ఈ ట్వీట్ కింద వచ్చే కామెంట్లే మీకు రుజువు

అత్యాచారానికి గురై..కోలుకోలేక ప్రాణాలు కోల్పోయిన ఉత్తర్‌ప్రదేశ్ యువతి అంత్యక్రియలు జరిగిన తీరుపై బాలీవుడ్ ప్రముఖులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Published : 01 Oct 2020 01:26 IST

మహిళలను ద్వేషించే ఏ దేశమూ శాంతిగా ఉండదు

ముంబయి: అత్యాచారానికి గురై..కోలుకోలేక ప్రాణాలు కోల్పోయిన ఉత్తర్‌ప్రదేశ్ యువతి అంత్యక్రియలు జరిగిన తీరుపై బాలీవుడ్ ప్రముఖులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అర్ధరాత్రి  సమయంలో పోలీసులు అంతిమ కార్యక్రమాలు నిర్వహించడం, వాటికి తల్లిదండ్రులను అనుమతించకపోవడం వంటి ఆరోపణలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి. ఈ ఘటనపై రిచా చద్దా, జావేద్ అక్తర్, పర్హాన్ అక్తర్‌, దియా మీర్జా వంటి వారు తమ ఆవేదన, ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. 

రిచా చద్దా- మేము మహిళలను ద్వేషిస్తాం. వారు జన్మించడానికి అనుమతించం. ఒకవేళ ఎలాగోలా పుట్టినా..వారు గౌరవంగా బతకడానికి పోరాటం చేయాలి. మేం మహిళలను చిన్నపిల్లలుగా ద్వేషిస్తాం. సినిమా తారలుగా ద్వేషిస్తాం. ఈ ట్వీట్ కింద వచ్చే కామెంట్లే మీకు ఆ విషయాన్ని రుజువు చేస్తాయి. మహిళలను ద్వేషించే ఏ దేశమూ శాంతిగా ఉండదు.

జావేద్ అక్తర్‌- అనుమతి లేకుండా, కుటుంబ సభ్యులు లేకుండా యూపీలో పోలీసులు, అత్యాచారానికి గురై మరణించిన యువతి మృతదేహానికి అర్ధరాత్రి సమయంలో అంత్యక్రియలు నిర్వహించారు. దీనిపై మాకు ఒక సందేహం వేధిస్తోంది. ఈ చర్య తరవాత కూడా ఏ ధైర్యంతో బయటపడతామనేది వారి నమ్మకం. వారికి ఎవరు ఈ హామీ ఇచ్చారు?

దియా మీర్జా- మనం హాథ్రాస్‌ బాధితురాలిని మర్చిపోయాం. ఆమెను ప్రతి దశలోను ఓడించాం. ఇది మనందరి మనస్సాక్షిపై ఉంటుంది .
ఫర్హాన్ అక్తర్‌- హాథ్రాస్‌ ఘటన ఎప్పటికీ మచ్చగా ఉండిపోతుంది. అలాంటి నేరాలకు పాల్పడే వారిని తప్పించాలని ప్రయత్నించే వారి పట్ల సిగ్గుపడాలి. అంత్యక్రియలు జరిపేందుకు కూడా వారి కుమార్తె మృతదేహాన్ని అప్పగించకపోవడం అనాగరికం. మానవత్వం చచ్చిపోయింది.

రెండు వారాల క్రితం ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాథ్రాస్‌కు చెందిన దళిత యవతిపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడటంతో పాటు, ఆమెను తీవ్రంగా హింసించారు. ఆ పెనుగులాటలోనే ఆమె నాలుకకు కూడా తీవ్ర గాయమైంది. తీవ్ర అస్వస్థతకు గురైన బాధితురాలు చికిత్స పొందుతూ మంగళవారం ప్రాణాలు విడిచింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని