Yashoda: ‘యశోద’.. ఎవరో తెలుసా!

నీకెప్పుడైనా రెండు గుండె చప్పుళ్లు వినిపించాయా? బిడ్డను కడుపులో మోస్తున్న తల్లికి మాత్రమే అది వినిపిస్తుంది’’ అంటోంది సమంత.

Updated : 28 Oct 2022 08:34 IST

‘‘నీకెప్పుడైనా రెండు గుండె చప్పుళ్లు వినిపించాయా? బిడ్డను కడుపులో మోస్తున్న తల్లికి మాత్రమే అది వినిపిస్తుంది’’ అంటోంది సమంత (Samantha). ఆమె ప్రధాన పాత్రలో నటించిన పాన్‌ ఇండియా చిత్రం ‘యశోద’ (Yashoda). హరి - హరీష్‌ సంయుక్తంగా తెరకెక్కించారు. శివలెంక కృష్ణప్రసాద్‌ నిర్మాత. ఉన్ని ముకుందన్‌, వరలక్ష్మీ శరత్‌ కుమార్‌, రావు రమేష్‌, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా నవంబరు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే హీరో విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) గురువారం ఈ చిత్ర తెలుగు ట్రైలర్‌ను విడుదల చేశారు. ప్రచార చిత్రాన్ని తీర్చిదిద్దిన తీరును బట్టి.. సరోగసి (అద్దె గర్భం) నేపథ్యంలో జరిగే ఒక క్రైమ్‌ చుట్టూ అల్లుకున్న కథతో ఈ సినిమా సాగనున్నట్లు తెలుస్తోంది. డబ్బు అవసరం ఉన్న మహిళల్ని సరోగసి ఆశ చూపి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఓ పెద్ద భవంతిలో ఉంచుతుంది ఒక ముఠా. అక్కడికి సమంత కూడా అద్దె గర్భం మోయడానికి వస్తుంది. అయితే దీని వెనుక ఓ పెద్ద క్రైమ్‌ జరుగుతుంటుంది. మరి ఆ క్రైమ్‌ ఏంటి? దాన్ని యశోద ఎలా పసిగట్టింది? ఈ క్రమంలో ఆమెకు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? అన్నది మిగతా కథ. సమంత నటన, యాక్షన్‌ ప్రచార చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ‘‘యశోద ఎవరో తెలుసు కదా.. ఆ కృష్ణ పరమాత్మని పెంచిన తల్లి’’ అంటూ ట్రైలర్‌ చివర్లో సామ్‌ చెప్పిన డైలాగ్‌ హైలైట్‌గా నిలిచింది. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, ఛాయాగ్రహణం: ఎం.సుకుమార్‌.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని