Naresh: ‘మళ్ళీ పెళ్లి’ సక్సెస్‌.. ‘పవిత్రను జాగ్రత్తగా చూసుకో’ అని ఆయన చివరిగా చెప్పారు: నరేశ్‌

‘మళ్ళీ పెళ్లి’ (Malli Pelli) సినిమా సక్సెస్‌మీట్‌ తాజాగా హైదరాబాద్‌లో జరిగింది. ఈ సినిమా విజయం పట్ల నరేశ్‌ (Naresh) ఆనందం వ్యక్తం చేశారు.

Updated : 28 May 2023 18:08 IST

హైదరాబాద్‌: నరేశ్‌ (Naresh)- పవిత్రా లోకేశ్ (Pavitra Lokesh) జంటగా ఎం.ఎస్‌.రాజు (MS Raju) దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘మళ్ళీ పెళ్లి’ (Malli Pelli). శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అంతటా మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే చిత్రబృందం ఆదివారం ‘మళ్ళీ పెళ్లి’ సక్సెస్‌ మీట్‌ ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌ వేదికగా జరిగిన ఈ వేడుకలో నరేశ్‌ మాట్లాడుతూ సినిమా విజయం పట్ల భావోద్వేగానికి గురయ్యారు. తుది శ్వాస వరకూ నటుడిగానే ఎన్నో  విభిన్న పాత్రల్లో నటించాలని ఉందని తెలిపారు. అలాగే, తన స్నేహితుడు శరత్‌బాబు(Sarath Babu)ను ఆయన గుర్తు చేసుకున్నారు.

‘‘భారతీయుడిగా, అందులోనూ తెలుగువాడిగా పుట్టడం గర్వంగా ఉంది. సినిమా కుటుంబంలో పుట్టి, దాదాపు 50 ఏళ్లుగా నటుడిగా ప్రేక్షకులను అలరిస్తున్నందుకు ఆనందంగా ఉంది. తన జీవిత భాగస్వామి విజయనిర్మల ఆలోచనలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం కోసం కృష్ణగారు విజయకృష్ణ మూవీస్‌ బ్యానర్‌ను ప్రారంభించారు. నా వరకూ బోల్డెస్ట్‌ కపుల్‌ అంటే వాళ్లిద్దరే. ఈ సినిమాకు వచ్చిన రిజల్ట్‌ చూసిన తర్వాత వాళ్లిద్దరి దీవెనలు మేము అందుకుంటామనే నమ్మకం నాకు ఉంది. గుడ్‌ కపుల్‌, మంచి ఆర్టిస్టులం అని మేము పేరు తెచ్చుకుంటే చాలు. అంతకు మించి ఏమీ అక్కర్లేదు. రానున్న రోజుల్లోనూ విజయకృష్ణ పతాకంపై మంచి చిత్రాలను తెరకెక్కించాలని అనుకుంటున్నా’’

‘‘సుమారు మూడేళ్ల పాటు దర్శకుడు రాజుతో మా ప్రయాణం జరిగింది. రెండు, మూడు సబ్జెక్ట్‌లు వద్దనుకున్నాక ఈ సబ్జెక్ట్‌ తీయాలనే నిర్ణయానికి వచ్చాం. ఎంటర్‌టైన్‌మెంట్‌ + బోల్డ్‌ మెసేజ్‌ కలిపితే ఈ సినిమా. ఈ సినిమాని మేము కష్టపడి కాదు ఇష్టపడి చేశాం. ఏడాదిపాటు షూట్‌ చేశాం. దీన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశాం. ప్రేక్షకులతో కలిసి దీన్ని చూసినప్పుడు ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాను. మేము ఎన్ని కష్టాలు పడ్డాం. ఏమి సాధించాం అనేది మా వ్యక్తిగత విషయం. మా గురించి ఎవరైనా ఎన్ని అయినా మాట్లాడుకోవచ్చు. కానీ, మేము వాటిని పట్టించుకోకుండా సంతోషంగా ముందుకు సాగాలనుకుంటున్నాం’’

‘‘ఇక, ‘కోకిల’ నుంచి శరత్‌బాబుతో నాకు మంచి అనుబంధం ఉంది. ఈ సినిమా కోసం అడిగినప్పుడు జయసుధ, శరత్‌బాబు ఎలాంటి సందేహం లేకుండా ఓకే అన్నారు. ‘పవిత్రను జాగ్రత్తగా చూసుకో. తను చాలా మంచిది. సంతోషంగా ఉండండి’ అని చివరిరోజు షూట్‌ పూర్తి చేసుకుని వెళ్తూ శరత్‌బాబు నాతో చెప్పారు. ఈ క్షణం ఆయన్ని నేను ఎంతో మిస్‌ అవుతున్నా. జయసుధ నాకు అక్క వరుస అవుతుంది. కానీ, అమ్మలా ఎప్పుడూ అండగా నిలుస్తుంది. ఈ సినిమాకు ఆమె మరో బలంగా నిలిచారు. మా చిత్రానికి ఓటీటీ నుంచి భారీ ఆఫర్స్‌ వస్తున్నాయి. సమయం వచ్చినప్పుడు తప్పకుండా రిలీజ్‌ చేస్తాం.’’ అని నరేశ్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని