Sriram: ఆ ప్రమాదంలో నా శరీరం కాలిపోయింది: శ్రీరామ్‌

ఒకరి పొరపాటు వల్ల గతంలో తానో ఓ అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నానని, శరీరం కాలిపోయిందని నటుడు శ్రీరామ్‌ అలియాస్‌ శ్రీకాంత్‌ అన్నారు. ఆలీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన ఆయన పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు.

Published : 10 Feb 2022 01:46 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఒకరి తప్పిదం వల్ల గతంలో తానో ఓ అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నానని, శరీరం కాలిపోయిందని నటుడు శ్రీరామ్‌ అలియాస్‌ శ్రీకాంత్‌ అన్నారు. ఆలీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన ఆయన ఈ విషయాన్ని చెప్పారు. తన జీవిత విశేషాలను పంచుకున్నారు. తన తండ్రి తెలుగువారని, తల్లి తమిళనాడుకి చెందిన వారని తెలిపారు. తన భార్య గురించి చెప్తూ నవ్వులు పంచారు. సినిమాటోగ్రాఫర్‌ రసూల్‌ ఎల్లోర్‌తో తనకున్న అనుబంధాన్ని వివరించారు. 5వ తరగతిలోనే డబ్బు సంపాదించటం మొదలుపెట్టానన్నారు. ఓరోజు రామోజీ ఫిలిం సిటీలో రజనీకాంత్‌ను చూద్దామనుకోగా.. అనుకోకుండా ఆయనే వచ్చి హగ్‌ చేసుకున్నారని తెలిపారు. షోలో భాగంగా ‘నాకో బుల్లిచెల్లి.. నా చెల్లికి పెళ్లి జరగాలి మళ్లీ మళ్లీ’ అనే డైలాగ్‌ చెప్పి అలరించారు. అనంతరం, తనకు జరిగిన ప్రమాదం గురించి చెప్పారు.

శ్రీరామ్‌ ఓ తమిళ సీరియల్‌తో నటుడిగా కెరీర్‌ ప్రారంభించారు. ‘రోజాకూటం’ అనే తమిళ సినిమాతో హీరోగా మారారు. ఈ సినిమా తెలుగులో ‘రోజాపూలు’ పేరుతో విడుదలై మంచి విజయం అందుకుంది. ఆయనకు మంచి పేరు తీసుకొచ్చింది. తర్వాత, ‘ఒకరికొకరు’, ‘ఆడవారి మాటలకు అర్థాలు వేరులే’ తదితర చిత్రాలతో విశేషంగా ఆకట్టుకున్నారు. ఇటీవల ‘టెన్త్‌ క్లాస్‌ డైరీస్‌’ అనే సినిమాలో నటించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని