
Acharya: మెగా అభిమానులకు గుడ్‌న్యూస్.. ‘ఆచార్య’ రిలీజ్‌ఎప్పుడంటే..!
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ఆచార్య’. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 4 విడుదల కావాల్సి ఉండగా.. కరోనా నేపథ్యంలో వాయిదా వేస్తున్నట్లు చిత్రబృందం శనివారం ప్రకటించింది. దీంతో నిరూత్సహ పడ్డ మెగా అభిమానులకు నేడు చిత్రయూనిట్ గుడ్‌న్యూస్ చెప్పింది. సోషల్‌మీడియా వేదికగా ‘ఆచార్య’ కొత్త రిలీజ్ డేట్‌ని వెల్లడించింది. ఉగాది సందర్భంగా ఏప్రిల్ 1న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇందులో చిరుకు జోడీగా కాజల్, చరణ్ సరసన పూజా హెగ్డే కనిపిస్తుంది. మణిశర్మ స్వరాలందిస్తున్నారు. కాగా.. ‘ఆచార్య’ విడుదల కానున్న తేదీనే సూపర్‌స్టార్ మహేశ్‌బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 1న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం గతంలోనే ప్రకటించింది.
ఇప్పటికే ఈ నెలలో విడుదల కావాల్సిన పాన్ ఇండియా చిత్రాలు ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’ వాయిదా పడ్డాయి. దీంతో ఖాళీ థియేటర్లను కొన్ని చిన్న సినిమాలు భర్తీ చేశాయి. అయితే, కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో వచ్చే నెలలో సినిమాల విడుదలపై ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 4న విడదుల కావాల్సిన ‘ఆచార్య’ చిత్రాన్ని నిర్మాణ సంస్థలు వాయిదా వేశాయి. ఏప్రిల్ నాటికి పరిస్థితులు చక్కదిద్దుకుంటాయన్న నమ్మకంతో ఈ కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటించాయి.