
‘నాన్నా..నీ మాటలు నేటికీ వినిపిస్తున్నాయి’
దిల్లీ: సంగీత ప్రపంచానికే మహారాణి, నైటింగేల్ ఆఫ్ బాలీవుడ్‌గా పేరుగాంచిన ప్రఖ్యాత గాయిని లతా మంగేష్కర్ తాజాగా తన చిన్ననాటి జ్ఞాపకాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. మొట్టమొదటిసారిగా ఆమె రేడియోలో పాడినందుకు తన తండ్రి ప్రముఖ శాస్త్రీయ సంగీత గాయకుడు, థియేటర్ ఆర్టిస్ట్ దీననాథ్ మంగేష్కర్ చెప్పిన మాటలను గుర్తు చేసుకున్నారు.
‘79 సంవత్సరాలకు ముందు డిసెంబర్ 16, 1941లో మొదటిసారిగా నేను రేడియోలో పాడాను. రెండు నాట్య గీతాలను ఆలపించాను. నా పాటలను విన్న మా నాన్న గారు చాలా చాలా సంతోషించారు. అంతేకాకుండా ‘ఈ రోజు రేడియోలో లతా ఆలపించిన గీతాలు విన్నాక నాకెంతో ఆనందంగా ఉంది. ఇప్పుడు నాకు ఎలాంటి భయాలు, దిగులు లేదు’ అని అమ్మతో అన్నారు. ఆ తర్వాత 1942లో నాన్న గారు మరణించారు’ అని ఆమె ట్విట్టర్ వేదికగా భావోద్వేగానికి లోనయ్యారు.
1948లో మజ్‌బూర్ చిత్రంలోని ‘దిల్ మేరా తోడా’ పాటతో బాలీవుడ్‌లో సంచలనం సృష్టించారు. 1949లో ‘మహల్’ చిత్రంలోని ‘ఆయేగా ఆనేవాలా’ పాటతో పాపులర్ అయ్యారు. హిందీ, మారాఠి, బెంగాలీ భాషలే కాకుండా ఇతర స్థానిక భాషల్లోను పాటలను ఆలపించారు. ఎన్నో జాతీయ, ఫిల్మ్ ఫేర్ అవార్డులను అందుకున్నారు. అలాగే పద్మ భూషణ్, పద్మ విభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, భారత రత్న బిరుదులను సొంతం చేసుకున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.