బోస్‌మన్‌ మృతి: ఆ ట్వీట్‌కు అత్యధిక లైకులు

హాలీవుడ్‌ నటుడు చాడ్విక్‌ బోస్‌మన్‌(43) మృతి ప్రపంచ సినీ ప్రేక్షకులను..

Updated : 30 Aug 2020 14:58 IST

6.5 మిలియన్ల లైకులు, 3 మిలియన్ల రీట్వీట్లు

వాషింగ్టన్‌: హాలీవుడ్‌ నటుడు చాడ్విక్‌ బోస్‌మన్‌(43) మృతి ప్రపంచ సినీ ప్రేక్షకులను నిర్ఘాంతపరిచింది. ‘బ్లాక్‌ పాంథర్‌’ సినిమాతో కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న బోస్‌మన్‌ పెద్ద పేగు క్యాన్సర్‌తో బాధపడుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని నటుడి కుటుంబసభ్యులు అతడి ట్విటర్‌ అకౌంట్‌ ద్వారా వెల్లడించారు. ‘బరువెక్కిన హృదయాలతో చాడ్విక్‌ బోస్‌మన్‌ మృతి వార్తను తెలియజేస్తున్నాం. మూడో దశలో ఉన్న క్యాన్సర్‌ను 2016లో తొలిసారి గుర్తించాం. అతడో పోరాట యోధుడు. నాలుగో దశకు చేరుకున్న వ్యాధితో నాలుగేళ్లపాటు యుద్ధం చేశాడు. ఈ కాలంలోనే మార్షల్‌, ది 5 బ్లడ్స్‌, మా రైనీస్‌ బ్లాక్‌ బాటమ్‌ తదితర చిత్రాల్లో నటించి మిమ్మల్ని మెప్పించాడు. ఇదే సమయంలో పలు శస్త్రచికిత్సలు, కీమోథెరపీలు చేయించుకున్నాడు. బ్లాక్‌ పాంథర్‌లో కింగ్‌ ఛలా పాత్రకు తిరిగి ప్రాణం పోయడం బోస్‌మన్‌ సినీ ప్రస్థానానికే గౌరవం. ఇంట్లోనే భార్య, కుటుంబసభ్యుల మధ్యలో తుదిశ్వాస విడిచాడు’ అని పేర్కొంటూ ఓ ట్వీట్ చేశారు.

కాగా ఆ ట్వీట్‌కు నెటిజన్లు అత్యధిక మంది లైకులు కొట్టారు. ఈ విషయాన్ని ట్విటర్‌ అధికారికంగా ధ్రువీకరించి తన ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేసింది. ‘గొప్ప నటుడికి అభిమానుల ఘన నివాళి’ అంటూ పేర్కొంది. ఈ ట్వీట్‌కు ఇప్పటివరకు 6.5 మిలియన్ల లైకులు వచ్చాయి. 3 మిలియన్ల మంది ఆ ట్వీట్‌ను రీట్వీట్ చేసి నటుడికి ఘన నివాళి అర్పించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామాతోపాటు పలువురు ప్రముఖులు బోస్‌మన్‌ మృతికి శ్రద్ధాంజలి ఘటించారు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని