Sarath Babu: సీనియర్‌ నటుడు శరత్‌బాబు కన్నుమూత

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సినీ నటుడు నటుడు శరత్‌బాబు సోమవారం తుది శ్వాస విడిచారు.

Updated : 22 May 2023 16:52 IST

హైదరాబాద్‌: టాలీవుడ్‌ సీనియర్‌ నటుడు శరత్‌బాబు (Sarath Babu) (71) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో ఇబ్బందిపడుతోన్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. శరీరం మొత్తం విషతుల్యం (సెప్సిస్‌) కావడంతో కిడ్నీలు, ఊపిరితిత్తులు, కాలేయం ఇతర అవయవాలు దెబ్బతిని ఆయన మరణించారని వైద్యులు వెల్లడించారు. ఆయన మరణవార్తతో చిత్రపరిశ్రమలో విషాదం నెలకొంది. శరత్‌బాబు మృతికి సంతాపం ప్రకటిస్తూ సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్‌మీడియాలో సంతాపం తెలిపారు. శరత్‌బాబు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. శరత్‌బాబు భౌతికకాయాన్ని చెన్నై తరలించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.

శ్రీకాకుళం జిల్లాలోని ఆమదాలవలసకు చెందిన విజయశంకర దీక్షితులు సుశీలాదేవిల కుమారుడే శరత్‌బాబు. చిన్నతనం నుంచి ఐపీఎస్‌ కావాలని కలలు కన్న ఆయన అనుకోకుండా నాటకరంగం వైపు వచ్చారు. కళాశాలలో చదువుతున్న రోజుల్లో ఎన్నో నాటకాలు వేసిన శరత్‌బాబు 1973లో విడుదలైన ‘రామరాజ్యం’తో హీరోగా తొలి అడుగు వేశారు. రెండో సినిమా కోసం విలన్‌ పాత్ర పోషించి.. హీరోగానే కాకుండా విలన్‌, సహాయనటుడిగా సుమారు 250కు పైగా చిత్రాల్లో నటించారాయాన. ‘మరో చరిత్ర’, ‘గుప్పెడు మనసు’, ‘శృంగార రాముడు’, ‘ఇది కథ కాదు’, ‘47 రోజులు’, ‘సీతాకోక చిలుక’, ‘సితార’, ‘అన్వేషణ’, ‘స్వాతిముత్యం’, ‘సాగరసంగమం’, ‘సంసారం ఒక చదరంగం’, ‘క్రిమినల్‌’, ‘అన్నయ్య’ ఇలా ఎన్నో సినిమాలు ఆయనకు నటుడిగా మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. శరత్‌బాబు సినిమాల్లోనే కాకుండా సీరియల్స్‌లోనూ రాణించారు. ఈటీవీలో ప్రసారమైన ‘అంతరంగాలు’ ధారావాహిక ఆయన్ని బుల్లితెర ప్రేక్షకులకు మరింత చేరువ చేసింది. వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే శరత్‌బాబు నటి రమాప్రభను వివాహమాడిన విషయం తెలిసిందే. అయితే వ్యక్తిగత కారణాల రీత్యా వివాహమైన కొంతకాలానికే వీరిద్దరూ విడిపోయారు.

ఫిల్మ్‌ఛాంబర్‌కు శరత్‌బాబు భౌతిక దేహం

శరత్‌బాబు మరణం పట్ల మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌ సంతాపం తెలిపింది. అభిమానుల సందర్శనార్థం ఆస్పత్రి నుంచి సాయంత్రం 5.30 గంటలకు ఫిల్మి ఛాంబర్‌కు భౌతిక కాయాన్ని తరలించనున్నట్లు  నిర్మాత మాదాల రవి తెలిపారు. అక్కడి నుంచి సాయంత్రం 6.30 గంటలకు చెన్నై తరలిస్తామన్నారు.

ఇంత త్వరగా చనిపోతారనుకోలేదు: మురళీ మోహన్‌

శరత్‌బాబు అనారోగ్యంగా ఉన్నారని తెలుసనీ, అయితే ఇంత త్వరగా చనిపోతారనుకోలేదని సీనియర్‌ నటుడు మురళీమోహన్‌ అన్నారు. శరత్‌బాబు భౌతిక దేహాన్ని సందర్శించేందుకు ఆయన ఏఐజీ ఆస్పత్రికి వెళ్లారు. అంత్యక్రియలను చెన్నైలోనే నిర్వహించనున్నట్లు చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని