
Sashi: ఓటీటీలో అందుబాటులోకి వచ్చిన ఆది ‘శశి’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
హైదరాబాద్: ఒకే ఒక పాటతో కొన్ని సినిమాలు ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటాయి. ఆ కోవలోకే వస్తుంది ‘శశి’ చిత్రం. ఇందులోని ‘ఒకే ఒక లోకం నువ్వే’ పాట శ్రోతల్ని విపరీతంగా అలరించి, సినిమాపై ఆసక్తిని పెంచింది. ఆది, సురభి కీలక పాత్రల్లో శ్రీనివాస్ నాయుడు తెరకెక్కించిన ఈ చిత్రం గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా ఈ సినిమా ప్రముఖ ఓటీటీలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ అమెజాన్ ప్రైమ్వీడియో ట్రైలర్ను విడుదల చేసింది.
కథేంటంటే: రాజ్ కుమార్ (ఆది) ఎవరి మాటా లెక్కచేయకుండా తనకు నచ్చినట్టు ఉండాలనుకుంటాడు. ఎప్పుడూ మందు, సిగరెట్ తాగుతూ కనిపిస్తాడు. రాజ్ అన్నయ్య (అజయ్) ఒక్కడే ఉద్యోగం చేస్తూ కుటుంబ భారాన్ని మోస్తుంటాడు. తమ్ముడిలో మార్పు కోసం ఎదురుచూస్తూ వివాహం కూడా చేసుకోడు. రాజ్ని ఎన్నో రకాలుగా మార్చాలని ప్రయత్నించినా ఫలితం ఉండదు. ఈ క్రమంలో శశి (సురభి)ని కలుస్తాడు రాజ్. శశి సమస్యలో చిక్కుకుందని తెలుసుకుంటాడు. ఇంతకీ ఆ సమస్య ఏంటి? దాన్ని రాజ్ ఎలా పరిష్కరించాడు? అనేది తెరపై చూడాల్సిందే!