NTR: దాని వల్లే నా జీవితంలో మార్పొచ్చింది.. ఆ లోటు ఎప్పటికీ ఉంటుంది: ఎన్టీఆర్
ప్రముఖ హీరో ఎన్టీఆర్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన గురించి ప్రత్యేక కథనం..
బాల నటుడిగా తెరంగేట్రం చేసి, నూనూగు మీసాల వయసులోనే టాలీవుడ్‌లో సరికొత్త రికార్డు సృష్టించాడు. నేర్చుకున్నది కూచిపూడి నృత్యమే అయినా అన్ని రకాల డ్యాన్స్‌ల్లో ‘అదుర్స్’ అనిపించుకున్నాడు. ‘నటనలో నీ తర్వాతే ఎవరైనా’ అనేలా నవరసాలను అలవోకగా పలికించగలడు. అతడెవరో ఇప్పటికే అర్థమై ఉంటుందిగా?ఎన్టీఆర్ (NTR) పుట్టిన రోజు (1983 మే 20) నేడు. ఈ సందర్భంగా ఆయన పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ ప్రొఫైల్‌పై ఓ లుక్కేద్దాం (Happy Birthday NTR)..
అమ్మ.. బలం
ఎన్టీఆర్ పుట్టి, పెరిగింది హైదారాబాద్‌లోనే. బాల్యంలో బాగా అలర్లి చేసేవాడు. క్రికెట్, సినిమాలు, షికార్లు, స్నేహితులతో గొడవలు.. ఇలా ఇష్టం వచ్చినట్టు చేస్తుంటే.. ఓ సందర్భంలో బాగా విసిగిపోయిన వాళ్లమ్మ శాలిని హ్యాంగర్‌తో కొట్టారట. ఓ ఇంటర్వ్యూలో ఈ జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటూ ‘నేనంటే అమ్మకు ప్రాణం. అలాగని గారాబం చేసేది కాదు. వాస్తవంలో బతకడం నాకు అమ్మే నేర్పింది. నాలో ఆత్మవిశ్వాసం పెరగడానికి అమ్మే కారణం. ఆమె నా బలం, బలగం’ అని ఎన్టీఆర్ తెలిపాడు.
నాన్న.. ప్రాణం
ప్రాణంగా భావించే తన నాన్న హరికృష్ణను తలచుకుంటూ ‘‘ఊహ తెలిసినప్పటి నుంచీ చనిపోయేవరకు ఆయన ఒకే దృక్పథంతో ఉన్నారు. ఆయనలా బతకడం చాలా కష్టం’’ అని ఓ సందర్భంలో భావోద్వేగానికి లోనయ్యాడు. రోడ్డు ప్రమాదం కారణంగా తండ్రిని కోల్పోయిన ఎన్టీఆర్.. ప్రయాణ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని, తమ కోసం కుటుంబం వేచి చూస్తుందని తన ప్రతి సినిమా వేడుకకు హాజరయ్యే అభిమానులకు విజ్ఞప్తి చేస్తుంటాడు. అభిమానులూ తన కుటుంబ సభ్యులే అంటుంటాడు.
తాత.. ప్రపంచం
ఎన్టీఆర్ అసలు పేరు తారక్ రామ్. తన తాత సూచనతో నందమూరి తారక రామారావుగా మారాడు. అదెలా అంటే?.. ఓ రోజు సీనియర్ ఎన్టీఆర్ నుంచి కబురు రాగా తారక్ వెళ్లాడు. అప్పట్లో అబిడ్స్‌లో ఉండే సీనియర్ ఎన్టీఆర్.. ‘లోపలికి రండి’ అంటూ తారక్‌ని ఇంట్లోకి ఆహ్వానించారు. ‘పేరేంటి?’ అని ఆయన అడగ్గా.. తారక్ తన పేరు చెప్పాడు. వెంటనే, హరికృష్ణని పిలిచి.. ‘నందమూరి తారక రామారావు అని పేరు మార్చండి’ అంటూ ఆజ్ఞాపించారు. ‘‘ఆ క్షణం నుంచి నేను తాత చేయి వదల్లేదు. ఆయనా నన్ను వదిలి ఉండేవారు కాదు. కాస్త బొద్దుగా ఉండే నాకు అన్ని రకాల వంటకాలు రుచి చూపిస్తూ ఇంకా బొద్దుగా మార్చేశారు’’ అని ఓ సందర్భంలో తాత జ్ఞాపకాలు నెమరువేసుకున్నాడు ఎన్టీఆర్.
భార్య.. వరం
‘‘ప్రణతి నాకు దేవుడిచ్చిన వరం’’ అని ఎన్టీఆర్ భార్యపై ఉన్న ప్రేమను చాటుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు అబ్బాయిలు (అభయ్, భార్గవ్). కాగా, కూతురు లేదనే లోటు ఎప్పటికీ ఉంటుందని ఎన్టీఆర్ ఓ సందర్భంలోతన మనసులో మాట బయటపెట్టాడు. తన సోదరుడు, హీరో కల్యాణ్ రామ్ అంటే ఎన్టీఆర్‌కు ఎంతో ప్రేమ.
స్నేహం.. ఆనందం
ఎన్టీఆర్ స్నేహానికీ అధిక ప్రాధాన్యత ఇస్తాడు. స్కూల్ ఫ్రెండ్స్ స్నేహల్, లవ్‌రాజ్ సహా సినీ నటుడు రాజీవ్ కనకాలతో ఆయన ప్రతి విషయాన్ని పంచుకుంటాడు. హీరోలు రామ్‌చరణ్, మహేశ్‌బాబు, అల్లు అర్జున్‌తో క్లోజ్‌గా ఉంటాడు. ఎన్టీఆర్- చరణ్ సోదరుల్లా ఉంటారనే సంగతి ‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR) చిత్రం ద్వారా ప్రతి ఒక్కరికీ తెలిసింది. వీరిద్దరూ ‘ఆస్కార్’ వేదికపైకి వెళ్లిన విషయం విదితమే.
నటనకు శ్రీకారం..
ఓ రోజు ‘మేజర్ చంద్రకాంత్’ షూటింగ్ చూసేందుకు తారక్ వెళ్లాడు. తన తాత మేకప్‌మ్యాన్‌ను పిలిచి తారక్‌కు మేకప్ వేయమని చెప్పారు. ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ చిత్రాన్ని హిందీలో తీస్తున్నామని, అందులో భరతుడి పాత్ర పోషించాలని తారక్‌కు తెలిపారు. అలా నటనలో ఓనమాలు నేర్చుకున్న ఎన్టీఆర్ కొన్నాళ్ల తర్వాత ‘రామాయణం’లో నటించాడు. ఆ తర్వాత, చదువుని అశ్రద్ధ చేస్తాడేమోనని కుటుంబ సభ్యులు సినిమాల జోలికి వెళ్లనివ్వలేదు. ఇంతకీ ఎన్టీఆర్ ఎక్కడ చదువుకున్నాడో మీకు తెలుసా..?
తొలి ప్రయత్నం.. సందేహం
హైదరాబాద్‌లోని విద్యారణ్య స్కూల్‌లో ప్రాథమిక విద్య, సెయింట్ మేరీ కళాశాలలో ఇంటర్మీడియెట్ పూర్తి చేశాడు ఎన్టీఆర్. జాగ్రఫీ అంటే తారక్‌కు బాగా ఇష్టం. అమ్మ ప్రోత్సాహంతో ‘కూచిపూడి’ శిక్షణ పొందాడు. 12 ఏళ్ల సాధనలో దేశవ్యాప్తంగా వందకిపైగా ప్రదర్శనలు ఇచ్చాడు. 2001లో ‘నిన్ను చూడాలని’ సినిమా అవకాశం అందుకున్నాడు. హీరోగా తెరపై తనను తాను చూసుకుని ‘నటనకు పనికొస్తానా?’ అని ప్రశ్నించుకున్నాడు. ‘స్టూడెంట్ నెం. 1’తో అలాంటి సందేహాలకు ఫుల్‌స్టాప్ పెట్టాడు. ‘ఆది’తో స్టార్‌డమ్ సొంతం చేసుకున్నాడు. రెండు ‘నంది’ సహా పలు అవార్డులు అందుకున్నాడు. హీరోగా సుమారు 22 ఏళ్ల ప్రస్థానంలో.. ప్రస్తుతం 30వ సినిమా ‘దేవర’ (Devara)లో నటిస్తున్నాడు.
ఆలోచనల్ని మార్చిన ప్రమాదం
ఎన్టీఆర్ 2009లో కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. అదే తన జీవితంలో మార్పు తీసుకొచ్చిందని ఓ సందర్భంలో వివరించాడు. ఆ యాక్సిడెంట్ జరిగిన తర్వాత నుంచి చాలా కూల్ ఉంటున్నానని, బాధలోనూ నవ్వడం నేర్చుకున్నానని చెప్పాడు.
కోపమొచ్చిన సందర్భం
ఎన్టీఆర్ తన బరువుని కంట్రోల్‌లో పెట్టుకోలేకపోయాడు. బరువు తగ్గాలని అనుకోవడమేగానీ ప్రయత్నం చేయలేదు. ‘హరికృష్ణకు నాన్నలా ఉన్నావ్’ అనే విమర్శలూ ఎదుర్కొన్నాడు. ‘రాఖీ’ సినిమాలోని లుక్ చూశాక ‘సన్నబడేందుకు ఎందుకు ప్రయత్నించలేకపోతున్నా’ అని తనపై తానే కోపగించుకున్నాడు. ఆ తర్వాత, రాజమౌళి ఇచ్చిన ప్రోత్సాహంతో ‘యమదొంగ’ కోసం స్లిమ్‌గా మారి, అందరినీ ఆశ్చర్యపరిచాడు.
ఇవి ప్రత్యేకం..
- జపాన్‌లో విశేష క్రేజ్ ఉన్న ఏకైక తెలుగు నటుడు ఎన్టీఆర్.
- ‘ఫోర్బ్స్ ఇండియా’ సెలబ్రిటీ లిస్ట్‌లో రెండు సార్లు నిలిచాడు.
- ఎన్టీఆర్‌లో మంచి గాయకుడు ఉన్నాడు. ఆయన గొప్ప వ్యాఖ్యాత కూడా.
- పలు భాషల్లో అనర్గళంగా మాట్లాడగలడు. తన వాగ్ధాటితో ఇప్పటికే అన్ని చిత్ర పరిశ్రమల వారిని ఆకర్షించాడు.
- తారక్‌కి ‘9’ అంటే ఇష్టం. 9999.. తన కారు నంబరు ప్లేటుపైనే కాదు ట్విటర్ ఖాతాలోనూ కనిపిస్తుంది.
- ఆల్‌టైమ్ ఫేవరెట్ సాంగ్: మాతృదేవోభవ సినిమాలోని ‘రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే’.
- ఫేవరెట్ మూవీ: దాన వీర శూర కర్ణ.
- ఇంటర్వెల్ వరకూ ఎన్టీఆర్ మాట్లాడని సినిమా ‘నరసింహుడు’.
- ‘ఆంధ్రావాలా’ ఆడియో విడుదల వేడుక రికార్డు నెలకొల్పింది. నిమ్మకూరులో జరిగిన ఆ ఈవెంట్‌కు రైల్వే అధికారులు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయడం విశేషం. సుమారు 10 లక్షల మంది అభిమానులు పాల్గొన్నారు.
- ఎన్టీఆర్ 20 ఏళ్ల క్రితం నటించిన ‘సింహాద్రి’.. ఆయన పుట్టినరోజు సందర్భంగా 1000 స్క్రీన్లలో శనివారం రీ రిలీజ్ అయింది. సినిమా రీ రిలీజ్‌లో అన్ని స్క్రీన్లలో ప్రదర్శితమవడం రికార్డు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Vijay Antony: కుమార్తె లేదన్న దుఃఖాన్ని దిగమింగుకుని.. సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొని!
-
MS Swaminathan: అధికార లాంఛనాలతో ఎంఎస్ స్వామినాథన్ అంత్యక్రియలు: స్టాలిన్
-
Team India: వన్డే వరల్డ్ కప్.. అక్షర్ పటేల్ ఔట్.. అశ్విన్‌కు చోటు
-
Congress: ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన మైనంపల్లి, వేముల వీరేశం
-
Siddharth: సిద్ధార్థ్‌కు చేదు అనుభవం.. ప్రెస్‌మీట్ నుంచి వెళ్లిపోయిన హీరో
-
Nitin Gadkari: ఏడాది చివరికల్లా గుంతలు లేని జాతీయ రహదారులు: నితిన్ గడ్కరీ