Acharya: సిద్ధ పాత్ర చరణ్‌ చేయకపోతే పవన్‌కల్యాణ్‌ బెస్ట్‌: చిరంజీవి

Acharya: ఆచార్య చిత్ర బృందం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో చిరంజీవి, రామ్‌చరణ్‌, కొరటాల శివ పంచుకున్న విశేషాలివి...

Updated : 26 Apr 2022 17:03 IST

హైదరాబాద్‌: నిజమైన తండ్రీకొడుకుల అనుబంధం ‘ఆచార్య’(Acharya) కథకు అదనపు బలాన్ని తీసుకొస్తుందనే ఉద్దేశంతోనే సిద్ధ పాత్ర కోసం చరణ్‌ (Ram charan)ను తీసుకున్నామని, ఒకవేళ ఆ పాత్రను చరణ్‌ చేసే అవకాశం లేకపోయినా, ఇంకా ఏ ఇతర నటులూ కుదరకపోయినా ఆ ఫీల్‌ ఒక్క పవన్‌కల్యాణ్‌ (Pawan kalyan)తోనే సాధ్యమని అగ్ర కథానాయకుడు చిరంజీవి(Chiranjeevi) అన్నారు. రామ్‌చరణ్‌తో కలిసి ఆయన నటించిన చిత్రం ‘ఆచార్య’(Acharya). కొరటాల శివ ఈ చిత్ర దర్శకుడు. పూజా హెగ్డే(Pooje hegde) కథానాయిక. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్‌ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. చిరంజీవి, రామ్‌చరణ్‌, కొరటాల శివ, పూజాహెగ్డేలు విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.

నిజ జీవితంలో మీరు ఆచార్యగా భావించింది ఎవరిని?

చిరంజీవి: నా జీవితంలో తారసపడే ప్రతి ఒక్కరి నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటా. అందుకే ప్రతి ఒక్కరినీ ‘ఆచార్య’గానే భావిస్తా.

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ షూట్‌ చేస్తున్నప్పుడు ఇందులో నటించా. రామరాజు పాత్ర నుంచి సిద్ధగా మారడానికి ఎంత సమయం పట్టింది?

రామ్‌చరణ్‌: కథ విన్న వెంటనే సిద్ధ పాత్రను ఆకళింపు చేసుకున్నా. ఇటీవల రాజమౌళి చెప్పినట్లు సెట్‌లోకి నేను తెల్ల కాగితంలా అడుగుపెడతా. కొరటాల చెప్పిన కథ, మాటలు వినే ఈ పాత్రను అర్థం చేసుకున్నా. చిరంజీవిగారి పక్కన చేయడం నిజంగా ఒత్తిడితో కూడుకొన్నదే. ఒళ్లు దగ్గర పెట్టుకుని ఈ సినిమా చేశా.

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ థియేటర్‌లో ఉండగానే మీరు నటించిన ‘ఆచార్య’(Acharya)విడుదలవుతోంది. దీన్ని మీరెలా ఫీలవుతున్నారు.

రామ్‌చరణ్‌: ఇది నా సినిమా కాదు. చిరంజీవిగారిది. నేను కేవలం అతిథి పాత్ర మాత్రమే చేస్తున్నా.

రామ్‌చరణ్‌ ద్వారా మీరేమైనా నేర్చుకున్నారా?

చిరంజీవి: చరణ్‌ ప్రవర్తన చూస్తుంటే నన్ను నేను అద్దంలో చూసుకున్నట్లే ఉంటుంది. దర్శకుడు అనుకున్నది వచ్చిందా? లేదా? అని చూసుకునేంత వరకూ కెమెరా ముందే ఉంటాడు. డైరెక్టర్‌ ఓకే చెప్పిన తర్వాత అక్కడి నుంచి బయటకు వెళ్తాడు. నేను పాటించే ప్రతి పద్ధతినీ తనూ అనుసరిస్తున్నాడు. ఇక సీన్‌ అయిపోయిన తర్వాత కారావ్యాన్‌లోకి వెళ్లిపోకుండా సెట్‌లో అందరితోనూ కలివిడిగా ఉంటాడు. నేను కూడా అలాగే చేసేవాడిని. రకరకాల వంటకాలు చేయించి, అందరికీ అందేలా చూస్తాడు.  అయితే, ఈ సినిమాకు మాత్రం మారేడుమిల్లిలో ఉండగా నాకు అన్యాయం జరిగింది. సురేఖను రమ్మంటే ‘వద్దు అమ్మా రావొద్దు’ అని ఆపేశాడు. ‘అమ్మ వస్తే నేను నీతో ఉండే సమయం తగ్గిపోతుంది. ఇలా కలిసి ఉండటం సాధ్యం కాదు’ అంటూ సురేఖను ఆపేశాడు. (నవ్వులు)

సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత చరణ్‌ను తండ్రికి తగ్గ తనయుడు అంటారా?

కొరటాల శివ:  చిరంజీవిగారి స్క్రీన్‌ ప్రెజెన్స్‌ వేరే లెవల్‌లో ఉంటుంది. తెరపై ఆయన ఉంటే కళ్లు మరొకరిపై ఉండవు. మారేడుమిల్లిలో ఒక సీన్‌ తీసిన తర్వాత మాకున్న భయమంతా పోయింది. కొన్ని సన్నివేశాల్లో చిరంజీవిని మరిపించేలా చరణ్‌ కనిపిస్తారు.

చిరంజీవి: నేను 1 నుంచి 150 సినిమా వరకూ నేర్చుకుంటూ వచ్చా. చరణ్‌ నా 150 సినిమాలను చూసి అక్కడి నుంచి తన ప్రయాణం మరింత మెరుగ్గా తీర్చిదిద్దుకున్నాడు.  నేను ‘అ ఆ’ల నుంచి మొదలు పెడితే చరణ్‌ ఏకంగా యూనివర్సిటీకి వెళ్లిపోయాడు.

శ్రీకాకుళంలోని సుబ్బారావు ప్రాణిగ్రాహి అనే వ్యక్తి  జీవిత కథ నుంచి ‘ఆచార్య’ తీసుకున్నారా?

కొరటాల శివ: ‘ఆచార్య’ పూర్తిగా ఫిక్షనల్‌ స్టోరీ. నాకు నేనుగా రాసుకున్న కథ. ఎవరినీ స్ఫూర్తిగా తీసుకోలేదు.

ఖైదీ నంబర్‌ 150 తర్వాత కొత్త దర్శకులతో పనిచేయడం ఎలా అనిపించింది?

చిరంజీవి: పాత.. పాతా కలిస్తే ఏమవుతుంది మోత తప్ప.  కొత్త ఆలోచనలకు స్వాగతం పలకాలి. అందుకే కొత్త వారిని ప్రోత్సహిస్తున్నా.

కమ్యూనిజం, కాషాయం ఒకే కథలో చూపించటం ఎలా అనిపించింది?

కొరటాల శివ: రెండూ వేర్వేరు అంశాలు. అయితే, మేము కేవలం నేపథ్యాలను మాత్రమే తీసుకున్నాం తప్ప ఆలయాలు, నక్సలిజం గురించి ఇందులో చెప్పటం లేదు. ఆ నేపథ్యాలు కలిగిన ఇద్దరు వ్యక్తుల కథ ఈ చిత్రంలో ఉంటుంది.

చిరంజీవి సినిమా అంటే థియేటర్లన్నీ హౌస్‌ఫుల్‌ అవుతాయి. అలాంటప్పుడు టికెట్‌ రేట్లు పెంచటం అవసరమా?

కొరటాల శివ: సినిమా బడ్జెట్‌ బట్టి టికెట్‌ రేట్లు పెంచాం తప్ప. పెంచాలి కాబట్టి ధరలు పెంచలేదు.

చిరంజీవి: కరోనా సమయంలో ప్రతి సంస్థ, రంగం కుదేల్‌ అయిపోయాయి.  అందుకు సినిమా ఇండస్ట్రీ మినహాయింపు ఏమీ కాదు. సినిమాలు ఆగిపోవడంతో వడ్డీలు పెరిగిపోయాయి. టికెట్‌ ధరలు పెంచి మమ్మల్ని ఆదుకోమని ప్రభుత్వాలను వేడుకున్నాం. ప్రజలపై భారం పడకుండా ధరలు పెంచారు.

సిద్ధ పాత్రలో పవన్‌కల్యాణ్‌ ఉంటే బాగుండేదనిపించిందా?

చిరంజీవి: చరణ్‌ కాకుండా మరే నటుడైనా సిద్ధ పాత్రకు న్యాయం చేసేవారే. అయితే, నిజ జీవితంలో తండ్రీకొడుకులు ఈ పాత్రలు చేస్తే, వాటి మధ్య అనుబంధం మరింత బలంగా తెరపై కనిపిస్తుంది. కథకు అదనపు బలం చేకూరుతుంది.  ఒకవేళ చరణ్‌ కూడా చేయకపోతే ప్రత్యామ్నాయం పవన్‌ కల్యాణ్‌. ఎందుకంటే కథలో ఆ ఫీల్‌100శాతం పవన్‌ తీసుకువస్తాడని నా అభిప్రాయం. అంతవరకూ ఛాన్స్‌ తీసుకోలేదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని