Vishwaksen: ఆ విషయంలో ప్రియదర్శిపై నాకు అసూయ: విష్వక్‌ సేన్‌

ఓ విషయంలో ప్రియదర్శిపై తనకు అసూయ ఉందని నటుడు విష్వక్‌ సేన్‌ అన్నారు. ‘డార్లింగ్‌’ సినిమా ట్రైలర్‌ విడుదల వేడుకలో ఆయన మాట్లాడారు.

Published : 07 Jul 2024 14:30 IST

హైదరాబాద్‌: ‘మల్లేశం’, ‘బలగం’లాంటి స్ఫూర్తినింపే సినిమాల్లో నటించే అవకాశం అందరికీ రాదని, ఆ విషయంలో ప్రియదర్శిపై అసూయగా ఉందని నటుడు విష్వక్‌ సేన్‌ (Vishwaksen) పేర్కొన్నారు. ‘డార్లింగ్‌: వై దిస్‌ కొలవెరి’ (Darling) ట్రైలర్‌ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రియదర్శి (Priyadarshi)తో తన ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ ఆయన్ను కొనియాడారు.

‘‘ప్రియదర్శి సినిమాలు చూస్తున్నప్పుడు.. ‘మన వద్దకు ఇలాంటి కథలు ఎందుకు రావు’ అని ఎన్నో సార్లు అనుకున్నా. ఈ ‘డార్లింగ్‌’ విషయంలోనూ అలానే అనిపించింది. తను గెలిస్తే నేను గెలిచినట్టే. ఈ చిత్ర దర్శకుడు అశ్విన్‌ రామ్‌ ప్రతిభావంతుడు. ట్రైలర్‌ బాగుంది. గతంలో.. రోడ్డు ప్రమాదానికి గురైన నభా నటేశ్‌ ఎన్నో సినిమాల్లో అవకాశాలు కోల్పోయి ఉండొచ్చు. జరిగిన దాని గురించి బాధపడకుండా మరింత బలంగా తిరిగొచ్చింది. ఆమె ఎందరికో స్ఫూర్తి’’ అని ప్రశంసించారు. ప్రియదర్శి మాట్లాడుతూ.. ‘‘విష్వక్‌ సపోర్ట్‌ నాకెప్పుడూ ఉంటుంది. ఈ సినిమాని నాతోనే చేయాలని దర్శకుడు ఐదేళ్లు వేచి చూశారు. కథ డిమాండ్‌ మేరకే ‘డార్లింగ్‌’ అని టైటిల్‌ పెట్టాం. నేను హీరో అని తెలిసినా నభా నటేశ్‌ ముందుకొచ్చింది’’ అని నవ్వులు పూయించారు.

అదే అసలైన కమర్షియల్‌ సినిమా: నభా నటేశ్‌

‘‘రెండేళ్ల క్రితం నేను ప్రమాదానికి గురయ్యా. కొంతకాలం నటనకు దూరంగా ఉన్నా. పూర్తిగా కోలుకున్నాక.. ఇంతకుముందులాంటి సినిమాలు కాకుండా కొత్తవి ట్రై చేయాలని నిర్ణయించుకున్నా. ఆ సమయంలోనే ‘డార్లింగ్‌’ స్క్రిప్టు విన్నా. కథ నచ్చడంతో అంగీకరించా. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’లాంటి కమర్షియల్‌ సినిమా తర్వాత ‘డార్లింగ్‌’ ఎందుకు చేస్తోంది? అని కొందరు గుసగుసలాడారు. బలమైన కంటెంట్‌ ఉన్నదే అసలైన కమర్షియల్‌ సినిమా అనే విషయం ప్రేక్షకులకు తెలుసు’’ అని నభా నటేశ్‌ పేర్కొన్నారు. తన భార్యకు స్ప్లిట్‌ పర్సనాలిటీ డిజార్డర్‌ ఉందనే సంగతి పెళ్లైన తర్వాత తెలుసుకున్న హీరో పరిస్థితేంటి? హనీమూన్‌కు పారిస్‌ వెళ్లాలనే తన చిన్ననాటి కల నెరవేరిందా? వంటి ఆసక్తికర అంశాలతో రూపొందిన ఈ సినిమా ఈ నెల 19న విడుదల కానుంది.

ప్రభాస్‌ పెళ్లిపై స్పందించిన శ్యామలా దేవి.. సక్సెస్‌ రాదన్నారు వచ్చింది


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని