Updated : 06 Jul 2022 15:45 IST

Archana: ‘మగధీర’లో అవకాశాన్ని అలా చేజార్చుకున్నా: అర్చన

మంచి ప్రాజెక్టుతో సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభిస్తా!

నటనా ప్రాధాన్యం ఉన్న పాత్రలతో ప్రేక్షకులకు పరిచయమైన నటి అర్చన(Archana). విలక్షణమైన పాత్రలు పోషించి తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. రామదాసులో ‘సీతమ్మ’గా మెప్పించిన ఆమె, అనే చిత్రాల్లో తనదైన నటనతో అలరించారు. ప్రస్తుతం వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన అర్చన నూతన జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’(ALITHO SARADAGA) కార్యక్రమానికి భర్త జగదీశ్‌తో కలిసి వచ్చి, సినీ కెరీర్‌, పెళ్లి ఇలా అనేక విషయాలను పంచుకున్నారిలా..!

మాకు అర్చన బాగా తెలుసు..జగదీశ్‌తో పరిచయం గురించి చెప్పండి!

అర్చన: మ్యారేజ్‌ చేసుకోవాల్సిన టైం వచ్చింది. అందరిలానే నేనూ పెళ్లి అంటే భయపడ్డా. అందులోనూ నటి అంటే ఇంకొన్ని సందేహాలు. వీటన్నింటి గురించి ఆలోచిస్తూ ఒకసారి శివబాలాజీ, మధులతో చర్చించా. వాళ్లకి తెలిసిన ఈ జగదీశ్‌ గురించి చెప్పారు. వాళ్లింట్లోనే మా ఫస్ట్‌ మీట్‌ జరిగింది. ఆ మీటింగ్‌లో ఈయన అస్సలు మాట్లాడలేదు. జగదీశ్‌ మౌనంగా ఉండటం చూసి ఈ సంబంధం వర్కౌట్‌ అవదనుకున్నా. కానీ, వెళ్లేముందు నాకు ఒక హగ్‌ ఇచ్చి ‘మనం త్వరలో మళ్లీ  మీట్‌ అవ్వాలి’ అన్నారు. షాక్‌ అయ్యాను. ఆ తర్వాత ఒకరినొకరం అర్థం చేసుకున్నాక పేరెంట్స్‌తో మాట్లాడి ఒప్పించాం.

మీ తల్లిదండ్రులు, మీ నేపథ్యం ఏంటి?

అర్చన: నేను పుట్టి పెరిగిందంతా హైదరాబాదే. నా చదువు కూడా ఇక్కడే పూర్తయింది.

జగదీశ్‌: మాది చెన్నై. మా అమ్మగారి కుటుంబమంతా సినిమా నేపథ్యమే. డైరెక్టర్స్‌, ప్రొడ్యూసర్స్‌, స్టూడియో మేనేజ్‌మెంట్‌ మా కుటుంబంలో అందరూ ఉన్నారు. మా నాన్నగారు రిటైల్‌ బిజినెస్‌ మ్యాన్‌.

అర్చనలో మీకు బాగా నచ్చిందేంటి?

జగదీశ్‌: ఆమె(Archana) సింప్లిసిటి. తనొక నటిననే ఫీలింగ్‌ ఎప్పుడూ చూపించదు. చాలా సరదాగా ఉంటుంది. నిజాయతీగా ఉంటుంది. గృహిణిగా కూడా అన్ని బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తుంది.

మళ్లీ ఆమె స్క్రీన్‌ మీద కనిపించాలని మీరు కోరుకుంటున్నారా?

జగదీశ్‌: హండ్రెడ్‌ పర్సెంట్‌..ఆమె ప్రొఫెషన్‌ని నేను గౌరవిస్తా.

అర్చన: ఈ విషయంలో జగదీశ్‌ గురించి చెప్పాలి. నేను మళ్లీ స్క్రీన్‌ మీద కనిపించాలని నాకన్నా ఎక్కువగా ఆయన తహతహలాడుతున్నారు. పెళ్లికి ముందు మా అమ్మతో నా సినిమా విశేషాలను ఎలా పంచుకున్నానో, ఇప్పుడు ఈయనతో అలాగే పంచుకుంటున్నా. మంచి ప్రాజెక్టుతో సెకండ్‌ ఇన్నింగ్స్‌ స్టార్ట్‌ చేయాలని ఆయన కోరుకుంటున్నారు.

‘శ్రీ రామదాసు’ చేస్తున్నప్పుడు పెద్ద నటులతో పనిచేస్తున్నామని భయమేసిందా?

అర్చన: నాగార్జున గారు, రాఘవేంద్రరావు గారు, సుమన్‌గారు నిజంగా అప్పట్లో నాకు వీళ్ల స్థాయిని తెలుసుకునేంత వయసు కూడా లేదు. వాళ్లంతా నన్ను చాలా బాగా చూసుకునేవారు. సీత పాత్రలో నటించడానికి నేను చిన్నతనంలో నేర్చుకున్న క్లాసికల్‌ డ్యాన్స్‌ చాలా ఉపయోగపడింది.

మీకు కాఫీ అంటే  ఇష్టమట?కాఫీషాప్స్‌లోనే గడిపేవారట ఇద్దరూ?

అర్చన: నాకు(Archana) కాఫీ అంటే చాలా ఇష్టం. మా ఇంట్లో రకరకాల కాఫీ మెషీన్లు ఉన్నాయి. ఎక్కువగా కాఫీ తాగుతూ గడిపేస్తుంటా. మా మీటింగ్స్‌ అన్ని కాఫీ షాప్స్‌లోనే జరిగేవి. గంటల తరబడి కాఫీల మీద కాఫీలు తాగుతూ మాట్లాడుకునేవాళ్లం. ఇప్పుడు జగదీశ్‌కీ అలవాటు చేశా.

మీ పెళ్లి ఎలా జరిగింది?ఫస్ట్‌ వచ్చిన గెస్ట్‌ ఎవరు?(నవ్వుతూ..)

అర్చన: పెళ్లికి అందర్నీ ఆహ్వానించాం. మొట్టమొదటగా మీరు(ఆలీ), రాఘవేంద్రరావు గారు ఇచ్చిన ఆశీర్వాదం మర్చిపోలేము.

జగదీశ్‌: అప్పుడు నాకు(Archana) ఆశీర్వాదంతో పాటు హెచ్చరికలూ వచ్చాయి. రాఘవేంద్రరావుగారు అయితే ‘మా సీతమ్మను బాగా చూసుకోవాలి’ అన్నారు.

రాఘవేంద్రరావు గారితో మీ అనుబంధం ఎలా ఉంటుంది?

అర్చన: నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. ఆయన ఎప్పుడూ ‘సీత’ అని ఆప్యాయంగా పిలుస్తారు. ఆయన ఆశీర్వాదం నాకొక సెంటిమెంటు. సినిమాకు సంబంధించి చాలా విషయాలు ఆయన పక్కన కూర్చునే నేర్చుకున్నా.

‘సామాన్యుడు’ సినిమాకి ‘పోకిరి’ మూవీ ఎక్స్‌పీరియెన్స్‌ చేశారట!

అర్చన: అవును! ‘సామాన్యుడు’ సినిమాలో ఓ ఫైట్‌ సీన్‌ తీస్తుండగా ఒక ఆర్టిస్టు నాకు దగ్గరగా గన్‌ షూట్‌ చేశాడు. దాని సౌండుకి ‘పోకిరి’లో ప్రకాశ్‌రాజ్‌లా నా చెవంతా ఒకటే హోరు. కాసేపు ఏమైందో అర్థం కాలేదు. అప్పట్నుంచి చెవికి సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటున్నాను.

జగదీశ్‌: అప్పట్నుంచే ఆమెకి ఒక చెవి ఎక్కువగా పని చేస్తోందట. ఇప్పుడు కూడా పక్క గదిలో మెల్లగా మాట్లాడిన విషయం ఆమెకు వినిపించేస్తుంది.

అర్చన: సో అది ‘సామాన్యుడు’ సినిమా నాకిచ్చిన గిఫ్ట్‌.

చివరి నిమిషాలలో కోల్పోయిన పెద్ద సినిమా అవకాశాలు ఏమైనా ఉన్నాయా?

అర్చన: (ఎమోషన్‌ అవుతూ..)నేనెవరిపైనా కంప్లైంట్ చేయట్లేదు. నాకు(Archana) జరిగిన అనుభవాన్నే మీతో పంచుకుంటున్నా. ఒక సినిమాలో హీరోయిన్‌గా డేట్లు ఇచ్చాక ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’లో నేను చేసిన సైడ్‌ క్యారెక్టర్‌ కారణంగా బాపులాంటి పెద్ద డైరెక్టర్‌తో సినిమా చేసే అవకాశం కోల్పోయా.

‘మగధీర’లో అవకాశాన్ని చేజార్చుకున్నారట! అదెలా జరిగింది?

అర్చన: నాకప్పుడు సరైన అవగాహన లేక చేసిన తప్పిదమది. ఎందుకంటే చెప్పేవారు లేరు. మొదటి సినిమా అవకాశం కోల్పోయాక చిన్న క్యారెక్టర్‌లు చేయటంపై నాకు(Archana) ఆలోచనలు పెరిగాయి. పాత్రల ఎంపిక పట్ల పరిణతి లేదు. ‘మగధీర’లో సలోని పాత్రకు మొదట నన్నే సంప్రదించారు. చాలా చిన్న పాత్ర అని వదులుకున్నాను. కానీ, అది చేసుంటే ‘మర్యాదరామన్న’లో హీరోయిన్‌గా సెలెక్టయ్యేదాన్నేమో. ఇలా అనుభవాలు చాలా నేర్పించాయి. కానీ, ఎన్ని జరిగినా నేను ఇండస్ట్రీ మనిషిని. నటన అంటే నాకు ఇష్టం. ఆ ఇష్టంతోనే ఇంకా ప్రయత్నాలు చేస్తున్నా.

బాలకృష్ణకు కొరియోగ్రఫీ చేశారట?ఆ అనుభవం గురించి చెప్తారా?

అర్చన: అవును! ఆ ఎక్స్‌పీరియన్స్‌ని నేనస్సలు మర్చిపోలేను. ‘పాండురంగడు’లో రాఘవేంద్రరావు గారు పిలిచి  ‘సీతా! ఈ చిన్నసాంగ్‌కి నువ్వు కొరియోగ్రఫీ చెయ్‌’ అన్నారు. మొదట నమ్మలేకపోయా. అప్పుడు నేను(Archana) స్టెప్స్‌ వివరిస్తుంటే బాలకృష్ణగారు నేర్చుకున్న తీరు, ఆయన అంకితభావం నన్ను ఆశ్చర్యపరిచింది. ఆయనలాంటి పెద్ద హీరోకి, మంచి డ్యాన్సర్‌కి కొరియోగ్రఫీ చేయడం నిజంగా గొప్ప అనుభవం.

బాంబే మేనేజర్లను పెట్టుకుని ఇబ్బందిపడ్డారని విన్నాము..అదెలా?

అర్చన: అవును. వృత్తిపరంగా వాళ్లు నాకు చాలా అన్యాయం చేశారు. నా తెలియనితనం వల్ల నాకొచ్చిన అవకాశాలను తక్కువ రెమ్యూనరేషన్‌కి వేరేవాళ్లకి కట్టబెట్టి మోసం చేసేవారు. తర్వాత నేను డైరెక్టర్లకు ఫోన్‌ చేసి కనుక్కుంటే ‘మీ డేట్స్‌ ఖాళీ లేవని చెప్పారు’ అని జవాబు వచ్చేది. ఇవన్నీ నాకు పాఠాలు నేర్పించిన అనుభవాలే.

సుబ్బరామిరెడ్డి మీకు వార్నింగ్‌ ఇచ్చారట?(నవ్వుతూ)

జగదీశ్‌: అవును. ‘మా అమ్మాయిని(అర్చన) బాగా చూసుకుంటున్నావా ’ అంటూ ఎప్పుడూ హెచ్చరిస్తూంటారు(నవ్వుతూ..)

మీ ఇద్దరిలో పైచేయి ఎవరిది? ఎక్కువ ఎవరు కాంప్రమైజ్‌ అవుతూ ఉంటారు?

అర్చన: నాదే (Archana)అప్పర్‌ హ్యాండ్‌. ప్రతీ విషయంలో నేనే నిర్ణయం తీసుకుంటా(నవ్వుతూ..)

జగదీశ్‌: ఎక్కువ కాంప్రమైజ్‌ అయ్యేది నేనే. ఎందుకంటే గొడవపడే టైం ఉండదు నాకు. అందుకే ‘నీ మాటే నా మాట బంగారం’ అనేస్తా.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts