Tollywood: కనపడేది.. వచ్చే ఏడాది

‘ఏడాదికి ఒక్క సినిమా’ అంటూ లెక్కలేసుకొని ముందుకెళ్లే రోజులు కావివి. రోజులు మారాయి. పోటీ పెరిగింది. నిధానమే ప్రధానమన్నట్లుగా తీరిగ్గా సినిమాలు చేసే తారలంతా ఇప్పుడు గేరు మార్చి స్పీడు పెంచారు.

Updated : 14 Dec 2022 08:57 IST

2022లో తెలుగు తెరపై సందడి చేయని తారలు
2023 పైనే అభిమానుల ఆశలు

‘ఏడాదికి ఒక్క సినిమా’ అంటూ లెక్కలేసుకొని ముందుకెళ్లే రోజులు కావివి. రోజులు మారాయి. పోటీ పెరిగింది. నిధానమే ప్రధానమన్నట్లుగా తీరిగ్గా సినిమాలు చేసే తారలంతా ఇప్పుడు గేరు మార్చి స్పీడు పెంచారు. అగ్ర కథానాయకులు సైతం ఏక కాలంలో రెండు మూడు చిత్రాలతో జోరు చూపిస్తున్నారు. ఇక కథానాయికల జోరు గురించి ప్రత్యేకంగా చెప్పే పనేలేదు. ఈ ఏడాదిలో దాదాపు నాయకానాయికలందరూ తీరిక లేకుండానే గడిపారు. కొందరు రెండు మూడు చిత్రాలతో బాక్సాఫీస్‌ ముందు సందడి చేశారు. అయితే మరికొందరి ప్రయాణం మాత్రం ఇందుకు భిన్నంగా సాగింది. బోణీ కొట్టకుండానే 2022కు వీడ్కోలు పలుకుతున్నారు.

తేడాది ఆఖర్లో ‘అఖండ’తో బాక్సాఫీస్‌ ముందుకొచ్చి.. భారీ వసూళ్లతో సత్తా చాటారు కథానాయకుడు బాలకృష్ణ (Balakrishna). కొవిడ్‌ ఉద్ధృతి తర్వాత ప్రేక్షకులు థియేటర్లకు రావట్లేదని సినీ వర్గాలు ఆందోళన చెందుతున్న తరుణంలో ఈ సినిమాతో పరిశ్రమకు కొత్త ఊపిరి ఊదారు బాలయ్య. అయితే ఆయన నుంచి ఈ ఏడాది ఒక్క చిత్రమూ రాలేదు. ‘అఖండ’ (Akhanda) విడుదలైన వెంటనే గోపీచంద్‌ మలినేనితో కలిసి ‘వీరసింహారెడ్డి’ని పట్టాలెక్కించినప్పటికీ.. కొవిడ్‌ మూడో దశ ఉద్ధృతి, చిత్రీకరణల బంద్‌ తదితర కారణాల వల్ల చిత్రీకరణ ఆలస్యమైంది. ఇప్పుడీ సినిమాతోనే సంక్రాంతి బరిలో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు బాలకృష్ణ. ఆయన బాటలోనే గతేడాది చివర్లో ‘పుష్ప’గా (Pushpa) ప్రేక్షకుల ముందుకొచ్చి.. జాతీయ స్థాయిలో మెరుపులు మెరిపించారు కథానాయకుడు అల్లు అర్జున్‌ (Allu Arjun). దీని తర్వాత ఆయన నుంచీ మరో సినిమా రాలేదు. అయితే దీనికి కారణం లేకపోలేదు. ‘పుష్ప2’ పూర్తయ్యే వరకు మరో సినిమా చేయకూడదని బన్నీ నిర్ణయించుకోవడంతో 2022లో ఆయన ఖాతా తెరవలేదు. నిజానికి దీన్ని ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని తొలుత లక్ష్యం పెట్టుకున్నారు. కానీ, ‘పుష్ప’ తొలి భాగానికి దక్కిన ఆదరణ ‘పుష్ప2’పై అంచనాల్ని భారీగా పెంచేసింది. దీంతో చిత్ర బృందం ఇందుకు తగ్గట్లుగానే కథను భారీ హంగులతో సరికొత్తగా తీర్చిదిద్దుకోవాల్సి వచ్చింది. ఫలితంగానే ఆరంభంలో పట్టాలెక్కాల్సిన ఈ సినిమా.. చివర్లో సెట్స్‌పైకి వచ్చింది. మంగళవారం నుంచే హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్‌ ప్రారంభమైనట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది చివర్లో ఈ సినిమాతో మళ్లీ తెరపై మెరవనున్నారు అల్లు అర్జున్‌.

కథలు కుదరాలే కానీ.. ఏడాది రెండు మూడు చిత్రాలైనా చకచకా చేసేస్తుంటారు కథానాయకుడు సాయిధరమ్‌ తేజ్‌ (Saidharam Tej). కెరీర్‌ ఆరంభం నుంచి ఆయన ఇదే రీతిలో జోరు చూపించారు. అయితే గతేడాది ‘రిపబ్లిక్‌’ చిత్ర విడుదలకు ముందు తేజు అనుకోకుండా రోడ్డు ప్రమాదానికి గురవ్వడంతో.. ఆరు నెలలకు పైగా సినిమాలకు దూరంగా ఉండాల్సి వచ్చింది. దీంతో ఆయన ఈ ఏడాది ఒక్క సినిమానీ ప్రేక్షకుల ముందుకు తీసుకురాలేకపోయారు. సాయితేజ్‌ ప్రస్తుతం ‘విరూపాక్ష’తో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. కార్తీక్‌ దండు తెరకెక్కిస్తున్న ఈ మిస్టీక్‌ థ్రిల్లర్‌.. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 21న థియేటర్లలోకి రానుంది. కెరీర్‌ ఆరంభం నుంచీ ఒకటి తర్వాత ఒకటి అన్నట్లుగా నెమ్మదిగా సినిమాలు చేస్తూ వస్తున్నారు కథానాయకుడు అఖిల్‌ అక్కినేని. ఆయన ఈ పంథాని ఈ ఏడాదీ కొనసాగించారు. ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’తో గతేడాదికి వీడ్కోలు చెప్పిన ఆయన.. ఈ సంవత్సరం ఒక్క చిత్రం చూపించలేకపోయారు. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో చేస్తున్న ‘ఏజెంట్‌’తో ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రావాలని ప్రయత్నించినప్పటికీ.. చిత్రీకరణ ఆలస్యమవడం వల్ల అది సాధ్యపడలేదు. ప్రస్తుతం ముగింపు దశ చిత్రీకరణలో ఉన్న ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌.. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. 


ఈ నాయికలూ కనిపించలేదు..

‘అరుంధతి’, ‘భాగమతి’ చిత్రాలతో నాయికా ప్రాధాన్య చిత్రాలకు చిరునామాగా మారిన అనుష్క.. అవకాశాలను అందిపుచ్చుకునే విషయంలో మరీ ఆచితూచి వ్యవహరిస్తోంది. అందుకే కొన్నాళ్లుగా ఆమె నుంచి ఏడాదికి ఒక్కో చిత్రం రావడమే గగనమైపోయింది. ‘నిశ్శబ్దం’ తర్వాత రెండేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉండటంతో ఈ ఏడాది ఒక్క సినిమానీ ప్రేక్షకుల ముందుకు తేలేకపోయింది. ఆమె ప్రస్తుతం యువ కథానాయకుడు నవీన్‌ పొలిశెట్టితో ఓ సినిమా చేస్తోంది. మహేష్‌బాబు తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని యువీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. ‘కాటమరాయుడు’ తర్వాత మూడేళ్ల పాటు సినిమాలకు దూరంగా గడిపింది శ్రుతిహాసన్‌. ఆమె ‘క్రాక్‌’ వంటి హిట్‌తో గతేడాది ఘనంగా రీఎంట్రీ ఇచ్చింది. అక్కడి నుంచి మునుపటిలా వరుస సినిమాలతో జోరు చూపాలని ప్రణాళిక రచించింది. అందుకు తగ్గట్లుగానే ‘సలార్‌’, ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’ వంటి భారీ ప్రాజెక్ట్‌ల్లో అవకాశాలు అందుకుంది. అయితే చిత్రీకరణలో జాప్యం కారణంగా ఈ మూడు సినిమాల్లో ఏ ఒక్కటీ ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రాలేదు. అయితే ఈలోటును కొత్త ఏడాదిలో వడ్డీతో సహా తిరిగి వడ్డించనుంది శ్రుతి. సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’ చిత్రాలతో డబుల్‌ ట్రీట్‌ అందించనుంది. అలాగే ద్వితీయార్ధంలో ‘సలార్‌’తో సందడి చేయనుంది. ఈ ఏడాది హిందీలో ఏకంగా నాలుగు సినిమాలతో సందడి చేసింది నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. కానీ, ఆమె తెలుగులో ఒక్క చిత్రాన్నీ అందించలేకపోయింది. కొన్నాళ్లుగా పూర్తిగా హిందీ సీమపైనే దృష్టి పెట్టిన ఈ అమ్మడు.. తెలుగులో కొత్తగా ఏ కథకీ ఓకే చెప్పలేదు. ఫలితంగానే ‘కొండపొలం’ తర్వాత ఆమె నుంచి మరో తెలుగు సినిమా రాలేదు. ప్రస్తుతం ఆమె కమల్‌హాసన్‌తో కలిసి ‘భారతీయుడు 2’లో.. శివ కార్తికేయన్‌తో కలిసి ‘అయలాన్‌’లో నటిస్తోంది. ఈ రెండు చిత్రాలూ అనువాదాలుగా వచ్చే ఏడాది తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని