Srikanth: విడాకుల రూమర్స్.. భార్యతో కలిసి వెళ్లాల్సి వస్తోంది: శ్రీకాంత్
ఎన్నో కుటుంబ కథా చిత్రాల్లో హీరోగా కనిపించి, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు శ్రీకాంత్. గతంలో తనపై వచ్చిన వార్తలపై ఆయన ఓ ఇంటర్వ్యూలో స్పందించారు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ హీరో శ్రీకాంత్ (Srikanth) తన సతీమణి ఊహకు విడాకులు ఇస్తున్నారంటూ గతేడాది నవంబరులో వదంతులు వచ్చిన సంగతి తెలిసిందే. అప్పుడే వాటిపై స్పందించిన ఆయన వాటిని ఖండిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఆ ప్రస్తావనరాగా శ్రీకాంత్ మాట్లాడారు.
‘‘సోషల్ మీడియాలో ఎవరికి నచ్చినట్టు వాళ్లు రాస్తున్నారు, థంబ్‌నైల్స్ పెడుతున్నారు. కొన్ని మరీ దారుణంగా ఉంటాయి. నేను మరణించినట్టు ఓసారి ఫొటో పెట్టేశారు. అలాంటివి చూసిన సమయంలో బాధగా ఉంటుంది అయినా మేం తట్టుకోగలం. కానీ, అమ్మ వాళ్లకు తెలిస్తే తట్టుకోలేరు. ఆ షాకింగ్‌లో వారికి ఏమైనా అవ్వొచ్చు. అలా అబద్ధపు వార్తలు రాసే వారిపై ఎలాంటి యాక్షన్ తీసుకోవాలనుకున్నా ఫలితం ఉండదు. వ్యక్తిగతంగా వారిలోనే మార్పు రావాలి. నేను విడాకులు ఇస్తున్నాననీ వదంతలు పుట్టించారు. దాని వల్ల ఇప్పుడు మేమిద్దరం వేడుకలకు కలిసి వెళ్లాల్సి వస్తోంది (నవ్వులు). సినిమా ఈవెంట్స్‌సహా ఏ వేడుకకైనా వెళ్లేందుకు నా భార్య ఆసక్తి చూపించదు. ఆ విషయం ఫిల్మ్ ఇండస్ట్రీ వారికి తెలుసు. నటుడు కోట శ్రీనివాసరావు మరణించినట్టు కూడా రూమర్స్ క్రియేట్ చేశారు. అది చూసి షాకయ్యా’’ అని పేర్కొన్నారు.
నేడు శ్రీకాంత్ పుట్టిన రోజు. ఎక్కువగా కుటుంబ కథా చిత్రాల్లో నటించి, విశేష ప్రేక్షకాదరణ పొందిన ఆయన ప్రస్తుతం సపోర్టింగ్ రోల్స్, విలన్ పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన ‘వారసుడు’, ‘హంట్’ చిత్రాల్లో కనిపించిన ఆయన ప్రస్తుతం #RC15 (వర్కింగ్ టైటిల్), #NTR30 (వర్కింగ్ టైటిల్)లో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రామ్‌చరణ్ హీరోగా దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న సినిమానే ‘ఆర్సీ 15’. ‘జనతా గ్యారేజ్’ తర్వాత ఎన్టీఆర్- డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందుతోంది ‘ఎన్టీఆర్ 30’.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.