KGF: అలా చేస్తే ప్రపంచమంతా మనల్ని గౌరవిస్తుంది: యశ్‌

‘సినిమాల ప్రభావం జనాలపై ఎంతుందో తెలియదుగానీ పంచ్‌ డైలాగుల ప్రభావం గట్టిగా ఉంది’ అని ఓ చిత్రంలో మహేశ్‌బాబు చెప్పినట్టు పంచ్‌ డైలాగ్స్‌ మాత్రమే కాదు కొన్నింటిలోని కథానాయకుడి పాత్రా మాంచి ప్రభావం చూపుతుంది.

Published : 18 May 2022 01:46 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ‘సినిమాల ప్రభావం జనాలపై ఎంతుందో తెలియదుగానీ పంచ్‌ డైలాగుల ప్రభావం గట్టిగా ఉంది’ అని ఓ చిత్రంలో మహేశ్‌బాబు చెప్పినట్టు పంచ్‌ డైలాగ్స్‌ మాత్రమే కాదు కొన్నింటిలోని కథానాయకుడి పాత్రా మంచి ప్రభావం చూపుతుంది. ఈ జాబితాలోకే వస్తుంది ‘కేజీయఫ్‌’. ఈ సినిమాలోని సంభాషణలు, హీరో పాత్రే కాదు కథా కొన్ని కోట్లమందిని ప్రభావితం చేసింది. యశ్‌ హీరోగా దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కించిన ‘కేజీయఫ్‌ 1’, ‘కేజీయఫ్‌ 2’ ఎంతటి సంచలనం సృష్టించాయో తెలిసిన విషయమే. రాఖీభాయ్‌ పాత్రలో యశ్‌ కనిపించిన తీరు యావత్‌ సినీ ప్రపంచాన్ని విశేషంగా ఆకట్టుకుంది. క్లాస్‌, మాస్‌ తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ కట్టిపడేసింది. ‘జేమ్స్‌బాండ్‌’లా ‘రాఖీభాయ్‌’ క్యారెక్టర్‌ నిలిచింది. ఈ విషయమై యశ్‌ ఓ ఆంగ్ల మీడియాతో తన మనసులో మాట పంచుకున్నారు.

రాఖీభాయ్‌ అందరిలోనూ ఉన్నాడు

‘‘ఈ చిత్రానికి, నా పాత్రకు వచ్చిన ఆదరణ చూస్తుంటే నాకెంతో ఆనందంగా ఉంది. దీన్ని రాఖీ ఎఫెక్ట్‌ అనొచ్చేమో! పరాజయం ఎదురైనపుడు నిరుత్సాహపడకుండా మరింత గొప్పగా పనిచేసేందుకు ప్రయత్నించాలి. అలా విజయం అందుకుంటే ప్రపంచమంతా మనల్ని గౌరవిస్తుంది. నువ్వు ఏం కావాలనుకుంటున్నావో నిర్ణయించుకుని, నిన్ను నువ్వు బలంగా నమ్మాలనే విషయాన్ని రాఖీ పాత్ర వివరిస్తుంది. ఆ రాఖీ నాలో, మీలోనూ ఉన్నాడని నేను కచ్చితంగా చెప్పగలను’’.

అదే నా కాన్ఫిడెన్స్‌

‘‘నేనూ దర్శకుడు ప్రశాంత్‌నీల్ కేజీయఫ్‌ కథతో 8 ఏళ్లు ప్రయాణించాం. చిత్ర బృందం సమష్టి కృషి వల్లే ఇదంతా సాధ్యమైంది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే వ్యక్తిత్వం ప్రశాంత్‌ది. ఒకానొక సమయంలో నేను బట్టల ఇస్త్రీ నుంచి చెత్త ఊడవడం వరకూ అన్ని పనులు చేశా. అవి పూర్తయ్యాక నటించేందుకు వెళ్లేవాడ్ని. ఆ పనులు చేసేందుకు నేనెప్పుడూ ఫీల్‌ అవ్వలేదు. ‘ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేయడమే మన అంతిమ లక్ష్యం. ఆ ప్రయాణంలో ఇలాంటివి సహజం’ అనుకుని ముందుకు సాగేవాడిని. ఇలాంటి ఆలోచనా దృక్పథం ఉన్న బృందాన్ని ‘కేజీయఫ్‌’ విషయంలో చూడగలిగా. ప్రేక్షకులకు వినోదం పంచేందుకు ప్రతి ఒక్కరు ప్రాణం పెట్టి పనిచేశారు. నేనిప్పుడు ఏది చేయాలనుకున్నా కేజీయఫ్ఫే ఆత్మవిశ్వాసాన్నిస్తుంది’’ అని యశ్‌ తెలిపాడు. ఏప్రిల్‌ 14న విడుదలైన ‘కేజీయఫ్‌ 2’ ఇప్పటి వరకు రూ. 1200 కోట్లకుపైగా వసూళ్లు సాధించి, సరికొత్త రికార్డు నమోదు చేసింది. వివిధ చిత్ర పరిశ్రమకు చెందిన అగ్ర దర్శకులు, నటులు ఈ సినిమాను కొనియాడగా తాజాగా కోలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు శంకర్‌ ప్రశంసలు కురిపించారు. కథ, కథనం, ఎడిటింగ్‌, పోరాటాలు.. ఇలా అన్ని విభాగాల్లోనూ ‘కేజీయఫ్‌ 2’ అద్భుతమని పేర్కొన్నారు. కొత్త అనుభూతి పంచినందుకు యశ్‌, ప్రశాంత్‌నీల్‌కు ధన్యవాదాలు తెలిపారు.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని