Updated : 29 Jun 2022 08:24 IST

Madhavan: ఇప్పటివరకూ చూడని సన్నివేశాలుంటాయి

‘‘మన దేశం ప్రపంచానికి ఓ మేథో రాజధాని. శాస్త్ర సాంకేతిక పరిశోధన రంగాల్లో మనవాళ్లు ప్రపంచం నలుమూలలా సత్తా చాటుతున్నారు. ఆయా రంగాల్ని ముందుండి నడిపిస్తున్నారు. హాలీవుడ్‌(Holywood) తరహాలో మనం వాళ్లపై అద్భుతమైన సినిమాలు తీయొచ్ఛు అలా నేను చేసిన ఓ ప్రయత్నమే ఈ చిత్రం’’ అన్నారు ప్రముఖ కథానాయకుడు మాధవన్‌(Madhavan). దక్షిణాదితోపాటు, హిందీ సినిమాలతోనూ సత్తా చాటిన నటుడు మాధవన్‌. ఆయన నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్‌’ (Rocketry The Nambi Effect). ప్రఖ్యాత ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్‌(Nambi Narayanan) జీవితం ఆధారంగా రూపొందిన చిత్రమిది. జులై 1న ప్రేక్షకుల ముందుకొస్తున్న సందర్భంగా ప్రచారం నిమిత్తం మంగళవారం హైదరాబాద్‌కి వచ్చారు మాధవన్‌. ఈ సందర్భంగా ఆయన చెప్పిన విషయాలివీ... ●

‘‘మనకు రెండు రకాల దేశభక్తులు ఉంటారు. బుల్లెట్లకి ఎదురొడ్డి జీవితాల్ని త్యాగం చేయడానికి సిద్ధమై పనిచేస్తున్నవాళ్లు ఒకరైతే... అసలే గుర్తింపు లేకుండా జీవితాల్ని పణంగా పెట్టి దేశం కోసం పనిచేస్తున్నవాళ్లు మరొకరు. నంబి నారాయణన్‌ రెండో రకానికి చెందినవారు. ప్రపంచంలో మరే శాస్త్రవేత్తకి సాధ్యం కానంతగా చేశారు నంబి నారాయణన్‌. ఆయన ఏం చేశారనేది ఇందులో చూపించాం. ఆయన ఎదుర్కొన్న ఆరోపణలు, కేసుల కంటే ఆయన తన పరిశోధన జీవితంలో ఏం చేశారనే విషయాల్ని చూపించాం. జీవిత కథల్ని తెరకెక్కిస్తున్నప్పుడు మసాలా అంశాల్ని జోడించాల్సి ఉంటుంది. ఈ సినిమాకి ఆ అవసరమే రాలేదు. తెరపై చూపించిందంతా నిజం అని ప్రేక్షకుడు నమ్మితే చాలనుకుంటూ తీశా. అంత నాటకీయత ఉంటుంది నంబి నారాయణన్‌ జీవితంలో. తొలిసారి ఈ సినిమాలో రాకెట్‌ ఇంజిన్‌ని చూపించాం. పాత్రల్ని సహజంగా, ఎలాంటి ప్రాస్తెటిక్‌ మేకప్‌ లేకుండా చూపించే ప్రయత్నం చేశాం. నంబి నారాయణన్‌లా కనిపించేందుకు నా పంటి వరసని మార్చుకున్నా. పాత్రకి తగ్గట్టుగా బరువు పెరగడంతోపాటు, 18 రోజుల్లోనే ఆ బరువు తగ్గి నటించా’’.

 ‘‘మొదట ఈ సినిమాకి నేను దర్శకత్వం వహించాలనుకోలేదు. ఈ కథ రాశాక ‘నేనే దర్శకత్వం వహించడమా లేక, ఈ కథని ఇలా వదిలేయడమా?’ అనే పరిస్థితి ఏర్పడింది. ప్రతీ నటుడు తమిళం, హిందీ, ఇంగ్లిష్‌... ఈ మూడు భాషల్లో మాట్లాడాలి. అలా మూడు భాషలు తెలిసిన నటుల్నే ఎంపిక చేసుకుని ఈ సినిమా చేశాం’’.


‘‘మనం జేమ్స్‌బాండ్‌ సినిమాలు, అందులో హీరో పాత్రల్ని చూసి ఆశ్చర్యపోతుంటాం. రాకెట్‌ సైన్స్‌ గురించి, ఇంతరత్రా సాంకేతికాంశాలు, ఆ రంగాల్లో వ్యక్తుల కథలతో వచ్చే హాలీవుడ్‌ సినిమాల్ని చూసి ‘వీళ్లే భూమిని కాపాడేవాళ్లు. వీళ్లకే ఇదంతా సాధ్యమేమో’ అనుకుంటాం. మన దేశం మేథస్సుకి ఓ హబ్‌ అనే విషయాన్ని గుర్తించం. బాండ్‌కే బాండ్‌ అనిపించే భారతీయ శాస్త్రవేత్త నంబి నారాయణన్‌. ఎన్నెన్నో దేశాలతో ముడిపడిన ఆయన జీవితం గురించి తెలుసుకుంటే ఒక భారతీయుడు ఇంత చేశారా? అని ఆశ్చర్యపోవల్సిందే. ఆయన జీవితంలో సినిమాని మించిన మలుపులు ఉంటాయి. ఇన్ని చేసిన ఓ శాస్త్రవేత్త దేశ రహస్యాల చేరవేత అభియోగాల్ని ఎదుర్కొన్నారు. ఇవన్నీ తెలిశాక నేనెంతగానో కదిలిపోయా. ఆయనకి పద్మభూషణ్‌ పురస్కారం రాక ముందు కలిసి మీ జీవితంపై సినిమా చేస్తానని చెప్ఫా స్వతహాగా నేను ఇంజినీరింగ్‌ విద్యార్థిని కావడంతో, ఇంజిన్స్‌ గురించి, సాంకేతిక విషయాల గురించి అవగాహన ఉండటంతో నేను సినిమా తీయగలనని నమ్మారు నంబి నారాయణన్‌. ఆరేళ్లపాటు శ్రమించి ఈ సినిమా చేశా. భారతీయ సినిమాలో ఇదివరకెప్పుడూ చూడని సన్నివేశాలు ఇందులో ఉంటాయి’’.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని