Published : 08 Mar 2021 23:41 IST

నేను నటిస్తుంటే కాజల్‌ భయపడేది: నవీన్‌చంద్ర

మొదటి చిత్రం ‘అందాల రాక్షసి’తోనే ప్రతిభగల నటుడిగా నిరూపించుకున్నారు నవీన్‌చంద్ర. అటు సోలో హీరోగా నటిస్తూనే, ఇటు పెద్ద సినిమాల్లో ప్రాముఖ్యమున్న పాత్రల్లో నటిస్తూ తన క్యాలెండర్‌ను బిజీగా ఉంచుకుంటున్నారు. ప్రస్తుత రచయితలు, డైరెక్టర్లు కథను మలుపు తిప్పే పాత్రలకు నవీన్‌చంద్రను దృష్టిలో పెట్టుకునే  రాస్తున్నారంటే అతిశయోక్తి కాదేమో! తాజాగా మంచువిష్ణు, కాజల్, సునీల్‌శెట్టి ప్రధానపాత్రల్లో నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘మోసగాళ్లు’చిత్రంలో నవీన్‌ చంద్ర ఆ తరహా పాత్రలోనే నటిస్తున్నారు. మరి ఈ సక్సెస్‌ఫుల్‌ నటుడు చెప్పే విశేషాలు తెలుసుకుందామా!

మంచి కథల్లో భాగమవడం సంతోషంగా ఉంది..
‘భానుమతి రామకృష్ణ’ ‘సూపర్‌ ఓవర్‌’ రెండు చిత్రాల్లో సంబంధంలేని పాత్రల్లో నటించా. ఎన్నో ఏళ్ల కష్టానికి ప్రతిఫలం..రచయితలు ఈ రోజు నాకోసం కథలు రాస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇకపై కూడా మంచి కథల్లో నటిస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తాను.

ఇదో పెద్ద స్కామ్‌..
ప్రస్తుతం నేను నటిస్తున్న ‘మోసగాళ్లు’ సినిమా ఒక పెద్ద స్కామ్‌ చుట్టూ నడుస్తుంది. అప్పట్లో ఈ స్కామ్‌ గురించి పేపర్లో వచ్చినా జనం అంతగా పట్టించుకోలేదు. కానీ, కథ విన్నాక ఇదొక భారీ కుంభకోణమనిపించింది. ఇందులో నేను విష్టు, కాజల్‌కు కజిన్‌గా నటిస్తా.  చాలా విలక్షణమైన పాత్ర. ఎంతకైనా తెగిస్తుంది. పోలీసులైనా, వేరేవరైనా ఈజీగా డీల్‌ చేసే పాత్ర. ఈ స్కామ్‌కు నవదీప్‌ క్యారెక్టర్‌ ప్రణాళిక చేస్తే విష్ణు, కాజల్ అమలు చేస్తారు. వీరిద్దరిని కాపాడుతూ నా పాత్ర ఉంటుంది. పైగా మాదకద్రవ్యాల బాధితుడిగా నటిస్తా. కొన్నిసార్లు షూట్‌లో నా నటనకు కాజల్‌ భయపడిపోయింది. ఆ స్థాయిలో డ్రగ్‌ బాధితుడిగా నటించా. నిజంగా ఈ పాత్రలో నటిస్తున్నప్పుడు బాగా ఎంజాయ్‌ చేశా.

ప్రత్యేకంగా హోంవర్క్‌ ఏమి చేయలేదు..
ఈ పాత్ర కోసం ప్రత్యేకంగా సన్నద్ధం కాలేదు. డైరెక్టర్‌ నా పాత్ర గురించి వివరించినప్పుడే ఇలా చేస్తే బాగుంటుందని ఒక ఆలోచన మైండ్‌లో ఉంది. ఎందుకంటే నిజజీవితంలో మనం చేయని పనులు తెరపై చేయాల్సి ఉంటుంది. దానికి పరిశీలన అత్యంత అవసరం. 

సునీల్ శెట్టిని ఎక్కువగా ఏడిపిస్తా..
బాగా చదివి జీవితంలో ఎదగాలనుకున్న అన్నాచెల్లెళ్లకు వ్యవస్థలో ఎదురైన సవాళ్లతో రెబల్‌గా మారతారు. ఎలాగైనా డబ్బు సంపాదించి బాగా బతకాలనుకునే వారిద్దరు ఎలాంటి పనులు చేశారన్నేదే ఈ చిత్ర కథ.  నిజజీవితంలో ఈ స్కామ్‌ జరిగినప్పుడు అమెరికా ప్రభుత్వం ఏం చేయలేకపోయింది. భారత ప్రభుత్వం కూడా ఆధారాలు సేకరించలేకపోయింది. అయినప్పటికి చివరకు వారిని పట్టుకున్నారు. ఈ చిత్రంలో పోలీస్‌ క్యారెక్టరు చేసిన సునీల్‌శెట్టిని ఎక్కువగా విసిగించేది నేనే. అసలు నావల్లే ఆయనకు ఈ స్కామ్‌ గురించి తెలుస్తుంది. నన్ను పట్టుకున్నా గానీ ఆయన్ను ఏడిపిస్తూనే ఉండే పాత్ర నాది. చాలా మజాగా అనిపించింది.

డైరెక్టర్‌ జెఫ్‌ థామ్సన్‌ బాగా హ్యండిల్‌ చేశారు..
జెఫ్‌ థామ్సన్‌ అమెరికన్‌ అయినప్పటికి ఇండియా పరిస్థితులకు తగ్గట్టు కథను మలిచారు. హాలీవుడ్‌లో ఆయన ఇప్పటికే చాలా చిత్రాలు తెరకెక్కించారు. మొదటి నుంచి ఒక క్లాసిక్‌ చిత్రంగా ‘మోసగాళ్లు’ను మలిచేందుకు తాపత్రయపడ్డారు.

నేను నటుడిగానే కెరీర్‌ ప్రారంభించా..
నా కెరీర్‌లో అన్ని పాత్రల్లో నటించాలనే ఉద్దేశంతో ఉన్నాను. హీరో, విలన్‌, కీలక పాత్ర అంటూ భేదాలు లేవు. ఎందుకుంటే నేనొక నటుడిని, హీరోగా మాత్రమే చేయాలనే ఉద్దేశం ఎప్పుడూ లేదు. ఆ క్రమంలోనే ‘ఆరవింద సమేత’లో నటించా. అంతమంది పెద్ద నటులతో నటించేటపుడు నా నటన గురించి ప్రేక్షకులు ప్రత్యేకంగా చెప్పుకుంటుంటే సంతృప్తిగా అనిపిస్తుంది. అలాగే ధనుష్‌ సినిమాలో విలన్‌గా 45 ఏళ్ల పాత్రలో నటించాను. సినిమా సెట్స్‌లో నేనొక మంచి నటుడిననే గుర్తింపు ఉంది. అది చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. నా బాధ్యత నేను 100 శాతం నిర్వర్తించేందుకు ప్రయత్నిస్తా. ఇంకా చాలా రకాల పాత్రలు చేయాల్సిఉంది.

కథలో నా పాత్రకు ప్రాముఖ్యం ఉంటేనే..
ఏదైనా సినిమా ఒప్పుకునే ముందు  నా పాత్ర పరిధి గురించి తెలుసుకుంటా. ఏదో తెరపై ఉన్నాం అనే ధోరణిలో నేను నటించదల్చుకోలేదు. నామమాత్రంగా ఉండే పాత్రలు చేసేందుకు నిర్మొహమాటంగా నో చెప్పేస్తా. కథ నా పాత్ర ద్వారా కొత్త మలుపు తీసుకోవాలి. అప్పుడే నటుడిగా నాకూ తృప్తి ఉంటుంది. ప్రస్తుతం చేస్తున్న ‘గని’ సినిమాలో కూడా నా పాత్రే కథను ముందుకు తీసుకెళ్తుంది. అందులో ప్రముఖ నటులు చేస్తున్నారు.

వరుసగా సినిమాలు ఉన్నాయి..
ప్రస్తుతం తమిళ చిత్రాలకు సంబంధించి కొన్ని లైన్స్‌ ఉన్నాయి. అలాగే ఆర్కా మీడియాలో ఒక వెబ్‌ సిరీస్‌ చేస్తున్నా. ఇంకా వరుసగా లక్కీ మీడియా సంస్థపై అవికాగోర్‌తో ఒక సినిమా, ‘విరాట పర్వం’‘అర్ధశతాబ్దం’ వంటి మంచి చిత్రాలు చేస్తున్నా. మరికొన్ని ప్రాజెక్టులు చేతిలో ఉన్నాయి.

ఉదయం నుంచి అర్థరాత్రి వరకు పనిచేస్తున్నా..
ప్రస్తుతం తీరికలేని షూటింగ్‌లతో ఎంతో సంతోషంగా ఉన్నా. మూడు షిప్టుల్లో పని చేస్తున్నా. నేనెప్పుడు నెంబర్లను పట్టించుకోవట్లేదు. నటుడిగా ప్రేక్షకుల్లో మంచి పేరు సంపాదించాలి. అవకాశాలు కూడా అలాగే రావడం సంతోషం. డ్రీమ్‌ రోల్‌ అంటూ ఏమి లేదు. అయితే ‘భానుమతి రామకృష్ణ’ డైరెక్టర్‌తో మరో సినిమా చేయాలని ఉంది. 

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని