IT Raids: మంత్రిని సాయం కోరిన తాప్సీ ప్రియుడు

బాలీవుడ్‌ నటి తాప్సీ ఇంటిపై ఐటీ దాడులు జరగడంతో ఆమె ప్రియుడు మథియాస్‌ బో గందరగోళానికి గురయ్యారు. దీంతో ఆయన సోషల్‌మీడియా వేదికగా మంత్రి కిరణ్‌ రిజిజును సాయం కోరుతూ ట్వీట్‌ చేశారు. 2018లో మూసివేసిన ఫాంటమ్‌ ఫిలిమ్స్‌...

Updated : 06 Mar 2021 11:38 IST

వైరల్‌గా మారిన ట్వీట్‌

ముంబయి: బాలీవుడ్‌ నటి తాప్సీ ఇంటిపై ఐటీ దాడులు జరగడంతో ఆమె ప్రియుడు మథియాస్‌ బో గందరగోళానికి గురయ్యారు. దీంతో ఆయన సోషల్‌మీడియా వేదికగా మంత్రి కిరణ్‌ రిజిజును సాయం కోరుతూ ట్వీట్‌ చేశారు. 2018లో మూసివేసిన ఫాంటమ్‌ ఫిలిమ్స్‌ పన్ను ఎగవేత కేసులో బాలీవుడ్‌ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌తోపాటు ఆయన భాగస్వాముల నివాసాలు, కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) అధికారులు రెండు రోజుల క్రితం దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాప్సీ ఇంటిపై కూడా దాడులు జరిగాయి.

కాగా, ఐటీ దాడులను ఉద్దేశిస్తూ తాప్సీ ప్రియుడు మథియాస్‌ బో ఓ ట్వీట్‌ పెట్టారు. ‘ఏదో తెలియని గందరగోళానికి గురవుతున్నాను. మొట్టమొదటిసారి భారత్‌కు చెందిన గొప్ప క్రీడాకారులకు కోచ్‌గా వ్యవహరిస్తున్నాననే సంతోషంలో ఉండగానే..  తాప్సీ ఇంటిపై ఐటీ దాడులు జరిగాయని తెలిసి కాస్త ఇబ్బందికి లోనయ్యాను. ఈ దాడుల వల్ల ఆమె కుటుంబం ముఖ్యంగా తల్లిదండ్రులు ఎంతో ఒత్తిడికి లోనవుతున్నారు. కిరణ్‌ రిజిజు సర్‌.. దయచేసి ఏదైనా చేయండి’’ అని బో ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌పై స్పందించిన రిజిజు.. ‘చట్టం ముందు అందరూ సమానమే. ఈ విషయం మనిద్దరి పరిధిలో లేనిది. మన వృత్తిపరమైన బాధ్యతలను మరింత మెరుగ్గా నిర్వర్తిద్దాం.’’ అని రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఈ సందేశం నెట్టింట్లో వైరల్‌గా మారింది.

డెన్మార్క్‌ బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడైన మథియాస్‌.. గత కొన్ని సంవత్సరాల నుంచి తాప్సీతో రిలేషన్‌లో ఉన్నారు. పలు సందర్భాల్లో ఆమెతో దిగిన ఫొటోలను సైతం ఆయన సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఇటీవల వీరిద్దరూ కలిసి మాల్దీవులకూ వెళ్లి వచ్చారు. ఇక తాప్సీ విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె ‘రష్మి రాకెట్‌’, ‘దొబారా’ చిత్రాల్లో నటిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని