Tees Maar Khan: పక్కా వాణిజ్య సినిమా ఇది

‘‘అందరూ బాగుండాలి. అందులో మనం ఉండాలి. అన్ని సినిమాలు బాగుండాలి. అందులో మన సినిమా ఉండాలనుకుంటాను.

Updated : 18 Aug 2022 15:10 IST

‘‘అందరూ బాగుండాలి. అందులో మనం ఉండాలి. అన్ని సినిమాలు బాగుండాలి. అందులో మన సినిమా ఉండాలనుకుంటాను. మంచి మనుషులు కలిసి చేసిన ‘తీస్‌మార్‌ ఖాన్‌’ తప్పకుండా విజయవంతం అవుతుందనే నమ్మకం   ఉంది’’ అన్నారు ప్రముఖ నటుడు సాయికుమార్‌. ఆయన తనయుడు ఆది సాయికుమార్‌ కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రమే ‘తీస్‌మార్‌ ఖాన్‌’. పాయల్‌ రాజ్‌పూత్‌ కథానాయిక. కల్యాణ్‌ జి.గోగణ దర్శకత్వం వహించారు. డా.నాగం  తిరుపతిరెడ్డి నిర్మాత. చిత్రం ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకొస్తున్న సందర్భంగా ఇటీవల హైదరాబాద్‌లో విడుదలకి ముందస్తు వేడుకని నిర్వహించారు. కథానాయకులు సుధీర్‌బాబు, అడివి శేష్‌, సిద్ధు జొన్నలగడ్డ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సుధీర్‌బాబు మాట్లాడుతూ ‘‘నేను, ఆది కలిసి ‘శమంతకమణి’ చేశాం. అద్భుతమైన నటుడు. తనకి సరైన సినిమా అనిపిస్తోంది. పాటలు, ట్రైలర్‌ బాగున్నాయి. చిత్రం అలరిస్తుంద’’న్నారు. అడివి శేష్‌ మాట్లాడుతూ    ‘‘ట్రైలర్‌లో ఆది చాలా బాగా కనిపించాడు. అందరూ థియేటర్లలో చూడాలనేది నా కోరిక’’ అన్నారు. సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ ‘‘ఆది పాత్ర కొత్తగా అనిపిస్తోంది. సాయికార్తీక్‌ సంగీతం బాగుంది’’ అన్నారు. ఆది సాయికుమార్‌ మాట్లాడుతూ ‘‘చాలా రోజుల తర్వాత నేను చేసిన పక్కా వాణిజ్య చిత్రం ఇది. మంచి భావోద్వేగాలు ఉంటాయి. పాయల్‌ మంచి సహనటి. సునీల్‌ చేసిన చక్రి పాత్ర చాలా బాగుంటుంది. నన్ను కొత్తగా చూపించిన దర్శకుడు కల్యాణ్‌కి కృతజ్ఞతలు’’ అని చెప్పారు. ‘‘మూడేళ్ల తర్వాత నా సినిమా థియేటర్లో వస్తోంది. అందుకే నాకెంతో ప్రత్యేకం. నేనేమీ స్టార్ల కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిని కాను. నేనేం చేసినా సొంతంగా చేశా. ప్రేక్షకుల ప్రేమాభిమానంతోనే ఇంత దూరం ప్రయాణించా’’ అన్నారు కథానాయిక పాయల్‌ రాజ్‌పూత్‌. ఆది కెరీర్‌లోనే అత్యుత్తమమైన సినిమా ఇస్తానని చెప్పి ఈ సినిమా చేశానన్నారు నిర్మాత. ఈ కార్యక్రమంలో నటుడు శ్రీకాంత్‌ అయ్యంగార్‌, సంగీత దర్శకుడు సాయికార్తీక్‌ ఇతర చిత్రబృందం పాల్గొంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని