
Aarthi Agarwal: మళ్లీ వస్తావు కదా ఆర్తి..!
అది 2001 సెప్టెంబరు 6... గురువారం. ఎప్పటిలానే కొత్త సినిమా చూసేందుకు రాజమండ్రిలో పేరున్న ఓ థియేటర్‌కి వెళ్లాను. అదుగో అక్కడే ఆర్తి.. నిన్ను తొలిసారి చూశాను. పెద్ద పోస్టర్లో వెంకటేశ్ పక్కన. సినిమా పేరేమోగానీ నిజంగానే ఆ క్షణంలో ‘నువ్వు నాకు నచ్చావ్’. షోకి కాస్త సమయం ఉండటంతో నిన్నే చూస్తూ నిల్చున్నా. ఆహా! ఏమి అందం. చంద్రబింబం లాంటి ముఖం, నిండైన నీ రూపం నన్ను కట్టిపడేశాయి. సరే కొత్త అమ్మాయి కదా, కొన్ని రోజులు గడిస్తే మళ్లీ మామూలే. మరో నటి పరిచయం, తనని చూసినా ఇదే జరుగుతుంది అనుకుని థియేటర్ లోపలికి అడుగుపెట్టాను.
నందిని అలియాస్ నందుగా పరిచయం అయ్యావు. చిలిపితనంతో కూడిన నీ నటనతో నన్ను అమితంగా ఆకట్టుకున్నావు. బయట వాల్ పోస్టర్లో నీ రూపుని అంతగా పొగిడిన నాకు తెరపై నీ తీరుని చూసి నోట మాట రాలేదు. ఇంకో కొత్త నటి వస్తే ఇదే జరుగుతుందనే మాటను వెనక్కి తీసుకునేదాక మనసు ఊరుకోలేదు. ఎందుకంటే సినిమా సగం పూర్తయ్యేలోపే నువ్వు అందరిలాంటి అమ్మాయి కాదనుకున్నాను. అద్భుతమైన నటివి అని ఫిక్సయ్యాను. అలా ఆ రోజు నీ పేరు, నీ ప్రతిమని నాలో ముద్ర వేసుకున్నాను.
అది మొదలు ‘నువ్వు లేక నేను లేను’ అనుకుంటూ నీ సినిమాలన్నీ వీక్షించేవాణ్ని. ‘అల్లరి రాముడు’లో నీ అల్లరి, ‘ఇంద్ర’లో ప్రతినాయిక వైఖరి, ఉదయ్ కిరణ్‌తో ‘నీ స్నేహం’, మరోసారి వెంకటేశ్‌తో నటించిన ‘సంక్రాంతి’, ‘వసంతం’, మహేశ్ బాబుతో చేసిన ‘బాబీ’, రవితేజ సరసన ‘వీడే’, బాలకృష్ణతో జంటగా ‘పల్నాటి బ్రహ్మనాయుడు’, ప్రభాస్ పక్కన ‘అడవి రాముడు’, సునీత్‌తో ‘అందాల రాముడు’, తరుణ్‌తో ‘సోగ్గాడు’, నాగార్జునతో ‘నేనున్నాను’, రాజశేఖర్‌తో పండించిన ‘గోరింటాకు’... ఇలా అటు కుర్ర హీరోలతో ప్రేమకథలు, ఇటు సీనియర్ హీరోలతో వైవిధ్యభరిత పాత్రలు అందుకున్నావు. నిన్ను నువ్వు నిరూపించుకున్నావు. ఇలానే నీ కెరీర్ మరో స్థాయికి చేరుకుంటుందని ముచ్చటపడిన మాకు నువ్వు లేవంటే.. ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలుసా? అయినా అలా ఉన్నావ్.. ఇలా ఉన్నావ్ ఏంటి అని నిన్ను అడిగిందెవరు? నీకు ఆ శస్త్ర చికిత్స గురించి చెప్పిందెవరు? ఆర్తి. అచ్చు తెలుగు అమ్మాయిలా ఇక్కడి వారి మనసులు దోచుకున్న నువ్వు ఎక్కడో అమెరికాలో అస్తమించడం ఏంటి? ఆర్తి. నీ కోసం ఎదురుచూసే నాలాంటి అభిమానులు ఎంతోమంది ఉన్నారు. నీ నటన కోసం వెండి తెర సైతం వేచి చూస్తుంది. నువ్వెక్కడున్నా ఎప్పటిలానే నీ కీర్తిని కొనసాగించేందుకు మళ్లీ వస్తావు కదూ..!
(ఈ రోజు ఆర్తి అగర్వాల్ వర్థంతి)
ఇట్లు,
నీ అభిమాని.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.