Allari Naresh Dhanush: 20 ఇయర్స్‌ ఇన్‌ ఇండస్ట్రీ.. నరేష్‌ అలా, ధనుష్‌ ఇలా

వారిద్దరిదీ సినీ నేపథ్యమున్న కుటుంబం. ఇద్దరి తండ్రులు దర్శకులు. ఒకరి సోదరుడు నటుడు, మరొకరి సోదరుడు దర్శకనటుడు. దాంతో ఒకరు నటన వైపు ఆసక్తి చూపారు.

Published : 11 May 2022 01:58 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వారిద్దరిదీ సినీ నేపథ్యమున్న కుటుంబం. ఇద్దరి తండ్రులు దర్శకులు. ఒకరి సోదరుడు నటుడు, మరొకరి సోదరుడు దర్శక-నటుడు. దాంతో ఒకరు నటన వైపు ఆసక్తి చూపారు. ఇంట్లోనే ‘లైట్స్‌ కెమెరా యాక్షన్‌’ అని చెప్పేవారున్నా ముఖానికి రంగేసుకోవడాన్ని మరొకరు తిరస్కరించారు. కొన్నాళ్లకు తండ్రి బలవంతం మీద నటుడయ్యారు. ఫిల్మ్‌ బ్యాక్‌గ్రౌండ్‌తో ఎంట్రీ ఇచ్చినా తమ నటనతో ప్రేక్షకుల్లో తమకంటూ సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇంతకీ వారెవరో కాదు అల్లరి నరేష్‌ (Allari Naresh), ధనుష్‌ (Dhanush). దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ (దివంగత) కొడుకుగా నరేశ్‌ (అల్లరి), నటన అంటే ఇష్టంలేకపోయినా డైరెక్టర్‌ కస్తూరి రాజా తనయుడిగా ధనుష్‌ (తుల్లువదో ఇలమై) వెండితెరకు పరిచయమై 20 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా తమ సుదీర్ఘ ప్రయాణంలో భాగస్వాములైన వారందరికీ సోషల్‌ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలిపారు.

అప్పుడే 20 ఏళ్లా..!

‘‘నా సహ నటులు, దర్శకులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు, స్టాఫ్ ఎంతో సపోర్ట్‌ ఇచ్చారు. చిత్ర పరిశ్రమలోని స్నేహితులు స్ఫూర్తినిచ్చారు. అభిమానులు ఎంతో ప్రేమ కురిపించారు. నా కుటుంబం ఎప్పుడూ అండగా నిలిచి, అనుకున్నది సాధించాలనే పట్టుదల పెంచింది. నేనీ స్థాయికి చేరుకున్నందుకు కారకులైన మీ అందరికీ ధన్యవాదాలు’’ అని నరేష్‌ పేర్కొన్నారు. అప్పుడే 20 సంవత్సరాలు పూర్తయిందా అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసే ఎమోజీని పంచుకున్నారు.

నమ్మశక్యంగా లేదు..

‘‘నటుడిగా నా ప్రయాణాన్ని ప్రారంభించి అప్పుడే రెండు దశాబ్దాలు గడిచాయంటే నమ్మబుద్ధి కావడంలేదు. నా తొలి సినిమా సమయంలో ఇంత వరకూ వస్తానని ఊహించలేదు. నాతో సినిమాలు తెరకెక్కించిన దర్శకనిర్మాతలు, కలిసి నటించిన ఆర్టిస్టులు, టెక్నీషియన్లు, సోదరుడు, నా గురువు సెల్వరాఘవన్‌, నాలోని నటుడ్ని బయటకు తీసుకొచ్చిన నా తండ్రి కస్తూరి రాజా, నా యోగక్షేమాలను కాంక్షిస్తూ ప్రతిరోజూ దైవాన్ని ప్రార్థించే అమ్మ, నా అభిమానులు, ప్రేక్షకులు, మీడియా ప్రతి ఒక్కరికీ చాలా చాలా థ్యాంక్స్‌’’ అని ధనుష్‌ అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని