Aamir khan: వాటిని అంత తేలికగా అంచనా వేయలేం!

మహమ్మారి కరోనా.. థియేటర్ల ప్రారంభానికి సవాళ్లు విసురుతూ వస్తోంది. ఎప్పుడు థియేటర్లు తెరుచుకుంటాయో స్పష్టత రాక చిన్నచిత్రాలతో పాటు బడా హీరోలు వెంకటేశ్‌ ‘నారప్ప’ సూర్య ‘ఆకాశమే నీహద్దురా’.. ఇలా పలువురు ఓటీటీ బాట పట్టారు. తాజాగా నటుడు ఆమిర్‌ ఖాన్‌ ఓటీటీల్లో చిత్రాల విడుదలపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.

Published : 12 Aug 2021 15:06 IST

నటుడు ఆమిర్‌ ఖాన్‌

ముంబయి: కరోనా మహమ్మారి కారణంగా మూతబడిన థియేటర్లు ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్నాయి. అయితే, థియేటర్‌కు ప్రేక్షకులు ఏ స్థాయిలో వస్తారనేది ఇప్పటికీ ప్రశ్నార్థకమే. అందుకే వెంకటేశ్‌ ‘నారప్ప’ సూర్య ‘ఆకాశమే నీహద్దురా’.. ఇలా పలువురు ఓటీటీ వేదికగా వచ్చి సందడి చేశారు. తాజాగా నటుడు ఆమిర్‌ ఖాన్‌ ఓటీటీల్లో చిత్రాల విడుదలపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం పలు చిత్రాలు ఓటీటీ వేదికగా విడుదలవుతున్నాయి. ఒక సినిమా వ్యక్తిగా వారి నిర్ణయాన్ని గౌరవిస్తా. భవిష్యత్తులో ఈ పరిస్థితులు మెరుగుపడతాయని ఆశిస్తున్నా. సినిమా హాల్స్‌ పూర్తిస్థాయిలో ఎప్పుడు తెరుచుకుంటాయనది చెప్పడం అంత తేలికైన విషయం కాదు. పరిస్థితులు మెరుగుపడినప్పుడే ప్రారంభమవుతాయి. ఎక్కువ మంది టీకా ఎంత త్వరగా పొందితే.. అంత త్వరగా పరిస్థితులు చక్కబడతాయి. అప్పుడే కరోనాను నియంత్రణలోకి వచ్చి, థియేటర్లు తెరుచుకుంటాయి’’ అన్నారు.

పుష్పతో లాల్‌సింగ్‌ పోటీ..

ఆమిర్‌ ఖాన్‌ తదుపరి చిత్రం ‘లాల్‌ సింగ్‌ చద్దా’ క్రిస్మస్ రోజున ప్రేక్షకుల ముందుకు థియేటర్లలో సందడి చేయనుంది. 1994లో హాలీవుడ్‌లో విడుదలైన ‘ఫారెస్ట్ గంప్’కి చిత్రానికి ఇది రీమేక్. కామెడీ-డ్రామా జానర్‌లో రాబోతున్న చిత్రంలో కరీనా కపూర్ కథానాయికగా నటిస్తోంది. తెలుగు యువనటుడు నాగచైతన్య ఓ కీలక పాత్ర పోషించారు. అద్వైత్ చందన్ దర్శకుడు. ‘లాల్‌ సింగ్‌ చద్దా’ విడుదలరోజే అల్లుఅర్జున్‌ పాన్‌ ఇండియా చిత్రం ‘పుష్ప: పార్ట్‌-1’ కూడా థియేటర్లలో విడుదలవుతుండటంతో రెండు సినిమా మధ్య గట్టి పోటీ ఉంటుందన్న అభిప్రాయం సినీ ప్రేక్షకుల్లో వ్యక్తమవుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని