Venu Madhav: ఒక్క సీన్‌ అనుకుంటే మూడు సీన్లు అయ్యాయి

ఒకప్పుడు సినిమా సెట్స్‌పైకి వెళ్లేముందే నటీనటులు ఎవరెవరు? ఎవరికి ఎన్నిసీన్లు ఉండాలి?

Updated : 06 Jul 2022 17:54 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఒకప్పుడు సినిమా సెట్స్‌పైకి వెళ్లేముందే నటీనటులు ఎవరెవరు? ఎవరికి ఎన్నిసీన్లు ఉండాలి? అనే స్పష్టత ఉండేది. స్క్రిప్ట్ పరిధి దాటి సన్నివేశాలు తీయడం అరుదు. ఏదైనా ట్రాక్‌ బాగుందని అనిపిస్తే, అదనంగా కొన్ని సన్నివేశాలు జోడించేవారు. అలాంటి సందర్భమే రాజమౌళి(Rajamouli) తీసిన ‘సై’ సినిమాకు జరిగింది. ఈ సినిమాలో దివంగత హాస్యనటుడు వేణుమాధవ్‌ కామెడీ ట్రాక్‌ను ఎవరూ మర్చిపోలేరు. గోడలపై పెయింట్‌లు వేసుకునే వ్యక్తిగా స్టూడెంట్స్‌, పోలీస్‌, విలన్‌లను బెదిరించి ఇరుకున పడే వ్యక్తిగా చక్కటి హాస్యాన్ని పంచి అలరించారు.

తొలుత వేణు మాధవ్‌ కోసం ఒకే సన్నివేశాన్నే అనుకున్నారు రాజమౌళి. అందుకు అనుగుణంగానే వేణుమాధవ్‌ స్టూడెంట్స్‌ను బెదిరిస్తూ ‘నల్లబాలు.. నల్లత్రాచు లెక్క.. నాకి చంపేస్తా’ అంటూ డైలాగ్‌లు చెబుతుంటే కట్‌ కూడా చెప్పకుండా రాజమౌళి పడిపడి నవ్వారు. అందరూ ఆ సీన్‌ బాగా వచ్చిందని అనుకున్నారు. అయితే, కొన్ని రోజులకు ఆ సన్నివేశాలను ఎడిట్‌ చేస్తుండగా.. ‘ఈ ట్రాక్‌ బాగుంది. ఇంకా పెంచితే సినిమాకు మంచి మైలేజీ వస్తుంది’ అని ఎవరో రాజమౌళికి సలహా ఇవ్వడంతో మళ్లీ వేణు మాధవ్‌కు కబురు పెట్టారు. ‘ఈ ట్రాక్‌ బాగుంది. ఇంకా పెంచాలి ఏం చేస్తే బాగుంటుంది’ అని రాజమౌళి అడగటంతో ‘ఈ సినిమాలో ఎవరెవరు ఏ పాత్రల్లో నటిస్తున్నారో కాస్త చెప్పండి. దానిని బట్టి డెవలప్‌ చేద్దాం’ అని వేణు మాధవ్‌ చెప్పారు. అలా ఏసీపీ అరవింద్‌ (సమీర్‌), భిక్షు యాదవ్‌ (ప్రదీప్‌ రావత్‌)లను బెదిరించే సన్నివేశాలను రాసి.. అందులో నటించారు వేణు మాధవ్‌. విలన్‌ను బెదిరించే సన్నివేశాలను తీయడానికి ప్రదీప్‌ రావత్‌ హైట్‌కు సరిపడా వేణు మాధవ్‌ నిలబడేందుకు ఆయన కాళ్ల కింద పీట వేశారట రాజమౌళి. అయితే, అలా చేస్తే అంత ఎఫెక్టివ్‌గా రాదని, తాను విలన్‌తో పోలిస్తే తక్కువ హైట్‌లో ఉంటూ అతడిని బెదిరిస్తేనే బాగుంటుందని వేణు మాధవ్‌ సలహా ఇచ్చారు. అది రాజమౌళికి నచ్చడంతో దాన్ని అలాగే కొనసాగించారు. అలా ఒక సీన్‌ కాస్తా మూడు సీన్లయ్యింది. ఈ సీన్లు ఎప్పుడు చూసినా ప్రేక్షకుల హాయిగా నవ్వులు పంచుతూనే ఉంటాయి.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు