
డిలీట్ చేసిన ట్వీట్ వివాదాల్లోకి లాగింది..!
నటి-గాయకుడి మధ్య మాటల యుద్ధం
ముంబయి: సందర్భమేదైనా సరే తనదైన శైలిలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలుస్తుంటారు బాలీవుడ్ నటి కంగన రనౌత్. ఇటీవల కంగన తప్పుగా చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం ఆమెని మరోసారి వివాదాల్లోకి లాగింది. దిల్లీలో రైతుల ఆందోళనను ఉద్దేశిస్తూ గత కొన్నిరోజుల క్రితం కంగన ఓ ట్వీట్ చేశారు. రైతుల ఆందోళనలో పాల్గొన్న ఓ సిక్కు వృద్ధురాలి(షాహీన్ బాగ్ బామ్మగా భావించి) గురించి తప్పుడు సమాచారంతో కూడిన ట్వీట్ చేసిన కంగన కొద్దిసేపటికే దాన్ని డిలీట్ చేశారు. షాహీన్‌బాగ్ బామ్మ రూ.100 ఇస్తే చాలు ఇలాంటి ఆందోళనలకు వచ్చేస్తారు అని కంగన పేర్కొనడంతో పలువురు సెలబ్రిటీలు, పంజాబీ సింగర్ దుల్జిత్.. కంగనపై విమర్శల వర్షం కురిపించారు.
కాగా, తాజాగా కంగన.. దుల్జిత్ పెట్టిన ట్వీట్‌పై స్పందించారు. ‘నువ్వు కరణ్‌జోహార్ పెంపుడు జంతువు. పౌరచట్టం కోసం ఆందోళన చేసిన ఆ బామ్మే ఇప్పుడు రైతుల కోసం నిరసనలు చేస్తుందని మాత్రమే ట్వీట్ చేశాను. ఇప్పుడు ఈ డ్రామా ఏంటి?’ అని రిప్లై ఇచ్చారు. కంగన ట్వీట్ పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన దుల్జిత్.. ‘ఎవరితో అయితే కలిసి పనిచేశావో వాళ్లందరికీ నువ్వు కూడా పెంపుడు జంతువేనా? అలా అయితే ఆ జాబితా చాలా పెద్దగా ఉంటుంది. ఇది బాలీవుడ్ కాదు. పంజాబ్. మనుషుల భావోద్వేగాలతో ఎలా ఆడుకోవాలో నీకు బాగా తెలుసు’ అని ఘాటుగా వ్యాఖ్యలు చేశారు.
‘పని కోసం నువ్వు ఎవరి కాళ్లు పట్టుకుంటున్నావో(కరణ్‌జోహార్) వాళ్లకి రోజూ నేను కావాల్సినంత జ్ఞానం పెడుతున్నాను. నేను నీలాగా అందరి కాళ్లు పట్టుకునే రకాన్ని కాదు. ఎందుకంటే నేను కంగనా రనౌత్’ అని నటి విమర్శించారు. అంతేకాకుండా దుల్జిత్ని పరోక్షంగా ఉగ్రవాదితో పోలుస్తూ వ్యాఖ్యానించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.