నటి మృతి:షాకింగ్‌ విషయాలు చెప్పిన స్నేహితురాలు

తన స్నేహితురాలు, నటి దివ్యా భట్నాగర్‌ భర్త నుంచి అనేక వేధింపులు ఎదుర్కొందని నటి దెవోలీనా భట్టాచార్య ఆవేదన వ్యక్తం చేశారు. కొవిడ్‌-19 లక్షణాలతో సోమవారం దివ్య మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఆమె జీవితం గురించి ఎవరికీ తెలియని షాకింగ్‌ విషయాలు చెబుతూ....

Updated : 10 Nov 2023 12:37 IST

భార్య చనిపోయింది.. ప్రియురాళ్లతో ఉందామనుకున్నావేమో?

ముంబయి: తన స్నేహితురాలు, నటి దివ్యా భట్నాగర్‌ భర్త నుంచి అనేక వేధింపులు ఎదుర్కొందని నటి దెవోలీనా భట్టాచార్య ఆవేదన వ్యక్తం చేశారు. కొవిడ్‌-19 లక్షణాలతో సోమవారం దివ్య మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఆమె జీవితం గురించి ఎవరికీ తెలియని షాకింగ్‌ విషయాలు చెబుతూ దెవోలీనా సోషల్‌ మీడియాలో వీడియో పోస్ట్‌ చేశారు. మరణంతో బాధలు, కష్టాలు, మోసాల నుంచి దివ్య విముక్తి పొందిందని కన్నీరు పెట్టుకున్నారు.

‘ప్రేమలో విఫలమైన తర్వాత అమ్మాయిలు తప్పులు చేస్తుంటారు. మానసికంగా కుంగుబాటుకు గురై.. ఎవరు ఆదరిస్తే వారికి దగ్గరౌతుంటారు. దివ్య చాలా అమాయకురాలు. నేను ఆమెకు చుట్టుపక్కల పరిస్థితులు వివరించే ప్రయత్నం చేసేదాన్ని. దివ్య ఎదుర్కొన్న మానసిక ఒత్తిడి, వేధింపుల గురించి తెలపడానికి, ఆమె భర్త గురించి మాట్లాడటానికి ఇప్పుడు మీ ముందుకొచ్చా’.

‘నేను నీ గురించే మాట్లాడుతున్నా గగన్‌ గబ్రూ (దివ్య భర్తను ఉద్దేశిస్తూ). దివ్య తల్లి, సోదరుడు మీ ప్రేమకు వ్యతిరేకంగా ఉన్నారని, మిమ్మల్ని అడ్డుపెట్టుకుని పబ్లిసిటీ తెచ్చుకుంటున్నారని నువ్వు అందరికీ చెప్పావు. అసలు నువ్వు ఎవరు? నీకు ఈ సమాజంలో గుర్తింపు లేదు. దివ్యతో పరిచయం ఏర్పరచుకుని, నీ ప్రేమను అంగీకరించాలని బ్రతిమలాడావు. కేవలం నీ వల్ల దివ్యకు నాలుగేళ్లు దూరంగా ఉన్నా, ఆమెతో బంధాలు తెంచుకున్నా. మాకు పబ్లిసిటీ ఇవ్వడానికి నువ్వెవరు?, ఇప్పుడు నేనే నీకు పబ్లిసిటీ ఇస్తున్నా’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అనంతరం సిమ్లాలో గగన్‌పై వేధింపుల కేసు నమోదైందని, ఆయన బెయిల్‌పై బయటికి వచ్చారని దెవోలీనా చెప్పారు. మళ్లీ జైలుకు పంపిస్తానని హెచ్చరించారు. ‘నువ్వు తిరిగి జైలుకు వెళ్తావు. దివ్యను దారుణంగా వేధించినందుకు నీకు శిక్ష తప్పదు. భార్య చనిపోయింది కాబట్టి నీ ప్రియురాళ్లతో ఎంజాయ్‌ చేయొచ్చు అనుకుంటున్నావు కదా? గగన్‌ గబ్రూతో సన్నిహితంగా ఉండే అమ్మాయిలు జాగ్రత్తగా ఉండండి. ఆధారాలతో సహా ఆయన చేసిన నేరాల్ని నిరూపిస్తాను. గగన్‌ గబ్రూ నువ్వు జైలుకే పరిమితమౌతావు. ఆ దేవుడు నిన్ను ఎప్పటికీ క్షమించడు’ అని దెవోలీనా కన్నీరుమున్నీరయ్యారు.

దివ్య కరోనా, న్యుమోనియాతో బాధపడుతూ సోమవారం కన్నుమూశారు. గత వారం ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటిలేటర్‌పై ఉంచారు. మెరుగైన చికిత్స అందించినప్పటికీ వైద్యులు ఆమెను కాపాడలేకపోయారు. దివ్యను తన భర్త వేధించాడని, వివరాలతో కూడిన నోట్‌ దొరికిందని ఆమె సోదరుడు దేవశీష్‌ మీడియాతో చెప్పారు. గగన్‌కు శిక్షపడేలా చేస్తానని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఏడాది దివ్య, గగన్‌ల వివాహం జరిగింది. దెవోలీనా ‘చంద్రకాంత’, ‘సాథ్‌ నిభానా సాథియా’, ‘కామెడీ క్లాసెస్‌’, ‘తేరా షెహర్‌ మే’ తదితర బుల్లితెర సీరియళ్లతో గుర్తింపు తెచ్చుకున్నారు.

ఇవీ చదవండి..
ఆ నటి నా భార్య.. ఎవరికీ చెప్పొద్దంది
వాడు జీవితాంతం జైల్లోనే ఉండాలి: నటి



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని