బ్యాంకింగ్‌ సంక్షోభం వల్ల నా డబ్బు సగం పోయింది: నటి

Sharon Stone: హాలీవుడ్‌ చిత్రాల్లో శృంగార తారగా పేరు తెచ్చుకున్న షరాన్‌స్టోన్‌ తన వద్ద ఉన్న సగం డబ్బును కోల్పోయినట్లు చెప్పారు.

Updated : 20 Mar 2023 19:30 IST

కాలిఫోర్నియా: అమెరికాలో నెలకొన్న బ్యాంకింగ్‌ సంక్షోభం వల్ల తాను ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నానని, తన వద్ద ఉన్న డబ్బులో సగం పోయిందని హాలీవుడ్‌ శృంగార తార షరాన్‌స్టోన్‌ (Sharon Stone) ఆవేదన వ్యక్తం చేశారు. ఉమెన్స్‌ క్యాన్సర్‌ రీసెర్చ్‌ ఫండ్స్‌ నిర్వహించిన ఫండ్‌ రైజింగ్‌ ఈవెంట్‌లో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమెకు సాహసి అవార్డును ప్రదానం చేశారు. క్యాన్సర్‌ ఛారిటీకి ప్రతి ఒక్కరూ సాయం చేయాలని కోరారు.

‘‘ప్రస్తుత పరిస్థితుల్లో డబ్బును సాయం చేయడమనేది చాలా కష్టమని నాకు తెలుసు. నేనొక టెక్నికల్‌ ఇడియట్‌ను. పనికిరాని చెక్‌లు రాసి ఇవ్వగలను. నాకా ధైర్యం ఉంది. అలా చేస్తే ఏం జరుగుతుందో నాకు తెలుసు. బ్యాంకింగ్‌ వ్యవస్థ వల్ల ఇటీవల నేను సగం డబ్బును కోల్పోయా. ప్రస్తుతం ప్రపంచం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. రాజకీయ నాయకుడిలా ఉపన్యాసాలు ఇచ్చి, ఏం చేయాలి? ఏం చేయకూడదు? ఎలా బతకాలి? ఎలా బతకకూడదు? అని చెప్పడానికి నేను ఇక్కడకు రాలేదు. నా జీవితం విలువ అంతేనా? మేల్కొనండి. మీ విలువేంటో ప్రపంచానికి చెప్పండి. ధైర్యంగా ఉండండి. అదే నిజమైన సాహసం’’ అని షరాన్‌ భావోద్వేగానికి గురయ్యారు. అయితే  ఆమె ఎంత మొత్తం కోల్పోయారు? అందుకు అసలైన కారణాలు ఏంటి? అనే విషయాన్ని మాత్రం చెప్పలేదు. సిలికాన్‌ వ్యాలీ బ్యాంకు కుప్పకూలిన తర్వాత షరాన్‌ ఈ విధంగా స్పందించడం గమనార్హం.

షరాన్‌స్టోన్‌ ఇటీవల కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాను నటించిన ఒక సినిమాలోని ఒక అసభ్య సన్నివేశం వల్ల తన వద్ద పెరగాల్సిన కొడుకు దూరమయ్యాడని వాపోయింది. అలాగే, తన భర్తతో విడాకుల కేసు విచారణ సందర్భంగా చిన్నవాడైన నా కుమారుడిని  న్యాయమూర్తి ప్రశ్నిస్తూ ‘మీ అమ్మ శృంగార సినిమాలు చేస్తారని నీకు తెలుసా’ అని అడిగారని చెప్పుకొచ్చారు. 1993 గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డుల సందర్భంగానూ తాను అవమానానికి, హేళనకు గురైనట్లు చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు