Tollywood: విజయేంద్రప్రసాద్‌ కథతో భారీ బడ్జెట్‌ మూవీ.. దర్శకుడు ఎవరంటే?

‘బాహుబలి’ తర్వాత భారతీయ సినిమా మేకింగ్‌ విషయంలో అనేక మార్పులు వచ్చాయి. భారీ బడ్జెట్‌

Updated : 06 Sep 2022 15:27 IST

హైదరాబాద్‌: ‘బాహుబలి’ తర్వాత భారతీయ సినిమా మేకింగ్‌ విషయంలో అనేక మార్పులు వచ్చాయి. భారీ బడ్జెట్‌ చిత్రాలు వెండితెరను పలకరిస్తున్నాయి. ఈ క్రమంలో మరో చిత్రం ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ వంటి చిత్రాలకు కథా రచయితగా పనిచేసిన విజయేంద్రప్రసాద్‌ రచనలో ఈ అద్భుత దృశ్యకావ్యం పట్టాలెక్కనుంది. బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా పోరాడిన ఆశ్రమ వాసుల కథతో రూపొందనున్న చిత్రం ‘1770’. అగ్ర దర్శకుడు రాజమౌళి వద్ద ‘ఈగ’, ‘బాహుబలి’ చిత్రాలకు పనిచేసిన అశ్విన్‌ గంగరాజు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

బంకించంద్ర ఛటర్జీ రాసిన బెంగాలీ నవల ‘ఆనందమఠ్‌’ ఆధారంగా విజయేంద్రప్రసాద్‌ ఈ కథను తీర్చిదిద్దారు. ‘వందేమాతరం’ గీతాన్ని రాసి 150 సంవత్సరాలు అవుతున్న తరుణంలో ఈ సినిమాను రూపొందిస్తుండటం గమనార్హం. ‘వందేమాతరం’ అనే పదంలో అద్భుతమైన మేజిక్‌ ఉందని ఈ సందర్భంగా విజయేంద్రప్రసాద్‌ అన్నారు. తెలుగుతో పాటు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ భాషల్లో ‘1770’ విడుదల కానుంది.  నటీనటులు ఇతర సాంకేతిక నిపుణులను త్వరలోనే ప్రకటించనున్నారు. అశ్విన్‌ గంగరాజు గతంలో ‘ఆకాశవాణి’ చిత్రాన్ని తెరకెక్కించారు. నేరుగా ఓటీటీలో విడుదలైన ఈ సినిమా అంతగా మెప్పించలేదు. ఇప్పుడు ఏకంగా ఇంత పెద్ద ప్రాజెక్టును అశ్విన్‌ గంగరాజు చేపట్టడం విశేషం. రాజమౌళికి కాకుండా విజయేంద్రప్రసాద్‌ గతంలో కథ అందించిన ‘మణికర్ణిక’, ‘బజరీంగీ భాయీజాన్‌’, ‘మెర్సెల్‌’ చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాలను అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ‘1770’కి కథ అందించడంతో ఈ సినిమాపైనా మంచి అంచనాలు నెలకొన్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని