రివ్యూ: శశి

ఆది కథానాయకుడిగా నటించిన ‘శశి’ సినిమా ఎలా ఉందంటే?

Updated : 07 Dec 2022 17:25 IST

చిత్రం: శశి; నటీనటులు: ఆది, సురభి, రాశీసింగ్‌, జయప్రకాశ్‌, రాజీవ్‌ కనకాల, అజయ్‌, వైవా హర్ష; సంగీతం: అరుణ్‌ చివులూరు; సినిమాటోగ్రఫీ: అమరనాథ్‌ బొమ్మిరెడ్డి; ఎడిటింగ్‌: సత్య జి; నిర్మాత: ఆర్‌.పి.వర్మ, చావలి రామాంజనేయులు, చింతలపూడి శ్రీనివాసరావు; సంభాషణలు: ఐ.రవి; కథ, దర్శకత్వం: శ్రీనివాస్‌ నాయుడు నడికట్ల; విడుదల: 19-03-2021

ఒకే ఒక‌ పాట‌తో కొన్ని సినిమాలు ప్రేక్షకుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటాయి. ఆ కోవ‌లోకే వ‌స్తుంది శ‌శి చిత్రం. ఇందులోని ‘ఒకే ఒక లోకం నువ్వే’ పాట శ్రోత‌ల్ని విప‌రీతంగా అల‌రించి, సినిమాపై ఆస‌క్తిని పెంచింది. ప్ర‌ముఖ క‌థానాయ‌కుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ ఈ సినిమా ట్రైల‌ర్ విడుద‌ల చేయ‌డంతో మరిన్ని అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. మ‌రి పాట మెప్పించినంత‌గా క‌థ మెప్పించిందా? అస‌లు శ‌శి క‌థ ఏంటి?

క‌థేంటంటే: రాజ్ కుమార్ (ఆది) ఎవ‌రి మాటా లెక్క‌చేయ‌కుండా త‌న‌కు న‌చ్చిన‌ట్టు ఉండాల‌నుకుంటాడు. ఎప్పుడూ మందు, సిగ‌రెట్ తాగుతూ క‌నిపిస్తాడు. రాజ్ అన్నయ్య (అజ‌య్) ఒక్క‌డే ఉద్యోగం చేస్తూ కుటుంబ భారాన్ని మోస్తుంటాడు. త‌మ్ముడిలో మార్పు కోసం ఎదురుచూస్తూ వివాహం కూడా చేసుకోడు. రాజ్‌ని ఎన్నో ర‌కాలుగా మార్చాల‌ని ప్ర‌య‌త్నించినా ఫ‌లితం ఉండ‌దు. ఈ క్రమంలో శశి (సురభి)ని కలుస్తాడు రాజ్‌. శ‌శి స‌మ‌స్యలో చిక్కుకుందని తెలుసుకుంటాడు. ఇంతకీ ఆ స‌మ‌స్య ఏంటి? దాన్ని రాజ్ ఎలా ప‌రిష్క‌రించాడు? అనేది తెరపై చూడాల్సిందే!

ఎలా ఉందంటే:  అన్న‌య్య ప‌ని చేస్తుంటే త‌మ్ముడు బాధ్య‌తారాహిత్యంగా తిరిగే సినిమాలు చాలానే వ‌చ్చాయి. ఇదీ అలాంటి క‌థే. అన్న‌దమ్ముల బంధంతోపాటు స్నేహం, ప్రేమ చుట్టూ తిరుగుతుంది. హీరో, ద్వితీయ నాయిక‌ రాక్‌స్టార్‌గా ఒక్క పాట‌కే ప‌రిమితమ‌య్యారు త‌ప్ప త‌మ‌ని తాము నిరూపించునేందుకు చేసే ప్ర‌య‌త్నాలు ఏవీ చూపించ‌క‌పోవ‌డం వెలితిగా ఉంటుంది. క‌థ‌లో అక్క‌డ‌క్క‌డా స్ప‌ష్ట‌త లోపించింది. కొన్ని పాత్ర‌లు అనవ‌స‌రంగా పెట్టేరేమో అనే భావ‌న క‌లుగుతుంది. ‌ప్ర‌థమార్ధంలో వ‌చ్చే ఫ్లాష్ బ్యాక్‌ ఎపిసోడ్ రొటీన్ స‌న్నివేశాల‌తో సాగుతుంది. ఎక్క‌డా కొత్త‌గా అనిపించ‌దు. ఆది సీరియ‌స్ లుక్‌లోనే ఎక్కువ‌గా ద‌ర్శ‌న‌మిస్తాడు. ఇంట‌ర్వెల్‌ స‌న్నివేశం నుంచి కాస్త ఉత్కంఠగా సాగుతుంది. సినిమాలోని ట్విస్ట్ తెలుసుకోవాల‌నే కుతూహ‌లం క‌లుగుతుంది. ద్వితీయార్ధంలో వెన్నెల కిశోర్‌, వైవా హ‌ర్ష కామెడీ సీన్లు ప్రేక్ష‌కుల‌కు వినోదం పంచుతాయి. ఇంజినీరింగ్ కాలేజీలోని ర్యాగింగ్‌, నాయకానాయిక‌ల మ‌ధ్య కెమిస్ట్రీ ఆక‌ట్టుకుంటుంది. ట్రూత్ ఆర్ డేర్ గేమ్‌తో హీరోహీరోయిన్ మ‌ధ్య రాసుకున్న సీన్లు మెప్పిస్తాయి. హీరోయిన్ తండ్రి, హీరో మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు భావోద్వేగాల్ని పండిస్తాయి. ‘ఒకే ఒక లోకం నువ్వే’ పాట తెర‌పై చూపిన తీరు బాగుంది.

ఎవ‌రెలా చేశారంటే: లుక్స్ ప‌రంగా, న‌ట‌న ప‌రంగా ఆది మెప్పించాడు. రాశీ సింగ్‌, సుర‌భి అందంతో ఆక‌ట్టుకున్నారు. అజ‌య్‌, జ‌య ప్ర‌కాశ్‌‌, రాజీవ్ క‌న‌కాల త‌దిత‌రులు త‌మ పాత్ర ప‌రిధి మేర‌కు మెప్పించారు. సాంకేతిక విలువ‌లు బాగున్నాయి. నేప‌థ్య సంగీతం ఓకే అనిపిస్తుంది. కెమెరా ప‌నిత‌నం చ‌క్క‌గా ఉంది. ద‌ర్శ‌కుడు క‌థ‌పై కాస్త శ్ర‌ద్ధ పెడితే బాగుండేది. మాట‌లు విష‌యానికొస్తే ఎక్క‌డో విన్నాం క‌దా అనే ఆలోచ‌న వ‌స్తుంది. రొటీన్ క‌థే అయినా కొత్త కోణంలో ఆవిష్క‌రించి ఉండాల్సింది.

బలాలు బ‌ల‌హీన‌త‌లు
+ ద్వితీయార్ధంలో వినోదం - క‌థ‌, క‌థ‌నం
+ ఆది, సుర‌భి న‌ట‌న‌ - ప్ర‌ధ‌మార్ధం

చివరిగా:  వెలుగులు తగ్గిన ‘శ‌శి’

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని