Updated : 24 May 2022 22:41 IST

Venkatesh: నా కెరీర్‌లో అలాంటి పాత్ర చేయడం ఇదే తొలిసారి: వెంకటేష్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: తన కెరీర్‌లో ఇప్పటివరకు నటించని పాత్రను ‘ఎఫ్‌ 3’ (F 3) సినిమాలో పోషించానని ప్రముఖ నటుడు వెంకటేష్‌ (Venkatesh) తెలిపారు. యువ నటుడు వరుణ్‌తేజ్‌ (Varun Tej)తో కలిసి ఆయన నటించిన చిత్రమిది. ‘ఎఫ్‌ 2’కు సీక్వెల్‌గా రూపొందింది. దర్శకుడు అనిల్‌ రావిపూడి (Anil Ravipudi) తెరకెక్కించిన ఈ సినిమా మే 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా వెంకటేష్‌ విలేకరులతో ముచ్చటించారు. ఆయన పంచుకున్న విశేషాలివీ..

* రెండున్నరేళ్ల (సుమారు) తర్వాత వెండితెరపై కనిపించబోతున్నారు కదా?

వెంకటేష్‌: అవును. దానికి కారణం కొవిడ్‌ అని అందరికీ తెలిసిందే. అందుకే ‘నారప్ప’, ‘దృశ్యం 2’ సినిమాలు ఓటీటీలో విడుదలయ్యాయి. వ్యక్తిగతంగా నాకు బాగా దగ్గరైన ‘నారప్ప’ థియేటర్‌లో విడుదలైతే బాగుండేదని ఎప్పుడూ అనుకుంటూ ఉంటా. ఏ సినిమా అయినా థియేటర్లలో చూస్తేనే మజా. థియేటర్‌ వాతావరణం పండగలా ఉంటుంది. దాన్నే నేను ఇష్టపడతా.

* కామెడీ చిత్రాల్లో నటించడం ఎలా అనిపిస్తుంటుంది?

వెంకటేష్‌: నాకు కామెడీ అంటే ఇష్టం. కాలేజీ రోజుల్లో అందరితోనూ చాలా సరదాగా ఉండేవాడిని. నా చిన్నప్పుడు అల్లు రామలింగయ్య హావభావాలను అనుకరించేవాడిని. కథ నచ్చితే చాలు అందులో నాది ఎలాంటి పాత్ర అనేది చూడను. ఒక్కసారి సినిమా ఒప్పుకున్న తర్వాత నేను పెద్ద స్టార్‌నన్న విషయాన్ని మర్చిపోతా. దర్శకుడు కోరుకున్నట్లు నటిస్తా. ఈ సినిమానే కాదు నేను గతంలో నటించిన ‘నువ్వు నాకు నచ్చావ్‌’, ‘మల్లీశ్వరి’ తదితర చిత్రాల్లోనూ హాస్యం మెండుగా ఉంది.

* ఈ సినిమా దర్శకనిర్మాతల గురించి చెప్తారా?

వెంకటేష్‌: నేను గతంలో నటించిన ‘మసాల’ సినిమా అప్పటినుంచి దర్శకుడు అనిల్‌ రావిపూడి నాకు తెలుసు. చాలా సింపుల్‌గా ఉంటాడు. ‘నాకు ఇలానే కావాలి’ అంటూ ఏ నటుడినీ నొప్పించడు. ఎవరికి నచ్చినట్టు వారిని నటించమని చెప్తాడు. నిర్మాత విషయానికొస్తే.. దిల్‌రాజు బ్యానర్‌లో నేను చేసిన మూడో సినిమా ఇది. ‘ప్రేమించుకుందాం రా’ సినిమా అప్పుడే దిల్‌రాజుకు సినిమాలపై ఉన్న ఆసక్తిని గమనించా. కష్టపడి పనిచేస్తాడు.

*  ఈ సినిమాలోని పాత్ర మీ నిజ జీవితానికి దగ్గరగా ఉంటుందా?

వెంకటేష్‌: లేదు. పూర్తి భిన్నంగా ఉంటుంది. నా కెరీర్‌లో తొలిసారి రేచీకటి ఉన్న వ్యక్తి పాత్రలో నటించా. 

* ‘ఎఫ్‌2’కి సీక్వెల్‌గా వస్తున్న ‘ఎఫ్‌3’ కొత్తగా ఉంటుందా?

వెంకటేష్‌: కొత్తగా, ‘ఎఫ్‌ 2’కి మించిన ఫన్‌ ఉంటుంది. ‘ఎఫ్‌3’లో చాలా మంది ఆర్టిస్టులు కనిపిస్తారు. ప్రేక్షకులు సినిమాలోని పాత్రలకు బాగా కనెక్ట్‌ అవుతారు. సినిమా బాగుందా లేదా అని చెప్పేది ప్రేక్షకులే. వాళ్లని దృష్టిలో పెట్టుకొనే ఏదైలా తీయాలి.

* కొవిడ్‌ టైంలో ‘ఎఫ్‌ 3’ షూటింగ్‌ జరిగింది. ఎప్పుడైనా భయం వేసిందా?

వెంకటేష్‌: భయం వేసింది. ప్రతిరోజూ షూటింగ్‌ అయిపోయి ఇంటికి రాగానే ఆవిరి పట్టుకునే వాడిని. కొవిడ్‌ రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నా. నేను ఇప్పటికీ మాస్క్‌ పెట్టుకుంటున్నా. నేను ఇంతకుముందు కూడా బయటకు ఎక్కువగా వచ్చేవాడిని కాదు. షూటింగ్‌ ఉంటేనే బయటకు వస్తా.

* డబ్బుకు ప్రాధాన్యత ఇస్తారా?

వెంకటేష్‌: డబ్బు అందరికీ కావాలి. మనది అనుకున్నది ఏదైనా మన దగ్గరకు వస్తుంది. ఏది అవసరమో అది ప్రకృతి మనకు ఇస్తుంది. ఏదీ మితిమీరి కోరుకోకూడదు. వచ్చిన దానితో సంతృప్తిపడాలి. వచ్చిన పనికి మనం ఎంత న్యాయం చేస్తున్నామన్నది ముఖ్యం.

* ఇప్పటి వరకు మీరు 7 మల్టీస్టారర్‌ సినిమాలు చేశారు. ఎవరితో మళ్లీ నటించాలని ఉంది?

వెంకటేష్‌: కథ బాగుంటే ఎవరితో అయినా చేస్తా. సినిమా విజయాపజయాలు పట్టించుకోను. కథ ముఖ్యం. అవార్డులు, రికార్డులు వస్తే ఆనందంగానే ఉంటుంది. కానీ, మనం ప్రేక్షకులు కోరుకున్నది ఇస్తున్నామా లేదా అనేది చూడాలి. బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌తో కలిసి ఓ సినిమాలో నటించనున్నాను. అది వచ్చే నెల నుంచి షూటింగ్‌ ప్రారంభమవుతుంది.

* పాన్‌ ఇండియా సినిమా మీద మీ అభిప్రాయం ఏంటి? 

వెంకటేష్‌: ఏ సినిమా అయినా టీమ్‌ వర్క్‌ మీద ఆధారపడి ఉంటుంది. ఒక సినిమా ఎలా తీయాలన్నది నిర్మాతలు, దర్శకులు చూసుకుంటారు. ఒక సినిమాకు సామర్థ్యం ఉంది అనుకుంటే దానిని పాన్‌ ఇండియా స్థాయిలో నిర్మిస్తారు.

* ఇప్పడు చాలామంది బయోపిక్స్‌ వస్తున్నాయి. మీ నాన్న బయోపిక్ తీస్తే నటిస్తారా?

వెంకటేష్‌: చేస్తే బాగుంటుంది. కానీ, స్క్రిప్టు కుదరాలి కదా. స్వామి వివేకానంద జీవిత చరిత్ర సినిమాగా తీయాలనే ఆలోచన ఉన్నా అది సాధ్యపడలేదు.

* ‘నెట్‌ఫ్లిక్స్‌’లో చేస్తున్న వెబ్‌ సిరీస్‌ గురించి..

వెంకటేష్‌: అదో అద్భుతం. చాలా విభిన్నమై కథ. అంతకు మించి దాని గురించి ఇప్పుడేం చెప్పలేను.

* పాన్‌ ఇండియా స్థాయి చిత్రంలో నటిస్తారా?

వెంకటేష్‌: దాని గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. మంచి కథ, టీమ్‌ కుదిరితే తప్పకుండా చేస్తా.

* ఏదైనా రియాలిటీ షోకి హోస్ట్‌గా చేయాలనుందా?

వెంకటేష్: ఇంతకు ముందు కొన్ని ఆఫర్లు వచ్చాయి. రియాలిటీ షో చేయాలంటే నాకు కాస్త ఇబ్బందిగా ఉంటుంది. చెప్పిన డైలాగే మళ్లీ మళ్లీ చెప్పి, ఇచ్చిన హావభావాలను రెండుసార్లు పలికించమంటే ఏదో తెలియని ఫీలింగ్‌ కలుగుతుంది.

* మీ అబ్బాయి తెరంగేట్రం ఎప్పుడు?

వెంకటేష్‌: ఈ విషయంపై ప్రస్తుతానికి ఎలాంటి ఆలోచనా లేదు. తను చదువుకుంటున్నాడు.

* నిజజీవితంలో మీకు ఫ్రస్టేషన్‌ ఉంటుందా?

వెంకటేష్‌: అస్సలు ఉండదు.

* మీ కొత్త సినిమా కబుర్లు?

వెంకటేష్‌: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్స్‌లో సినిమాలు చేస్తున్నా. 


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని