Suhas: హీరోగా ఫస్ట్‌ థియేటర్‌ రిలీజ్‌.. సినిమా కష్టాలు గుర్తు చేసుకుని నటుడు ఎమోషనల్‌

తన సినీ కెరీర్‌ను గుర్తు చేసుకుని ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టారు నటుడు సుహాస్‌ (Suhas). త్వరలో విడుదల కానున్న ‘రైటర్‌ పద్మభూషణ్‌’ తనకెంతో ప్రత్యేకమని తెలిపారు.

Published : 31 Jan 2023 01:18 IST

హైదరాబాద్‌: యూట్యూబ్‌తో కెరీర్‌ మొదలుపెట్టి.. వెండితెరపై నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు సుహాస్ (Suhas)‌. ఆయన ప్రధాన పాత్రలో నటించిన ‘రైటర్‌ పద్మభూషణ్‌’ (Writer Padmabhushan) త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. సొంత ఊరు విజయవాడలో తనకెంతో ఇష్టమైన రాజ్‌ యువరాజ్‌ థియేటర్‌లో ‘రైటర్‌ పద్మభూషణ్‌’ ప్రీమియర్‌ వేశారని పేర్కొంటూ ఆయన ఇన్‌స్టాలో ఓ పోస్ట్‌ పెట్టారు. ఈ నేపథ్యంలో నటుడిగా తన ప్రయాణం ఎలా మొదలైందో గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు.

‘‘అబ్బో... ఎక్కడి నువ్వు ఎక్కడికి వచ్చేశావురా సుహాసూ..!! సినిమాలు తప్ప పుస్తకాలను పట్టించుకోకపోవడం.. కాలేజీ మానేసి మార్నింగ్‌, మ్యాట్నీ షోలకు హాజరు కావడం.. చిరిగిపోయే టికెట్‌ కోసం లైన్‌లో చొక్కాలు చిరిగేలా యుద్ధం చేయడం.. ఇవన్నీ తెలిసి నాన్న బెల్ట్ తెగిపోయేలా కొట్టడం.. సినిమా ఛాన్స్‌ కోసం చెప్పులు అరిగేలా తిరగడం.. వచ్చిన అరకొర వేషాలతో కడుపునిండక, భవిష్యత్తు కనపడక, కళ్లు నీటితో నిండిపోవడం, యూట్యూబ్ నుంచి దూరంగా, హీరోగా మొదటి సినిమా వచ్చింది అనుకునేలోపే వెండితెర వెయిటింగ్‌లో పడి ఓటీటీలో బ్లాక్‌బస్టర్‌ కావడం.. దానికి జాతీయ అవార్డు రావడం.. ఫైనల్‌గా విజయవాడకు దూరంగా, సినిమాకు దగ్గరగా.. సుమారు పదేళ్ల ప్రయాణం తర్వాత.. ఏదో అద్భుతంలా ఈ సినిమా పురుగు నా బుర్రలో ఎక్కడైతే మొదలైందో అక్కడే నా మొదటి థియేటర్‌ రిలీజ్‌, మొదటి ప్రీమియర్‌ పడటం.. అబ్బో ఈ ఫీలింగ్‌ ఏంటో మామూలుగా లేదుగా రా సుహాసూ’’ అని ఆయన రాసుకొచ్చారు.

యూట్యూబ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న సుహాస్(Suhas)‌.. ‘పడి పడి లేచే మనసు’, ‘మజిలీ’, ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వంటి చిత్రాల్లో చిన్న పాత్రల్లో నటించి మెప్పించారు. ఈ క్రమంలోనే ఆయన్ని హీరోగా పెట్టి  సందీప్‌ రాజ్‌ ‘కలర్‌ ఫొటో’ (Colour Photo) తీశారు. కరోనా కారణంగా ఈ సినిమా థియేటర్‌ రిలీజ్‌కు నోచుకోలేదు. దీంతో సుహాస్‌ ‘రైటర్‌ పద్మభూషణ్‌’ (Writer Padmabhushan) ఎంతో స్పెషల్‌గా మారింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని