Gudipudi Srihari: గుడిపూడి శ్రీహరి విమర్శలతో నా నటనలో మార్పొచ్చింది: చిరంజీవి

సీనియర్‌ పాత్రికేయుడు, సినీ విమర్శకుడు గుడిపూడి శ్రీహరి మృతిపై ప్రముఖ నటుడు చిరంజీవి సంతాపం తెలిపారు. ఆయన మరణం సినీ పాత్రికేయ రంగానికి తీరని లోటు అని అన్నారు.

Updated : 05 Jul 2022 18:08 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ సినీ విమర్శకుడు గుడిపూడి శ్రీహరి (Gudipudi Srihari) మృతిపై ప్రముఖ నటుడు చిరంజీవి (Chiranjeevi) సంతాపం తెలిపారు. ఆయన మరణం సినీ పాత్రికేయ రంగానికి తీరని లోటు అని అన్నారు. ‘‘నేను నటించిన ఎన్నో చిత్రాలపై గుడిపూడి శ్రీహరి రాసిన ఆరోగ్యకరమైన విమర్శలు, నటుడిగా నన్ను నేను ఎప్పటికప్పుడు మెరుగు పరుచుకునేందుకు దోహదపడ్డాయి’’ అంటూ సోషల్‌ మీడియా వేదికగా శ్రీహరి కుటుంబానికి చిరంజీవి ప్రగాఢ సంతాపం తెలిపారు.

మరోవైపు, గుడిపూడి శ్రీహరి గురించి చిరంజీవి ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడిన వీడియో నెట్టింట దర్శనమిచ్చింది. సంబంధిత వీడియోను పలువురు నెటిజన్లు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ శ్రీహరికి నివాళి అర్పిస్తున్నారు. ‘‘నా నట జీవితాన్ని సరైన మార్గంలో పెట్టిన వారిలో గుడిపూడి శ్రీహరి, పీఎస్‌ఆర్‌ ఆంజనేయ శాస్త్రి, నందగోపాల్‌ తదితర పాత్రికేయులున్నారు. నా సినిమా సెట్లో వారితో చర్చించి, ఎన్నో విషయాలు నేర్చుకునేవాడ్ని. ఆరోగ్యకర జర్నలిజం అంటే ఏంటో వారి దగ్గర తెలుసుకున్నా. ఒకప్పుడు ‘సితార’లో గుడిపూడి శ్రీహరి సినిమా రివ్యూలు రాస్తుండేవారు. ఆయన పదజాలం మనసుని బాధపెట్టినా ఓ ఉపాధ్యాయుడు విద్యార్థికి చెప్పినట్టుగా ఉండేది. నేను బాగా నటిస్తున్నానని, పోరాటాలు, డ్యాన్సులు.. ఇలా అన్నింటిలోనూ వేగం పెంచానని కితాబు ఇస్తూనే సంభాషణలు చాలా వేగంగా చెబుతున్నానని విమర్శించారు. ‘నటనలో స్పీడ్‌ ఉండాలిగానీ మాటలో కాదు’ అని ఆయన ఇచ్చిన సమీక్ష నాలో మార్పు తీసుకొచ్చింది’’ అని చిరంజీవి పంచుకున్న జ్ఞాపకాలు ఆ వీడియోలో వినిపిస్తాయి. సినీ రంగంలో పాత్రికేయుడిగా, విశ్లేషకుడిగా 55 ఏళ్లపాటు సేవలందించిన గుడిపూడి శ్రీహరి (88) మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే.

గుడిపూడి శ్రీహరి ప్రస్థానమిదీ..

సినిమా సమీక్షలకు శ్రీకారం చుట్టిన తొలి వ్యక్తిగా గుడిపూడి శ్రీహరి నిలిచారు. ‘ఈనాడు’ దినపత్రికకు ‘హరివిల్లు’ పేరుతో వర్తమాన, రాజకీయ వ్యవహారాలపై దాదాపు 25 ఏళ్లపాటు వ్యంగ్య రచనలు చేశారు. ‘తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ’ అనే పుస్తకాన్ని రచించారు. జాతీయ చలన చిత్రాభివృద్ధి సంస్థలో సభ్యుడు, ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా శ్రీహరి పనిచేశారు. 2013లో తెలుగు విశ్వవిద్యాలయం ఆయన్ను కీర్తి పురస్కారంతో సత్కరించింది. గుడిపూడికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. ప్రస్తుతం గుడిపూడి శ్రీహరి మృతదేహం నిమ్స్ ఆస్పత్రిలోని మార్చురీలో ఉంది. న్యూజిలాండ్‌లో ఉన్న కుమారుడు వచ్చిన తర్వాత శనివారం లేదా ఆదివారం అంత్యక్రియలు నిర్వహిస్తామని శ్రీహరి కుటుంబసభ్యులు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని