KGF Chapter 2: ‘కేజీయఫ్‌ ఛాప్టర్‌ 2’ విజయంపై యశ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

తాను హీరోగా నటించిన ‘కేజీయఫ్‌ ఛాప్టర్‌ 2’ విజయంపై యశ్‌ ఆనందాన్ని వ్యక్తం చేశారు. సినిమాపై ప్రేక్షకులు, అభిమానులు కురిపించిన ప్రేమకు థ్యాంక్స్‌ అనే పదం సరిపోదన్నారు.

Published : 22 Apr 2022 01:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తాను హీరోగా నటించిన ‘కేజీయఫ్‌ ఛాప్టర్‌ 2’ విజయంపై యశ్‌ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. సినిమాపై ప్రేక్షకులు, అభిమానులు కురిపించిన ప్రేమకు కృతజ్ఞతలు తెలిపాడు. సోషల్‌ మీడియా వేదికగా ఓ వీడియోను పంచుకున్నాడు. ‘‘ఓ గ్రామానికి ఒకానొక సమయంలో తీవ్ర కరవు వచ్చింది. అప్పుడు గ్రామస్థులంతా దైవాన్ని ప్రార్థించేందుకు ఓ చోట చేరారు. ఓ అబ్బాయి మాత్రం అక్కడికి ఓ గొడుగుతో వెళ్లాడు. అక్కడున్న వారంతా అతను చేసిన పనికి నవ్వుకున్నారు. కొందరు అతడిది మూర్ఖత్వం అనుకుంటే, మరికొందరు అతివిశ్వాసం అనుకున్నారు. కానీ, ఆ రెండూ కాదు. అది విశ్వాసం/ నమ్మకం మాత్రమే. అప్పుడు ఆ అబ్బాయి ఏ నమ్మకంతో ఉన్నాడో ‘కేజీయఫ్‌’ విషయంలో నేనూ అలానే ఉన్నా. నా నమ్మకాన్ని నిలబెట్టిన మీకు నా తరఫున, చిత్ర బృందం నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు. మాపై మీరు చూపిన ఆదరాభిమానాలకు ‘థ్యాంక్స్‌’ అనే పదం సరిపోదు. అద్భుతంలాంటి సినిమాను మీ అందరికీ ఇవ్వాలనుకున్నాం. అనుకున్నట్టుగానే అందించాం. ఎంజాయ్‌ చేశారు. ఇంకా చేస్తారని ఆశిస్తున్నా’’ అని యశ్‌ వీడియోలో పేర్కొన్నాడు. సినిమాలోని ‘యువర్‌ హార్ట్‌ ఈజ్‌ మై టెరిటరీ’ అనే డైలాగ్‌ చెప్పి అలరించాడు.

దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కించిన ఈ చిత్రం ఏప్రిల్‌ 14న విడుదలై, సుమారు రూ. 645 కోట్లు వసూలు చేసింది. త్వరలోనే రూ. 1000 కోట్లు వసూలు చేసిన సినిమాల జాబితాలోకి చేరబోతుంది. విదేశాల్లోనూ ‘కేజీయఫ్‌’ హవా కొనసాగుతోంది. యశ్‌ స్టైల్‌, నటన, ప్రశాంత్‌ టేకింగ్‌ సినీ ప్రముఖులనూ ఫిదా చేశాయి. రవి బస్రూర్‌ అందించిన పాటలు, నేపథ్య సంగీతం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. గతంలో ఇదే కాంబినేషన్‌లో వచ్చిన ‘కేజీయఫ్‌ ఛాప్టర్‌ 1’ ఇదే స్థాయిలో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు