Ram Charan: అప్పుడు వణికిపోయాడు.. ఇప్పుడు ఉప్పొంగిపోయేలా చేశాడు.. చరణ్‌ ప్రయాణమిది

ప్రముఖ హీరో రామ్‌చరణ్‌ (Ram Charan) పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని విశేషాలు..

Published : 27 Mar 2023 09:50 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సినిమా పత్రిక పేజీలు తిప్పుతున్నప్పుడు తండ్రి చూశాడని భయంతో వణికిపోయిన బాలుడు.. పెద్దయ్యాక అగ్ర కథానాయకుడై తండ్రిని ఆనందంతో ఉప్పొంగిపోయేలా చేశాడు. ఒకప్పుడు డ్యాన్స్‌ చేయాలంటే సిగ్గుపడిన ఆ పిల్లాడు.. ఇప్పుడు మరో స్టార్‌ హీరోతో కలిసి ‘నాటు’ స్టెప్పులేసి ‘ఆస్కార్‌’ పట్టుకున్నాడు. అతడే రామ్‌చరణ్‌ (Ram Charan). నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆ ప్రయాణాన్ని చూద్దాం (Happy Birthday Ram Charan)..

మహా సిగ్గరి..

1985 మార్చి 27న జన్మించిన చరణ్‌కు చిన్నప్పుడు చాలా సిగ్గు. ఇంట్లో పార్టీలున్నప్పుడు అల్లు అర్జున్‌, శిరీశ్‌ ఎంచక్కా స్టెప్పులేస్తుంటే చరణ్‌ చూస్తుండేవాడట. తప్పదూ అనుకున్నాడో.. ఎలాగైనా డ్యాన్స్‌ చేసి తనని తాను నిరూపించుకోవాలనుకున్నాడోగానీ ఒకే ఒకసారి కాలు కదిపాడు. ‘డ్యాన్స్‌ బాగా చేసే టాలీవుడ్‌ హీరోలు ఎవరు?’ అని ఎవరినైనా అడిగితే వారు చెప్పే జాబితాలో చెర్రీ పేరు తప్పక ఉంటుంది. మరి, చిన్నప్పుడు డ్యాన్స్‌కు దూరంగా ఉండేవాడు ఇప్పుడు ఇంతలా ఎలా ఆకట్టుకోగలుతున్నాడనే సందేహం కలగడం సహజం. చెర్రీ నటనలో మాత్రమే శిక్షణ తీసుకున్నాడు. అయితే, తన తండ్రి చిరంజీవి మంచి డ్యాన్సర్‌ కాబట్టి కొడుకూ ‘అదుర్స్‌ అనిపించేలా చేస్తే బాగుణ్ను’ అని అనుకునేవారు. ‘వీడు డ్యాన్స్‌ చేస్తాడా, లేదా?’ అంటూ టెన్షన్‌ కూడా పడేవారు. తండ్రి తన నుంచి ఏం ఆశిస్తున్నారో గ్రహించిన చెర్రీ ఎవరి ట్రైనింగ్‌ అవసరంలేకుండా తనంతట తానే నృత్యం చేయడం ప్రారంభించాడు. 

అది.. పది తర్వాతే!

‘తన తండ్రితోపాటు బాల్యంలో చెర్రీ ఎన్నో చిత్రాల చిత్రీకరణలకు వెళ్లి ఉంటాడు. చిన్నప్పటి నుంచీ సినిమాలు చూస్తూనే పెరిగి ఉంటాడు’ అని అనుకుంటే పొరపడినట్టే. చిరంజీవి నటించిన ‘రాజా విక్రమార్క’, ‘లంకేశ్వరుడు’, ‘ఆపద్భాంధవుడు’ షూటింగ్‌ లొకేషన్లకు మాత్రమే చరణ్‌ వెళ్లాడట. చిన్నప్పుడు సినిమాల ధ్యాసే ఉండేదికాదట. అంతెందుకు తన పాఠశాల రోజుల్లో.. ఇంట్లో సినిమా పోస్టర్లు చూడ్డమూ నిషేధమే. సినీ పత్రికలు, అవార్డులు వంటివి చిరంజీవి ఆఫీసుకే పరిమితం చేసేవారు. అయినా కుతూహలంతో చెర్రీ ఓసారి (8వ తరగతి చదివేటప్పుడు) సినీ మ్యాగజైన్‌ చూద్దామనుకున్నాడు. ఇంట్లో లేరనుకున్న చిరంజీవి హఠాత్తుగా తన దగ్గరకు రావడంతో భయంతో వణికిపోయాడు. ఆ రోజు పెద్ద చర్చే జరిగింది. పదో తరగతి పూర్తయ్యాకే చెర్రీకి చిరు కాస్త ‘సినీ ఫ్రీడమ్‌’ ఇచ్చారు. ‘మిస్టర్‌ సి’కి సంబంధించిన వ్యక్తిగత విషయాలు మాట్లాడుకునే ముందు.. ఒకప్పుడు సినిమాలపై ఇష్టంలేదన్న తాను తన చిత్రాలతో సృష్టించిన రికార్డులు, అప్పుడు డ్యాన్స్‌ చేసేందుకు సిగ్గుపడి.. ఇప్పుడు ‘నాటు నాటు’తో యావత్‌ సినీ ప్రియుల్ని ఉర్రూతలూగించిన సంగతులు గుర్తుచేసుకుందాం..

చిరుత నుంచి ఆర్‌ఆర్‌ఆర్‌ వరకు..

వెండితెరకు చరణ్‌ని ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ పరిచయం చేశారు. తమ సినిమాకి ‘చిరుత’ పేరు ప్రకటించగానే ‘చిరు తనయుడు’ అనుకుంటూ అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. 2007లో విడుదలైన ఆ సినిమాలోని నటనకుగాను చెర్రీ ‘స్పెషల్‌ జ్యూరీ’ విభాగంలో ‘నంది’ అందుకున్నాడు. ‘తండ్రి సపోర్ట్‌తో హీరో అయ్యాడు’ అని కొందరు అనుకుంటే.. ‘డ్యాన్స్‌ అదరగొట్టాడు. డైలాగ్స్‌తో దుమ్మురేపాడు’ అని కొందరు మెచ్చుకున్నారు. ఫస్ట్‌ మూవీ ఓకే.. మరి నెక్ట్స్‌ ఏంటి? అంటూ చెర్రీ భవిష్యత్తుపై ఇంకొందరు లెక్కలు వేస్తుంటే.. ‘మగధీర’తో సమాధామిచ్చాడు. రాజమౌళి దర్శకత్వం వహించిన ఆ సినిమా సుమారు రూ.150 కోట్లు వసూళ్లు (గ్రాస్‌) చేసి, టాలీవుడ్‌లోనే సరికొత్త రికార్డు సృష్టించింది. రెండో చిత్రంతోనే అగ్ర కథానాయకుల జాబితాలో చేరిన చరణ్‌ మూడో ప్రయత్నం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. అదే  ‘ఆరెంజ్’.

‘రచ్చ’, ‘నాయక్‌’, ‘తుఫాన్‌’, ‘ఎవడు’, ‘గోవిందుడు అందరివాడేలే’, ‘బ్రూస్‌లీ’.. ఇలా మళ్లీ కమర్షియల్‌ ధోరణిలో సాగుతున్న అతను ‘ధ్రువ’తో రూటు మార్చాడు. ఆ తర్వాత వచ్చిన ‘రంగస్థలం’ ఆయన ఇమేజ్‌ను పూర్తిగా మార్చేసింది. దాని తర్వాత ‘వినయ విధేయ రామ’, ‘ఆచార్య’తో ఫెయిల్యూర్‌ ఎదుర్కొన్న చెర్రీ.. ఎన్టీఆర్‌ (NTR)తో కలిసి చేసిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) బాక్సాఫీసు వద్ద రూ. 1200 కోట్లకుపైగా వసూళ్లు సాధించి, పలు అంతర్జాతీయ అవార్డులు దక్కించుకుని టాలీవుడ్‌ కీర్తిని విశ్వవ్యాప్తం చేసిన సంగతి తెలిసిందే. కొన్ని సినిమాల ఫలితం ఎలా ఉన్నా నటన, డ్యాన్స్‌ విషయంలో చరణ్‌ అభిమానుల్ని నిరుత్సాహపరచలేదని చెప్పొచ్చు. ఇలాంటి స్పీడ్‌ డ్యాన్సర్‌కు మరో స్పీడ్ డ్యాన్సర్‌ (ఎన్టీఆర్‌) తోడైతే ఎలా ఉంటుందో ‘నాటు నాటు’ (Naatu Naatu) (ఆర్‌ఆర్‌ఆర్‌) ప్రపంచానికి చాటి చెప్పింది. ఈ గీతానికి ఇటీవల ‘ఆస్కార్‌’ (Oscar) అవార్డు వరించింది. అతని 15వ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు శంకర్‌ తెరకెక్కిస్తున్నారు. #RC15 వర్కింగ్‌ టైటిల్‌తో రూపొందుతోన్న ఆ చిత్రం ప్రేక్షకుల్లో అంచనాలు పెంచుతోంది. ఇది పూర్తైన తర్వాత ‘ఉప్పెన’ ఫేం బుచ్చిబాబుతో ఓ సినిమా చేయనున్నాడు చరణ్‌.

అవే కానుకలు

చదువు విషయానికొస్తే.. చరణ్‌ యావరేజ్‌ స్టూడెంట్‌. ఏ స్కూల్‌లో చేరినా రెండేళ్లకంటే ఎక్కువ ఉండేవాడు కాదు. అలా 8 స్కూల్స్‌, 3 కాలేజీలు మారాడు. హీరో రానా బెస్ట్‌ ఫ్రెండ్‌. ఆటలంటే బాగా ఇష్టం. నాలుగో తరగతి చదివే సమయంలోనే గుర్రపు స్వారీ నేర్చుకున్నాడు. హార్స్‌ రైడింగ్‌లో ఆయనకు ఎంత ప్రావీణ్యం ఉందో ‘మగధీర’లోని సన్నివేశాలే తెలియజేస్తాయి. సినీ పత్రికల విషయంలో చిరు ఎంత స్ట్రిక్ట్‌గా ఉండేవారో బైక్‌ విషయంలోనూ అంతేనట. అందుకే ‘నాకు బైక్‌ రైడింగ్‌ అంటే భయం’ అని ఓ సందర్భంలో చెప్పాడు చెర్రీ. పెంపుడు జంతువులను ఇష్టపడే ఆయన.. పుట్టినరోజు, పెళ్లిరోజులకు వాటినే కానుకగా ఇస్తుంటాడు.

అందుకే దీక్ష..

చరణ్‌ తరచూ మాలధారణలో కనిపిస్తుంటాడు. ప్రశాంతత లభిస్తుందని, క్రమశిక్షణ అలవడుతుందనే ఉద్దేశంతోనే దీక్ష చేపడుతుంటాడు. నిర్మాతగానూ విజయాన్ని (సైరా, గాడ్‌ఫాదర్‌ తదితర చిత్రాలు) సొంతం చేసుకున్న చరణ్‌ 2012లో అపోలో సంస్థల ఉపాధ్యక్షురాలు ఉపాసన (Upasana)ను వివాహమాడారు. త్వరలోనే వీరిద్దరు తల్లిదండ్రులు కాబోతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని