Ram: కోలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌కు రామ్‌ క్షమాపణలు.. కారణమేమిటంటే..?

కోలీవుడ్‌కు చెందిన ఓ స్టార్‌ డైరెక్టర్‌కు టాలీవుడ్‌ హీరో, ఉస్తాద్‌ రామ్‌ (Ram) క్షమాపణలు చెప్పారు. సోషల్‌మీడియా వేదికగా సారీ చెబుతూ ఓ ట్వీట్‌ పెట్టారు. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’(Ismart Shankar), ‘రెడ్‌’ (Red) చిత్రాలతో...

Updated : 23 Jun 2022 22:10 IST

హైదరాబాద్‌: కోలీవుడ్‌కు చెందిన ఓ స్టార్‌ డైరెక్టర్‌కు టాలీవుడ్‌ హీరో, ఉస్తాద్‌ రామ్‌ (Ram) క్షమాపణలు చెప్పారు. సోషల్‌మీడియా వేదికగా సారీ చెబుతూ ఓ ట్వీట్‌ పెట్టారు. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’(Ismart Shankar), ‘రెడ్‌’ (Red) చిత్రాలతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన రామ్‌ ప్రస్తుతం నటిస్తోన్న చిత్రం ‘ది వారియర్‌’ (The Warriorr). ప్రముఖ కోలీవుడ్‌ డైరెక్టర్‌ లింగుస్వామి(Lingusamy) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ద్విభాషా చిత్రంగా తమిళం, తెలుగు భాషల్లో ఈ సినిమా సిద్ధమవుతోంది. కృతిశెట్టి కథానాయిక. వచ్చే నెలలో ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ‘ది వారియర్‌’ ప్రమోషన్స్‌ను చిత్రబృందం షురూ చేసింది. ఇందులో భాగంగా ఇప్పటికే టీజర్‌తో పాటు ‘బుల్లెట్’‌, ‘దడ దడమని గుండెల శబ్దం’ వంటి సాంగ్స్‌తో ప్రేక్షకులను అలరించిన ఈ టీమ్‌ తాజాగా మరో కొత్త పాటని విడుదల చేసింది.

‘విజిల్‌’ అంటూ సాగే ఈ హై ఓల్టేజ్‌ పాటను బుధవారం సాయంత్రం విడుదల చేశారు. పాట విడుదల కోసం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చిత్ర బృందం పాల్గొని.. చిత్రీకరణ సమయంలో చోటుచేసుకున్న ఎన్నో మధుర జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. రామ్‌ మాట్లాడుతూ.. ‘విజిల్‌’ సాంగ్‌ తనకెంతో నచ్చిందని.. తమ చిత్రానికి ఇంతటి ఎనర్జిటిక్‌ మ్యూజిక్‌ అందించిన దేవిశ్రీ ప్రసాద్‌, సింగర్స్‌, నిర్మాతలు, ఇతర చిత్రబృందానికి ధన్యవాదాలు చెప్పారు. అయితే ఆయన స్టేజ్‌పై ఇచ్చిన స్పీచ్‌లో దర్శకుడు లింగుస్వామి గురించి చెప్పడం మర్చిపోయారు. ఇదే విషయాన్ని గ్రహించిన రామ్‌ ట్విటర్‌ వేదికగా నేడు ఆయనకు క్షమాపణలు చెప్పారు. ‘‘ఈ చిత్రం తెరకెక్కడంలో ముఖ్య పాత్ర పోషించిన వ్యక్తి గురించి చెప్పడం మర్చిపోయాను. నా వారియర్‌, డైరెక్టర్‌ లింగుస్వామి!! ఈ సినిమాకు సంబంధించిన ప్రతి ఫ్రేమ్‌ని మీరు మీ భుజాలపైకి ఎత్తుకున్నారు. ఇప్పటివరకూ నేను పనిచేసిన ఉత్తమమైన దర్శకుల్లో మీరూ ఒక్కరిగా ఉన్నందుకు ధన్యవాదాలు. సారీ అండ్‌ లవ్‌ యూ’’ అని రామ్‌ రాసుకొచ్చారు.

రామ్‌ పెట్టిన ట్వీట్‌పై లింగుస్వామి స్పందించారు. ‘‘నాతో కలిసి పనిచేయడాన్ని నువ్వు ఎంతలా ఇష్టపడ్డావో నాకు తెలుసు. అలాగే, సినిమా చూసిన అనంతరం ఆత్మీయంగా నువ్వు నన్ను ఆలింగనం చేసుకున్నావ్‌ కదా.. ఆ క్షణాన్ని నేను ఎప్పటికీ మర్చిపోను. మనం మరింత దూరం ప్రయాణించాలని కోరుకుంటున్నా’’ అని బదులిచ్చారు. శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌పై ఈ సినిమా నిర్మితమైంది. ఇందులో రామ్‌ పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ఆది పినిశెట్టి ప్రతినాయకుడు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు అందిస్తున్నారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని