South Actors: తొలి అడుగు తడబడింది.. బాలీవుడ్‌లో ‘లెక్క’ తప్పింది!

తొలి ప్రయత్నంలో హిందీ ప్రేక్షకులను అలరించలేకపోయిన హీరోలెవరంటే..?

Updated : 22 Nov 2022 15:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘ఇంట గెలిచి రచ్చ గెలవడం’ అన్న చందంగా దక్షిణాదిన మంచి గుర్తింపు పొందిన చాలామంది నటులు బాలీవుడ్‌లో సత్తా చాటేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అక్కడి ప్రేక్షకులను మెప్పించేందుకు ఎంతో శ్రమిస్తారు. కొందరు తొలి ప్రయత్నంలోనే హిట్‌ అందుకుంటే.. మరికొందరికి పరాజయం ఎదురవుతుంది. తాము ఊహించిన బాక్సాఫీసు లెక్క తప్పుతుంది. ఏ హీరోకి ఏ సినిమాతో ఇలాంటి పరిస్థితి ఎదురైందంటే..? 

విజయ్‌ దేవరకొండ

‘అర్జున్‌రెడ్డి’తో స్టార్ హీరోగా మారారు విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda). ఈ చిత్రం విజయంతో ఆయన క్రేజ్‌ అమాంతం పెరిగిపోయింది. ఇదే సినిమా హిందీ (షాహిద్‌ కపూర్‌ హీరోగా)లోకి రీమేక్‌ అవడం, తన ఇతర సినిమాలు డబ్‌ అయి యూట్యూబ్‌ వేదికగా విశేషంగా అలరించడంతో విజయ్‌కు అక్కడా ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఎక్కువైంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో నటించిన ‘లైగర్‌’ను అక్కడా విడుదల చేశారు. మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ లవ్‌స్టోరీ ఉత్తరాదినే కాదు దక్షిణాదిలోనూ మెప్పించలేకపోయింది. బాలీవుడ్‌లో తన తొలి సినిమా ఈ ‘లైగర్‌’ విడుదలకు ముందే విజయ్‌ మరో పాన్‌ ఇండియా మూవీ ‘జేజీఎం’ను ప్రకటించిన సంగతి తెలిసిందే. పూరీ జగన్నాథ్‌ డైరెక్షన్‌లోనే తెరకెక్కాల్సిన ఆ సినిమా.. ‘లైగర్‌’ ప్రభావంతో ప్రారంభ దశలోనే ఆగిపోయింది.


నాగ చైతన్య

2009లో తెరంగేట్రం చేసిన అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya Akkineni) ఇన్నాళ్లకు బాలీవుడ్‌లో అడుగుపెట్టారు. సోలో హీరోగాకాకపోయినా ఓ ముఖ్య పాత్రలో ఆయన హిందీ ప్రేక్షకులకు పరిచయమయ్యారు. అదే ఆమిర్‌ఖాన్‌ హీరోగా అద్వైత్‌ చందన్‌ తెరకెక్కించిన ‘లాల్‌సింగ్‌ చడ్డా’. ఇందులోని హీరో ఫ్రెండ్‌ పాత్ర కోసం ముందుగా తమిళ నటుణ్ని ఎంపిక చేశారు. అనివార్య కారణాల వల్ల ఆయన చేయకపోవడంతో నాగచైతన్య నటించారు. కానీ, సినిమా ఊహించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. తెలుగు వారినీ అలరించలేకపోయింది. ‘దూత’ అనే వెబ్‌ సిరీస్‌తో మరోసారి అక్కడి ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యారు చైతూ.


రానా

‘లీడర్‌’తో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన రానా (Rana Daggubati) తన రెండో సినిమానే హిందీలో చేశారు. అభిషేక్‌ బచ్చన్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘దమ్‌ మారో దమ్‌’ సినిమాలో రానా కీలక పాత్ర పోషించారు. రోహన్‌ సిప్పీ డైరెక్ట్‌ చేసిన ఈ మూవీ మిశ్రమ ఫలితాన్ని అందుకొంది. ఆ తర్వాత ‘డిపార్ట్‌మెంట్‌’, ‘బేబీ’, ‘ఘాజీ’, ‘బాహుబలి’, ‘హౌజ్‌ఫుల్‌ 4’, ‘హాతీ మేరే సాథీ’ సినిమాలతో బాలీవుడ్‌ ప్రేక్షకులను అలరించారు. ‘యే జవానీ యే దివానీ’, ‘వెల్‌కమ్‌ టు న్యూయార్క్‌’ చిత్రాల్లో అతిథిగా సందడి చేశారు.


రామ్‌ చరణ్‌

‘మగధీర’తో అన్ని చిత్ర పరిశ్రమల దృష్టిని తనవైపు ఆకర్షించిన నటుడు రామ్‌చరణ్‌ (Ram Charan). తన ఇమేజ్‌ను ఇంకాస్త పెంచుకొనే దిశగా చరణ్‌ 2013లోనే ‘జంజీర్‌’ అనే హిందీ సినిమా చేశారు. అపూర్వ లఖియ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద వసూళ్లు రాబట్టలేకపోయింది. తెలుగులో ‘తుపాను’ పేరుతో విడుదలై అదే ఫలితాన్ని చవిచూసింది. కొన్నాళ్లు అక్కడి ప్రేక్షకులకు దూరమైన చరణ్‌ పాన్‌ ఇండియా చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో తన సత్తా చాటారు.


నితిన్‌

నితిన్‌ (Nithiin) హీరోగా దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ తెరకెక్కించిన హిందీ సినిమా ‘అగ్యాత్‌’. తెలుగులో ‘అడవి’ పేరుతో విడుదలైంది. 2009లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా పరాజయం ప్రభావమో ఏమోకానీ, నితిన్‌ ఇప్పటి వరకు మళ్లీ హిందీ ప్రేక్షకులను పలకరించలేదు.


సూర్య

రామ్‌గోపాల్‌ వర్మ డైరెక్షన్‌లో వచ్చిన ‘రక్త చరిత్ర 2’తో ఇటు టాలీవుడ్‌, అటు బాలీవుడ్‌లోకి నేరుగా ఎంట్రీ ఇచ్చారు సూర్య (Suriya). నటుడిగా ఆయనకు మంచి పేరొచ్చినా ఈ సినిమా కమర్షియల్‌గా విజయం సాధించలేకపోయింది. సుమారు 12 ఏళ్ల తర్వాత అతిథి పాత్రతో (సూరరై పోట్రు సినిమా రీమేక్‌లో) హిందీ ప్రేక్షకుల ముందుకు వెళ్లనున్నారు.


విక్రమ్‌

మణిరత్నం దర్శకత్వం వహించిన ‘రావణ్‌’తో బాలీవుడ్‌కు పరిచయమైన విక్రమ్‌ (Chiyaan Vikram) హిట్‌ను అందుకోలేకపోయారు. తర్వాత ‘డేవిడ్‌’, ‘పొన్నియిన్‌ సెల్వన్‌ 1’తో ఆకట్టుకున్నారు.


దుల్కర్‌ సల్మాన్‌

దుల్కర్‌ సల్మాన్‌ (Dulquer Salmaan) నటించిన తొలి హిందీ చిత్రం ‘కారవాన్‌’. ఈ అశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ‘ది జోయా ఫ్యాక్టర్‌’, ‘చుప్‌’, ‘సీతారామం’ చిత్రాలతో మంచి విజయాన్ని అందుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని