Acharya: వారిద్దరి ప్రయాణమే ‘ఆచార్య’

‘‘మా తండ్రీ కొడుకుల అనుబంధం ‘ఆచార్య’ కథకు అదనపు బలాన్ని   తీసుకొచ్చింది’’ అన్నారు కథానాయకుడు చిరంజీవి. ఆయన తన తనయుడు రామ్‌చరణ్‌తో కలిసి నటించిన చిత్రమే ‘ఆచార్య’. కొరటాల శివ

Updated : 27 Apr 2022 11:05 IST

‘‘మా తండ్రీ కొడుకుల అనుబంధం ‘ఆచార్య’ కథకు అదనపు బలాన్ని   తీసుకొచ్చింది’’ అన్నారు కథానాయకుడు చిరంజీవి. ఆయన తన తనయుడు రామ్‌చరణ్‌తో కలిసి నటించిన చిత్రమే ‘ఆచార్య’. కొరటాల శివ తెరకెక్కించారు. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంయుక్తంగా  నిర్మించాయి. పూజా హెగ్డే కథానాయిక. ఈ సినిమా ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో చిరంజీవి మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్రంలో చరణ్‌ పోషించిన సిద్ధ  పాత్రే ఈ కథకు కేంద్ర  బిందువు. రేపు థియేటర్లలో ప్రేక్షకుల్ని కదిలించేది అదే. సిద్ధ పాత్రకు చరణ్‌ కాకుండా మరే నటుడైనా న్యాయం చేసేవారే. అయితే, నిజ జీవితంలో తండ్రీ  కొడుకులు ఈ పాత్రలు చేస్తే.. వాటి మధ్య అనుబంధం మరింత బలంగా తెరపై కనిపిస్తుంది. ఒకవేళ చరణ్‌ ఈ పాత్ర చేయకుంటే.. ప్రత్యామ్నాయం పవన్‌ కల్యాణ్‌. ఎందుకంటే కథలో ఆ ఫీల్‌ను వందశాతం పవన్‌ తీసుకొస్తాడని నా అభిప్రాయం’’ అన్నారు. రామ్‌చరణ్‌ మాట్లాడుతూ.. ‘‘కొరటాల చెప్పిన కథ, మాటలు విన్న వెంటనే సిద్ధ పాత్రను ఆకళింపు చేసుకున్నా. నాన్న పక్కన చేయడం నిజంగా ఒత్తిడితో కూడుకున్నదే. అందుకే ఒళ్లు దగ్గర పెట్టుకుని ఈ సినిమా చేశా’’ అన్నారు. దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ.. ‘‘ఇది పూర్తిగా ఫిక్షనల్‌ స్టోరీ. నాకు నేనుగా రాసుకున్న కథ. ఎవరినీ స్ఫూర్తిగా తీసుకోలేదు. ధర్మస్థలిలో ఉండే సిద్ధ అడవికి ఎందుకు వెళ్లాడు? అడవిలో ఉండే ఆచార్య ఆ ధర్మస్థలికి ఎందుకొచ్చాడు? అన్నదే ఈ చిత్ర కథాంశం. వీరిద్దరి ప్రయాణాన్ని సినిమాలో చాలా అందంగా చూపించాం’’ అన్నారు.

టికెట్‌ రేట్లు పెంచమనడంలో తప్పులేదు

‘‘బడ్జెట్‌కు తగ్గట్లుగా టికెట్‌ రేట్లు పెంచడంలో తప్పులేద’’న్నారు కథానాయకుడు చిరంజీవి. ‘‘చిరు సినిమా అంటేనే అన్ని థియేటర్స్‌ హౌస్‌ఫుల్‌ అవుతాయి. అలాంటప్పుడు ‘ఆచార్య’కి టికెట్‌ రేటు పెంచవలసిన అవసరం ఏంటి?’ అని ఓ విలేకరి ప్రశ్నించగా.. చిరు పైవిధంగా జవాబిచ్చారు. ‘‘కరోనా వల్ల ప్రతి రంగం కుంటుపడింది. అందుకు చిత్ర పరిశ్రమ మినహాయింపు ఏమీ కాదు. పెట్టుబడులకు వడ్డీలు పెరిగిపోయాయి. వడ్డీగానే రూ:50కోట్లు కట్టడమనేది ఎప్పుడైనా విన్నారా? మేము కట్టాం. ఆ డబ్బు ఎవరిస్తారు? ప్రభుత్వాలు కనికరించి ఇలాంటి జీవోలు ఇస్తే.. ప్రేక్షకులు కరుణించి మనం ఓ పది రూపాయలు ఇద్దామని ముందుకొస్తున్నారు. మేం కట్టిన వడ్డీతో ఓ మీడియం రేంజ్‌ సినిమా తీయొచ్చు. కాబట్టి టికెట్‌ రేట్ల కోసం  వేడుకోవడంలో తప్పులేదు. ఎందుకంటే మా ఇండస్ట్రీ నుంచి అత్యధికంగా పన్నులు చెల్లిస్తున్నాం. అందులోంచి కొంత ఇవ్వండని అడగడంలో తప్పు లేదనిపిస్తోంది’’ అని చెప్పుకొచ్చారు చిరు. ఈ కార్యక్రమంలో దర్శకుడు   కొరటాల శివ, కథానాయిక పూజా హెగ్డే తదితరులు పాల్గొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని