Aa Ammayi Gurinchi Meeku Cheppali Review: రివ్యూ: ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి

Aa Ammayi Gurinchi Meeku Cheppali Review: సుధీర్‌బాబు, కృతిశెట్టి జంటగా ఇంద్రగంటి మోహనకృష్ణ తెరకెక్కించిన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ ఎలా ఉందంటే?

Updated : 16 Sep 2022 13:22 IST

చిత్రం: ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి; నటీనటులు: సుధీర్ బాబు, కృతి శెట్టి, అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు; సంగీతం: వివేక్ సాగర్; ఛాయాగ్ర‌హ‌ణం: పీజీ విందా; క‌ళ‌: సాహి సురేష్;  కూర్పు: మార్తాండ్ కె వెంకటేష్; పాట‌లు: సిరివెన్నెల సీతారామ శాస్త్రి, రామ జోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్; సంస్థ‌: మైత్రీ మూవీ మేకర్స్, బెంచ్‌మార్క్ స్టూడియోస్; నిర్మాతలు: బి మహేంద్ర బాబు, కిరణ్ బల్లపల్లి; సమర్పణ:  గాజులపల్లె సుధీర్ బాబు; రచన, దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి; విడుద‌ల‌: 16-09-2022

స్టార్లు, వాళ్ల ఇమేజ్  కంటే కూడా తాను రాసుకున్న క‌థతోపాటే ప్ర‌యాణం చేయ‌డానికి ఇష్ట‌ప‌డే ద‌ర్శ‌కుడు ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ. జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా  ఆయ‌న క‌థ ఎవ‌రిని కోరుకుంటే వాళ్ల‌తోనే సినిమాలు తీస్తుంటారు.   ఇంటిల్లిపాదీ క‌లిసి చూసేలా సినిమాలు చేసే ద‌ర్శ‌కుడిగా పేరున్న ఆయ‌న ‘స‌మ్మోహ‌నం’, ‘వి’ త‌ర్వాత మ‌రోసారి సుధీర్‌బాబుతో జ‌ట్టు క‌ట్టారు. ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అంటూ ప్రేక్ష‌కుల ముందుకొచ్చారు. మ‌రి ఈ చిత్రం ఎలా ఉంది? సుధీర్‌బాబు, కృతిశెట్టి జోడి ఎలా మెప్పించింది?

క‌థేంటంటే: న‌వీన్  (సుధీర్‌బాబు) వ‌రుస విజ‌యాల‌తో దూసుకెళుతున్న సినీ ద‌ర్శ‌కుడు. త‌దుప‌రి సినిమాని రాకుమారిలాంటి ఓ అంద‌మైన  అమ్మాయి నేప‌థ్యంలో తీయాల‌నుకుంటాడు. క‌థంటూ ఏమీ సిద్ధం కాక‌పోయినా అనుకోకుండా అత‌నికొక సినిమా  రీల్ దొరుకుతుంది. అందులో ఓ అంద‌మైన అమ్మాయి  క‌నిపిస్తుంది. ఆమె ఎవ‌రా అని ఆరా తీసే క్ర‌మంలో కంటివైద్యురాలైన  డా.అలేఖ్య అని తెలుస్తుంది. ఎలాగైనా ఆమెని సినిమా కోసం ఒప్పించాల‌ని రంగంలోకి దిగుతాడు న‌వీన్‌. ఆమె మాత్రం సినిమా అంటేనే త‌న‌కీ, త‌న కుటుంబానికీ ఏమాత్రం న‌చ్చ‌దని తిర‌స్క‌రిస్తుంది. అలాంటి అమ్మాయి  కొన్ని ప‌రిణామాల త‌ర్వాత సినిమాలో న‌టించ‌డానికి అంగీకారం తెలుపుతుంది. ఇంత‌కీ ఆమె ఒప్పుకోవ‌డానికి కార‌ణ‌మేంటి?   అలేఖ్య‌కీ... న‌వీన్‌కి దొరికిన రీల్‌కీ సంబంధ‌మేంటి? న‌వీన్ సినిమా  తీశాడా లేదా? అనేది మిగ‌తా క‌థ‌.

ఎలా ఉందంటే: సుధీర్‌బాబు - ఇంద్ర‌గంటి ఇదివ‌ర‌కు క‌లిసి చేసిన ‘స‌మ్మోహ‌నం’ త‌ర‌హాలో ఇది కూడా సినీ ప‌రిశ్ర‌మ చుట్టూ సాగే కథే.  సంప్ర‌దాయ కుటుంబంలో పుట్టి పెరిగిన ఓ అమ్మాయి, ఆమె క‌ల‌లు, కుటుంబంలో సంఘ‌ర్ష‌ణ‌, క‌మ‌ర్షియ‌ల్ ద‌ర్శ‌కుడిగా పేరు సంపాదించుకున్న ఓ యువ‌కుడి జీవిత నేప‌థ్యం  ఈ సినిమాలో కీల‌కం. క‌థానాయ‌కుడిని క‌మ‌ర్షియ‌ల్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ ప్రేక్ష‌కుల్ని నేరుగా క‌థ‌లోకి తీసుకెళ్లాడు ఇంద్ర‌గంటి. దగుల్బాజీ, క‌స‌క్‌, మొద‌టి మగాడు అంటూ సినిమా పేర్ల‌తో అక్క‌డ‌క్క‌డా వ్యంగాస్త్రాలు సంధిస్తూ వినోదం పంచారు. ఆరంభ స‌న్నివేశాలు ఆక‌ట్టుకున్నా ఆ త‌ర్వాత సినిమాలో వేగం త‌గ్గుతుంది. విరామానికి ముందు స‌న్నివేశాలతో మ‌ళ్లీ ఆస‌క్తిని రేకెత్తించారు ద‌ర్శ‌కుడు. అక్క‌డ మ‌లుపు బాగుంది.

ద్వితీయార్ధంలో భావోద్వేగాల‌తో క‌ట్టిప‌డేసే ప్ర‌య‌త్నం చేశారు. ఫ్లాష్‌బ్యాక్ స‌న్నివేశాలు, ఆ త‌ర్వాత  క‌థానాయిక సినిమా చేయ‌డానికి ఒప్పుకోవ‌డం, సినిమా చిత్రీక‌ర‌ణ‌, నాయ‌కానాయిక‌లు ఒక‌రికొక‌రు ద‌గ్గ‌ర‌య్యే క్ర‌మం, అనూహ్యంగా చోటు చేసుకునే ప‌రిణామాలు... ఇలా ప్ర‌థ‌మార్ధంతో పోలిస్తే ద్వితీయార్ధం స‌న్నివేశాలు బ‌లంగా అనిపిస్తాయి.  ప‌తాక స‌న్నివేశాలు మ‌న‌సుల్ని హ‌త్తుకునేలా ఉంటాయి. ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ ఈ క‌థ‌లో భావోద్వేగాల‌పై ఎక్కువ‌గా దృష్టిపెట్టారు. ఒక  సినిమా ప్రేక్ష‌కుల‌పై ఎంత ప్ర‌భావం చూపిస్తుందో ఈ క‌థలో చూపించిన తీరు బాగుంది. అరుదైన నేప‌థ్య‌మే అయినా క‌థ‌, క‌థ‌నాలు చాలా వ‌ర‌కు  ప్రేక్ష‌కుడి ఊహ‌కు త‌గ్గ‌ట్టుగా సాగ‌డం,  స‌న్నివేశాల్లో వేగం త‌గ్గ‌డం సినిమాకి కాస్త మైన‌స్‌.

ఎవ‌రెలా చేశారంటే: సుధీర్‌బాబు, కృతిశెట్టి జోడీ ఆక‌ట్టుకుంటుంది. ద‌ర్శ‌కుడి పాత్ర‌లో సుధీర్ చ‌క్క‌టి అభిన‌యం ప్ర‌ద‌ర్శించారు. కృతిశెట్టి ఇప్ప‌టివ‌ర‌కు ఇలాంటి ప్ర‌య‌త్నం చేయ‌లేదు. స‌వాళ్ల‌తో కూడిన ఇందులోని పాత్ర‌కి ఆమె న్యాయం చేసింది.  వెన్నెల‌కిషోర్  న‌వ్వించారు. రాహుల్ రామ‌కృష్ణ‌, శ్రీకాంత్ అయ్యంగార్, అవ‌స‌రాల త‌దిత‌రులు పాత్ర‌ల ప‌రిధి మేర‌కు అభిన‌యం ప్ర‌ద‌ర్శించారు.  సాంకేతికంగా సినిమా బాగుంది. సంద‌ర్భోచితంగా సాగే అర్థ‌వంత‌మైన పాట‌లు, సంగీతం, కెమెరా పనిత‌నం చిత్రానికి బ‌లాన్నిచ్చాయి. ద‌ర్శ‌కుడు ఇంద్ర‌గంటి క‌మ‌ర్షియ‌ల్ సినిమాల వాతావ‌ర‌ణాన్ని చూపించారు త‌ప్ప‌, సినిమాలో మాత్రం క‌మ‌ర్షియ‌ల్  హంగుల్ని జోడించ‌లేక‌పోయారు.  నిర్మాణం బాగుంది.

బ‌లాలు

+ సుధీర్ - కృతిశెట్టి న‌ట‌న

+ క‌థ‌లో భావోద్వేగాలు

+ ప‌తాక స‌న్నివేశాలు

బ‌ల‌హీన‌త‌లు

- సాగ‌దీత‌గా కొన్ని స‌న్నివేశాలు

- ఊహ‌కు త‌గ్గ‌ట్టుగా సాగే క‌థ‌, క‌థ‌నం

చివ‌రిగా: భావోద్వేగాల్ని పంచే ఆ అమ్మాయి..

గమనిక: ఈ సమీక్షసమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts