష్క ‘నిశ్శబ్దం’ కూడా ఉన్నాయి.  వీటిలో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నవి కొన్నే. ‘భానుమతి అండ్‌ రామకృష్ణ’, ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’, ‘కలర్‌ఫొటో’, ‘మిడిల్‌క్లాస్‌ మెలోడీస్‌’, ‘డర్టీ హరి’ తదితర చిత్రాలు వినోదాన్ని పంచాయి. సూర్య కథా నాయకుడిగా నటించిన ‘ఆకాశమే నీ హద్దురా’ సినిమా అలరించింది. 

నమ్మకాన్ని పెంచుతూ‘సోలో...’

థియేటర్లకి  ప్రేక్షకులు వస్తారా రారా? అనే సందేహాన్ని పటాపంచలు చేయడంతోపాటు, పరిశ్రమలో ఓ నమ్మకాన్ని పెంచింది ‘సోలో బ్రతుకే సో బెటర్‌’. థియేటర్లు తెరుచుకొన్నాక ప్రేక్షకుల ముందుకొచ్చిన పెద్ద చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్‌’. పరిశ్రమ అంతా ఇది సాధించే ప్రారంభ వసూళ్ల గురించి ఆసక్తిగా ఎదురు చూసింది. చాలా రోజులుగా థియేటర్లకి దూరంగా గడుపుతున్న ప్రేక్షకులు ఎట్టకేలకి కదిలొచ్చారు. కరోనా నిబంధనల మేరకు థియేటర్లలో యాభై శాతం టికెట్లు మాత్రమే విక్రయించినా.. మంచి వసూళ్లనే రాబట్టింది. నిర్మాత ముందే ఓటీటీ సంస్థకి అమ్మి లాభాలు మూటగట్టుకన్నా, థియేటర్ల రూపంలో కూడా సినిమా మంచి ఫలితాన్నే ఇచ్చింది. ఒక రకంగా 2021 సంక్రాంతి సినిమాలకి ఊతమిచ్చిన చిత్రమిదే.

ఇదీ చదవండి

గుడ్‌బై 2020.. పార్టీకి వేళాయరా..!
 

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని