Naveen Chandra: ‘గేమ్‌ ఛేంజర్‌’ సెట్స్‌లో నవీన్‌ చంద్ర మాతృమూర్తి.. ఆనందంలో హీరో

రామ్‌చరణ్‌ హీరోగా ప్రముఖ దర్శకుడు శంకర్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’. ఈ సినిమా సెట్స్‌లో నవీన్‌ చంద్ర మాతృమూర్తితో శంకర్‌ ముచ్చటించారు.

Published : 15 May 2023 01:30 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తాను కీలక పాత్ర పోషిస్తున్న ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer) సినిమా సెట్స్‌లో చిత్ర దర్శకుడు శంకర్‌ (Shankar)తో తన తల్లి ముచ్చటిస్తున్న దృశ్యాన్ని పంచుకుంటూ హీరో నవీన్‌ చంద్ర (Naveen Chandra) ఆనందం వ్యక్తం చేశారు. అది తన జీవితంలో మరిచిపోలేని క్షణమంటూ మాతృ దినోత్సవం సందర్భంగా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టారు. శంకర్‌ దర్శకత్వం వహించిన తొలి సినిమా ‘జెంటిల్‌మేన్‌’ (Gentleman) సినిమాని తాను చూసిన రోజుని గుర్తుచేసుకున్నారు. ఆ దర్శకుడి చిత్రాలు చూస్తూ పెరిగి, ఇప్పుడు అదే డైరెక్టర్‌తో కలిసి పనిచేస్తుండడంపై ఆయన పట్టరాని సంతోషంలో ఉన్నారు.

‘‘జెంటిల్‌మేన్‌’ సినిమాని మాకు చూపించేందుకు అమ్మ.. బళ్లారిలోని ఓ థియేటర్‌కి తీసుకెళ్లింది. అక్కడి సందడి నా మదిలో ఇప్పటికీ మెదులుతూనే ఉంది. ఆ సినిమాలోని ఓ పాటలో ప్రముఖ కొరియోగ్రాఫర్‌ ప్రభుదేవా సర్‌ డ్యాన్స్‌ చూసి, ఫిదా అయ్యా. ఆయన్ను ‘ఇండియన్‌ మైఖేల్‌ జాక్సన్‌’ అంటారని అమ్మ ఆ రోజు చెప్పిన మాట నాపై బలమైన ముద్ర వేసింది. అప్పుడు ఎంతగా ఆనందించానో అమ్మ ఇప్పుడు శంకర్‌ సర్‌తో మాట్లాడుతుంటే అంతే ఆనందించా. ‘గేమ్‌ ఛేంజర్‌’లో నటించే అవకాశం ఇచ్చినందుకు, అమ్మతో కాసేపు ముచ్చటించినందుకు శంకర్‌ సర్‌, రామ్‌చరణ్‌గారికి, నిర్మాణ సంస్థ శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌కు కృతజ్ఞతలు’’ అని నవీన్‌ చంద్ర పేర్కొన్నారు. అర్జున్‌ హీరోగా తెరకెక్కిన ‘జెంటిల్‌మేన్‌’ అప్పట్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తొలి ప్రయత్నంలోనే దర్శకుడిగా శంకర్‌కు మంచి గుర్తింపు దక్కింది.

రామ్‌చరణ్‌ (Ram Charan) హీరోగా శంకర్‌.. ‘గేమ్‌ ఛేంజర్‌’ని పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. కియారా అడ్వాణీ (Kirara Advani) కథానాయిక. పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాలో నవీన్‌చంద్రతోపాటు అంజలి, శ్రీకాంత్‌, సునీల్‌, ఎస్‌. జె. సూర్య తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబరులో విడుదల చేసేందుకు దర్శక, నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని