Oscars 2023: ఇంకా ఒక్క అడుగు దూరమే ఉంది.. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌కు స్టార్ల అభినందన

‘నాటు నాటు’ పాట ఆస్కార్‌కు నామినేట్‌ అయిన సందర్భంగా సినీ నటులు, నిర్మాతలు, దర్శకులు సోషల్‌ మీడియా వేదికగా అభినందనలు తెలిపారు.

Published : 25 Jan 2023 01:19 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆస్కార్‌ (Oscars nominations 2023) బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో ‘నాటు నాటు’ (Naatu Naatu) నామినేట్‌ అయిన సందర్భంగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌కు ప్రముఖ నటుడు చిరంజీవి (Chiranjeevi) అభినందనలు తెలిపారు. సినిమా వైభవాన్ని చాటేందుకు ఇంకా ఒక్క అడుగు దూరమే ఉందని, కోట్లాదిమంది ప్రేక్షకులు ఆకాంక్ష, ప్రార్థనలు మార్చి 12న ఫలించాలని కోరుకున్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. చిత్ర దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు ఎం. ఎం. కీరవాణి, ఆ పాట రాసిన రచయిత చంద్రబోస్‌, గాయకులు కాలభైరవ, రాహుల్‌ సిప్లిగంజ్‌, కొరియోగ్రాఫర్‌ ప్రేమ్‌రక్షిత్‌, హీరోలు రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ల ఖాతాలను ట్యాగ్‌ చేస్తూ వారితోపాటు ఈ చిత్రానికి పనిచేసిన ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలిపారు. పలువురు నటులు, పలు సినీ నిర్మాణ సంస్థలూ ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రబృందానికి కంగ్రాట్స్‌ చెబుతున్నాయి.

95వ ఆస్కార్‌ అవార్డుల బరిలో నిలిచిన చిత్రాలను అకాడమీ మంగళవారం సాయంత్రం ప్రకటించింది. అందరూ ఊహించనట్టుగానే ‘నాటు నాటు’ గీతం బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్ కేటగిరీలో నామినేట్‌ అయింది. ఈ ఏడాది మార్చి 12న విజేతలకు అవార్డులు అందిస్తారు. అకాడమీ ప్రకటనపై కీరవాణి స్పందిస్తూ.. ‘‘నా బృందానికి అభినందనలు. అందరికీ పెద్ద హగ్‌’’ అని పేర్కొంటూ తన సంతోషాన్ని వ్యక్తంచేశారు.

🤝 ‘‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలోని ‘నాటు నాటు’ పాట బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో ప్రతిష్ఠాత్మక ఆస్కార్‌కు నామినేట్‌కావడం గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. చిత్రబృందానికి నా అభినందనలు. డాక్యుమెంటరీ ఫీచర్‌ కేటగిరీలో నామినేట్‌ అయిన ‘ఆల్‌ దట్‌ బ్రెత్స్‌’, డాక్యుమెంటరీ షార్ట్‌ఫిల్మ్‌ విభాగంలో నామినేట్‌ అయిన ‘ది ఎలిఫెంట్‌ విష్పర్స్‌’ చిత్ర బృందాలకూ నా అభినందనలు’’ -నందమూరి బాలకృష్ణ

🤝 ‘‘మరో అరుదైన ఘనత సాధించినందుకు కీరవాణి గారు, చంద్రబోస్‌ గారికి కంగ్రాట్స్‌. ఈ పాట ఎప్పటికీ నా హృదయంలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటుంది’’ - ఎన్టీఆర్

🤝 ‘‘ఎంత అద్భుతమైన వార్త! ఆస్కార్‌కు ‘నాటు నాటు’ నామినేట్‌కావడం గౌరవంగా భావిస్తున్నా. మాకు, ఇండియాకు మరో గర్వకారణ క్షణమిది’’ - రామ్‌చరణ్‌

🤝 ‘‘భారతీయ సినిమా గర్వించదగ్గ క్షణాలివి. అంతర్జాతీయ వేదికపై భారతీయ సినిమా ప్రకాశిస్తోంది. ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్ర బృందానికి నా అభినందనలు’’ - రక్షిత్‌శెట్టి


‘ఆర్‌ఆర్‌ఆర్‌’ గీతం ఆస్కార్‌ గెలవాలి: పవన్‌ కల్యాణ్‌

‘‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలోని ‘నాటు నాటు’ గీతం బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ పురస్కారానికి నామినేట్‌ కావడం ఎంతో ఆనందాన్ని కలిగించింది. మన తెలుగు పాట ఆస్కార్ కోసం తుది బరిలో పోటీపడడం అందరికీ గర్వకారణం. ఇంతటి ప్రాచుర్యం పొందేలా గీతాన్ని స్వరపరచిన ఎం.ఎం. కీరవాణి గారికి హృదయపూర్వక అభినందనలు. ‘నాటు నాటు’ గీతం ఆస్కార్ అవార్డు దక్కించుకోవాలని ఆకాంక్షిస్తున్నా. ఆస్కార్‌ బరిలో మన చిత్రం నిలిచేలా చేసిన దర్శకుడు రాజమౌళి, హీరోలు రామ్‌చరణ్, ఎన్టీఆర్, నిర్మాత డి.వి.వి. దానయ్య, గీత రచయిత చంద్రబోస్, గాయకులు రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ, ఇతర సాంకేతిక బృందానికి నా అభినందనలు’’ 


అడుగు దూరంలో: మంచు విష్ణు

‘‘ఆస్కార్ కు అడుగుదూరంలో ఆర్ఆర్ఆర్ నిలిచింది. ఆర్ఆర్ఆర్ ఆస్కార్ అందుకోవాలని అందరం ప్రార్థిద్దాం. తెలుగు సినీపరిశ్రమ గర్వించే సందర్భం ఇది. భారతీయ సినిమాను ఆర్ఆర్ఆర్ శిఖరాగ్రాన నిలబెట్టింది’’


మరో కలికితురాయి: వెంకటేశ్

‘‘నాటునాటు ఆస్కార్ కు నామినేట్ కావడం అద్భుతం. సినిమా సిగలో మరో కలికితురాయి చేరింది. ఆర్ఆర్ఆర్ చిత్ర బృందానికి నా అభినందనలు’’


ఇక నాటు దెబ్బ ఆస్కార్‌కే: రవితేజ

‘‘కీరవాణిగారు స్క్రీన్‌ మీద రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌లతోపాటు ప్రపంచమంతటితో ‘నాటు నాటు’ వేయించారు. రాజమౌళి, చంద్రబోస్‌, కాలభైరవ, రాహుల్‌ సిప్లిగంజ్‌, ప్రేమ్‌రక్షిత్‌, చిత్రానికి పనిచేసిన ప్రతి ఒక్కరికీ కంగ్రాట్స్‌. ఇక నాటు దెబ్బ డైరెక్ట్‌ ఆస్కార్‌కే’’.


 సినిమా  వల్లే నా పాట ఆస్కార్‌ వరకు: ప్రేమ్ రక్షిత్ మాస్టర్

‘‘నాటునాటు పాట ఆస్కార్ కు అర్హత సాధించడం ఆనందంగా ఉంది. సినిమా వల్లే నా పాట ఆస్కార్ వరకు చేరింది. దర్శకులు రాజమౌళి, కీరవాణి, చంద్రబోస్, రాహుల్, కాలభైరవకు నా కృతజ్ఞతలు, నాటునాటును ఆదరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఆస్కార్ వేదికపై ఎన్టీఆర్, రామ్ చరణ్ నాటునాటు పాటకు డ్యాన్స్ చేయాలి’’.


జాతి యావత్తూ గర్వించదగ్గ సందర్భం.. తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌

‘‘ఆస్కార్‌కు నాటునాటు పాట అర్హత సాధించడం జాతి యావత్తూ గర్వించదగ్గ సందర్భం. తెలుగు చిత్రపరిశ్రమకు ధన్యవాదాలు’’


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు