99Songs Review: రివ్యూ: 99 సాంగ్స్‌

ఏఆర్‌ రెహమాన్‌ కథతో తెరకెక్కిన ‘99 సాంగ్స్‌’ ఎలా ఉంది?

Updated : 16 Apr 2021 15:03 IST

చిత్రం: 99 సాంగ్స్‌; న‌టీన‌టులు: ఇహాన్ భ‌ట్‌, ఎడిల్సీ వ‌ర్గ‌స్‌, ఆదిత్య సియోల్‌, మ‌నీషా కొయిరాలా, లీసా రే, టెంజిన్ డ‌ల్హ‌, థామ‌స్ ఆండ్రూస్ త‌దిత‌రులు; సంగీతం, క‌థ‌: ఎ.ఆర్‌.రెహ‌మాన్‌; ఛాయాగ్ర‌హ‌ణం: త‌నయ్‌, జేమ్స్ కౌలీ, కూర్పు: అక్ష‌య్ మెహ‌తా, శ్రేయాస్.బి;  స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం:  విశ్వేష్ కృష్ణ‌మూర్తి; సంస్థ‌: ఐడియ‌ల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, వై.ఎమ్‌.మూవీస్‌; విడుద‌ల‌: జియో స్టూడియోస్; విడుద‌ల తేదీ:  16-04-2021

స్కార్ విజేత ఎ.ఆర్‌.రెహమాన్. ఆయ‌న పేరు చెప్ప‌గానే మొద‌ట గుర్తుకొచ్చేది సంగీత‌మే. అయితే రెహమాన్‌లో కేవ‌లం సంగీత ద‌ర్శ‌కుడే కాదు, మంచి క‌థకుడు కూడా ఉన్నారు. ఆయ‌న క‌థ‌తోనే ‘99 సాంగ్స్‌’ చిత్రం రూపొందింది. ఈ చిత్రానికి నిర్మాత కూడా రెహమానే. 99 సాంగ్స్ పేరుతో ఆయ‌న సినిమాని ప్ర‌క‌టించ‌గానే అంద‌రిలోనూ ఈ చిత్రంపై ప్ర‌త్యేక‌మైన ఆస‌క్తి ఏర్ప‌డింది. ఇప్ప‌టికే ప్ర‌పంచంలోని ప‌లు చిత్రోత్స‌వాల్లో ప్ర‌ద‌ర్శిత‌మైన ఈ సినిమా... కాస్త ఆల‌స్యంగా భార‌తీయ ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది.  తెలుగుతో పాటు ప‌లు భాష‌ల్లో విడుద‌లైన ఈ చిత్రం ఎలా ఉంది? అసలు కథేంటి?

క‌థేంటంటే: జై (ఇహాన్‌భ‌ట్‌)కి చిన్న‌ప్ప‌ట్నుంచి సంగీతంపై మ‌క్కువ‌. కానీ, అత‌ని తండ్రికి సంగీతంపై స‌దాభిప్రాయం ఉండ‌దు. సంగీతం మ‌న జీవితాల్నే నాశ‌నం చేసిందని చెబుతూనే త‌న కొడుకుని పెంచి పెద్ద చేస్తాడు. కానీ, తండ్రి మాట‌లు పెడ‌చెవిన పెట్టిన  జై పెద్ద‌య్యాక  సంగీతం వైపే వెళ‌తాడు. ఈ క్ర‌మంలో అత‌ను సోఫీ (ఎడిల్సీ వ‌ర్గ‌స్)  అనే యువ‌తి ప్రేమ‌లో ప‌డ‌తాడు. ఆమె తండ్రి పేరున్న వ్యాపారవేత్త‌.  సంగీతానికి సంబంధించిన వ్యాపారాన్ని అప్ప‌జెబుతాన‌ని, అందుకు ఒప్పుకుంటే త‌న కూతురుని ఇస్తాన‌ని చెబుతాడు. కానీ, సంగీతాన్ని వ్యాపారంలా చూడ‌టం త‌న‌కి ఇష్టం లేదని, ఒక్క పాట ప్ర‌పంచాన్ని మార్చేస్తుంద‌ని చెబుతాడు. ఒక్క పాట కాదు... వంద పాట‌లు చెయ్ , వాటితో ఏం మారుస్తావో చూస్తా అంటూ స‌వాల్ విసురుతాడు సోఫీ తండ్రి. అలా పాట‌ల ప్ర‌యాణం మొద‌లుపెట్టిన జైకి జీవితంలో ఎలాంటి ఆటుపోట్లు ఎదుర‌య్యాయి. అత‌ను అనుకున్న‌ట్టుగా తాను చేసిన ఆ ఒక్క పాట ఎవ‌రిపై ఎలాంటి ప్ర‌భావం చూపించింది? త‌దిత‌ర విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే: ‘చూపు కంటే కూడా అనుభూతి గొప్ప‌ది. అనుభూతిని పంచే ఓ గొప్ప శ‌క్తి సంగీతానికి ఉంది’.. ‘ప్ర‌పంచంలో మిగిలిన ఒకే ఒక్క మేజిక్‌... మ్యూజిక్‌’  - ఈ త‌ర‌హా సంభాష‌ణలు సినిమాలో వినిపిస్తాయి. ఆ మాట‌లు నిజ‌మే కానీ...  సంగీతం నేప‌థ్యంలో సాగే ఈ క‌థ మాత్రం ప్రేక్ష‌కుల‌కు పెద్ద‌గా అనుభూతిని పంచ‌కుండానే ముగుస్తుంది. ఒక ప్రేమ జంట నేప‌థ్యంలో సాగే క‌థ ఇది. ఆ జంట‌ని విధి ఎలా విడదీసింది? మ‌ళ్లీ ఎలా క‌లిపిందనే విష‌యాల్ని సంగీతంతో ముడిపెట్టిన తీరు మెప్పిస్తుంది. ఎ.ఆర్‌.రెహ‌మాన్ సంగీతంపై ప్రేమ‌ని చాటుతూ, ఆ నేప‌థ్యంలో ఓ మంచి క‌థ‌నే రాసుకున్నారు. అయితే ఆ క‌థ‌కి త‌గ్గ‌ట్టుగా క‌థ‌నం లేకపోవ‌డంతో సినిమా ఏ ద‌శ‌లోనూ ఆస‌క్తిని రేకెత్తించ‌దు. ఆరంభం, ప్రేమ జంట మ‌ధ్య ఎడ‌బాటు, షిల్లాంగ్‌లో సంగీత సాధ‌న వ‌ర‌కూ ప‌ర్వాలేద‌నిపించినా... ఆ త‌ర్వాత క‌థలో బ‌లం త‌గ్గింది. కొన్ని స‌న్నివేశాలు గంద‌ర‌గోళాన్ని రేకెత్తిస్తాయి. 

క‌థానాయ‌కుడి తండ్రి సంగీతం మ‌న జీవితాల్ని నాశ‌నం చేసింద‌ని చెప్పే మాటలు త‌ర‌చూ వినిపిస్తుంటాయి. దానికి ఫ్లాష్ బ్యాక్‌లో మ‌రో బ‌ల‌మైన క‌థేమైనా ఉందేమో అనుకుంటారంతా. కానీ, ఆ స‌న్నివేశాలు చాలా చ‌ప్ప‌గా, ఏ మాత్రం భావోద్వేగాల్ని పంచ‌కుండా సాగుతాయి. చివ‌ర్లో క‌థ‌ని మ‌లుపు తిప్పే  పాట ఒక‌టి ఉంటుంది. అందులోనైనా మేజిక్ క‌నిపిస్తుందేమో అని చూస్తే, ఆ పాట‌లో భావం త‌ప్ప సంగీతంతో జోష్ తెచ్చిందేమీ లేదు. దాంతో పతాక స‌న్నివేశాలు కూడా సాదాసీదా ముగుస్తాయి.  క‌ళాత్మ‌కత ఉట్టిప‌డే స‌న్నివేశాలు...  కొన్ని విన‌సొంపైన గీతాలు, నేప‌థ్య సంగీతంతో కొన్ని చోట్ల మెరుపులు కనిపిస్తాయంతే. ‘జాతీయ గీతం ఉంటుంది త‌ప్ప‌... జాతీయ ప్ర‌సంగం ఉండ‌దు క‌దా’ అంటూ సంగీతం గొప్ప‌ద‌నం గురించి చెప్పిన మాట‌లు ఆక‌ట్టుకుంటాయి.

ఎవ‌రెలా చేశారంటే: కొత్త న‌టీన‌టులు ఇహాన్, ఎడిల్సీ చ‌క్క‌టి అభిన‌యం ప్ర‌ద‌ర్శించారు. భావోద్వేగాల్ని ప‌లికించ‌డంలో అనుభ‌వం ఉన్న న‌టుల్లా పాత్ర‌ల్లో ఇమిడిపోయారు.  లీసారే, మ‌నీషా కొయిరాలా త‌దిత‌ర ప్ర‌ధాన తారాగ‌ణం సినిమాలో ఉంది కానీ... నాయ‌కానాయిక‌లు, పోలో అనే స్నేహితుడి పాత్ర‌కి మిన‌హా మిగిలిన పాత్ర‌ల‌కి పెద్ద‌గా ప్రాధాన్యం లేదు.  సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా ఉంది.  కెమెరా మేజిక్ చేసింది. రెహ‌మాన్ సంగీతం చిత్రానికి మ‌రో ఆక‌ర్ష‌ణ‌. అయితే కీల‌క‌మైన సంద‌ర్భాల్లో వ‌చ్చే పాటలు కూడా  చ‌ప్ప‌గా సాగ‌డం సినిమాకి మైన‌స్‌.  క‌థ‌కుడిగా రెహ‌మాన్‌కి మంచి మార్కులే ప‌డ‌తాయి. విశ్వేష్ కృష్ణ‌మూర్తి క‌థ‌నం ప‌రంగా పెద్ద‌గా ప్ర‌భావం చూపించ‌లేక‌పోయారు. కొన్ని స‌న్నివేశాల్లో మిన‌హా ఫీల్ పండ‌లేదు.  నిర్మాణ విలువ‌లు ఉన్న‌తంగా ఉన్నాయి.  సంభాష‌ణ‌లు ఆక‌ట్టుకుంటాయి.

బ‌లాలు బ‌ల‌హీన‌త‌లు
+ క‌థా నేప‌థ్యం - క‌థ‌నం
+ నాయ‌కానాయిక‌లు - ప‌తాక స‌న్నివేశాలు
+ ప్ర‌థమార్ధం  

చివ‌రిగా: 99 సాంగ్స్‌...  సంగీత ప్ర‌ణ‌యగాథ

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని