Indraja: నాకు అమ్మాయి పుట్టేదాకా.. పెళ్లి విషయం ఎవరికీ తెలియదు: ఇంద్రజ

నటనలో పరిపక్వత..పాత్రలపై మమకారం..వెండితెర, బుల్లితెరలో తనకంటూ ప్రత్యేకతను చాటుతున్న సీనియర్‌ సినీ నటి ఇంద్రజ. సినిమాల్లో కృష్ణ, మోహన్‌లాల్‌, బాలయ్యలతోనే కాదు..ఆలీతో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. యమలీలతో తెలుగులో అరంగేట్రం చేసి రెండేళ్లలో 30 సినిమాలకు పైగా నటించారు.

Updated : 17 Aug 2022 12:38 IST

నటనలో పరిపక్వత.. పాత్రలపై మమకారం.. వెండితెర, బుల్లితెరలో తనకంటూ ప్రత్యేకతను చాటుతున్న సీనియర్‌ నటి ఇంద్రజ (Indraja). సినిమాల్లో కృష్ణ, మోహన్‌లాల్‌, బాలయ్యలతోనే కాదు.. ఆలీతో కూడా నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. ‘యమలీల’తో తెలుగులో అరంగేట్రం చేసి రెండేళ్లలో 30 సినిమాలకు పైగా నటించారు. 90 సినిమాల్లో నట ప్రస్థానం కొనసాగించారు. తెలుగు, తమిళంలో బుల్లితెరపై న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. పలు సీరియళ్లలోనూ నటిస్తున్న ఇంద్రజ ఈటీవీ చెప్పాలని ఉంది కార్యక్రమానికి అతిథిగా విచ్చేశారు. తన నట జీవితంలోని ముఖ్యాంశాలు, ఇతర విశేషాలను పంచుకున్నారు.

మీకు సంగీతం, నృత్యంపై అభిరుచి అమ్మతోనే వచ్చిందా..?

ఇంద్రజ: అది రక్తంలోనే ఉంటుంది కదా! అందుకే వచ్చి ఉండొచ్చు. అమ్మ దగ్గర నేర్చుకోవడానికి వచ్చే విద్యార్థులతో నాకు కూడా పాటలు అలవాటయ్యాయి. భరతనాట్యం .. తంగం మేడమ్‌ వద్ద, కూచిపూడి.. ఎమ్‌వీఎన్‌ మూర్తి దగ్గర నేర్చుకున్నా.

సినిమా అవకాశాలెలా వచ్చాయి..?

ఇంద్రజ: హీరోయిన్‌గా నా మొదటి సినిమా ‘జంతర్‌మంతర్‌’. ఈ సినిమా షూటింగ్‌ జరుగుతుండగానే ఎస్వీ కృష్ణారెడ్డిగారు సెట్లోకి వచ్చారు. ఆయనకు ఎవరు చెప్పారో తెలియదు. ‘యమలీల’కు ఎంపిక చేశారు. నేనైతే ఎవరినీ కలుసుకోలేదు.

హీరోయిన్‌గా పరిచయమైన రెండేళ్లలోనే 30కి పైగా సినిమాలు చేశారు. అది మీకు ఎలా సాధ్యపడింది..?

ఇంద్రజ: ‘యమలీల’ బ్లాక్‌బ్లస్టర్‌ కావడంతో ఎక్కువ అవకాశాలు వచ్చాయి. సక్సెస్‌లు ఎక్కువగా ఉండటంతో లక్కీ హీరోయిన్‌గా చాలా సినిమాల్లో అవకాశాలు ఇచ్చారు. 

ఆలీ నుంచి కృష్ణ, బాలయ్య, మమ్ముట్టి, మోహన్‌లాల్‌లాంటి హీరోలతో చేశారు. ఆ అనుభవం చెప్పండి..?

ఇంద్రజ: ప్రతి ఒక్కరిదీ ఒక్కో శైలి, ప్రత్యేకత. సెట్లో వాళ్లు ఉండే విధానం, అందరినీ కలుపుకొని పోయే తీరు నన్ను ఆకట్టుకుంది. వాళ్ల నుంచి చాలా నేర్చుకున్నా. రాజేంద్రప్రసాద్‌ ఎలా నటించాలో చెప్పేవారు. ఆయనకు అన్ని క్రాఫ్ట్‌లు బాగా తెలుసు. ఆయనను దర్శకత్వం చేయాలని కోరా. ఎప్పటికైనా చేస్తారనే నమ్మకం ఉంది. ఆలీ సినిమాల్లో ఉన్నట్టు బయట ఉండరు. చాలా ప్రశాంతంగా ఉంటారు.

తెలుగులో చేస్తున్నపుడు ఇతర భాషల్లో అవకాశాలు వచ్చాయా..?

ఇంద్రజ: తమిళంలో కొన్ని అవకాశాలు వచ్చాయి. మూడు, నాలుగు సినిమాలు చేశా. 14 ఏళ్లకే సినిమాల్లోకి వచ్చా. ‘18 ఏళ్లు వచ్చేసరికి పొట్టి దుస్తులు వేసుకోకూడదు. అందరూ నన్నే చూస్తున్నార’ని అనుకునేదాన్ని. ఆ తర్వాత గ్లామర్‌ పాత్రలకు కాకుండా నటనకు అవకాశం ఉండే పాత్రల వైపు వెళ్లా. నిండుగా దుస్తులు వేసుకునేలా ఉండే పాత్రలు చేయాలనుకున్నా. అప్పుడే సినిమాలు తగ్గిపోయాయి. అదే సమయంలో మలయాళంలో అవకాశం వచ్చింది. సంప్రదాయంగా ఉండేలా పాత్రలు లభించాయి. మమ్ముట్టి, మోహన్‌లాల్‌, సురేష్‌గోపి, జయరాం లాంటి హీరోలతో సినిమాలు చేశా.

‘సొగసు చూడ తరమా’ గుణశేఖర్‌ తీశారు. చక్కని కథా కథనం అది. నరేశ్‌తో మీ నటనా అనుభవం ఎలా ఉంది..?

ఇంద్రజ: గుణశేఖర్‌కు చాలా థ్యాంక్స్‌ చెప్పాలి. ఈ క్యారెక్టర్‌ నేను చేయగలనని ఎందుకు అనిపించిందో ఇప్పటికీ అడుగుతూనే ఉంటా. ఒక ఆర్టిస్టుకు ఇలాంటి పాత్ర చేసినప్పుడే సంతృప్తి లభిస్తుంది. నా ఫేవరేట్‌ మూవీ ఇది. ఫొటోగ్రఫీ చాలా అద్భుతం. నరేశ్‌కు సినిమాలపై చాలా నాలెడ్జ్‌ ఉంది. తెలుగు, తమిళం, ఇంగ్లిష్‌ సినిమాలపై బాగా పట్టు ఉంది.

స్పెషల్‌ సాంగ్స్‌ చేయడంతో ప్రధాన హీరోయిన్‌గా అవకాశం రాలేదంటారా..?

ఇంద్రజ: లేదండి. అవి రిక్వెస్టుపైనే ఎక్కువగా చేస్తాం. పెద్ద బ్యానర్‌ అడిగినప్పుడు చేయకపోతే బాగుండదు. అలా ఇష్టం లేక కొన్నిసార్లు.. ఇష్టం ఉండి కొన్నిసార్లు చేయాల్సి వచ్చింది. ఏదీ మాట్లాడినా లేనిపోని వివాదాలు అవుతాయి. అందుకే అచితూచి మాట్లాడాల్సి వచ్చింది. లేకపోతే ఆటాడుకుంటారు.

మీలోని నటిని బయటకు తీసుకొచ్చిన డైరెక్టర్‌ ఎవరు..?

ఇంద్రజ: ప్రతి మూవీ చాలా ముఖ్యమైనదే. ఎలాంటి పాత్రయినా నా నీడ ఉంటుంది. ఇంకా వందశాతం నటిగా నిరూపించుకోవడానికి ఎదురు చూస్తున్నా. ఎలాంటి ఛాలెంజింగ్‌ పాత్రైనా చేయడానికి సిద్ధమే. డాక్టర్‌, పోలీస్‌, సైకాలజిస్టుగా కొన్ని సినిమాల్లో పని చేస్తున్నా!

సినీ ఇండస్ట్రీలో స్త్రీ-పురుష భేదం ఉందా?

ఇంద్రజ: సినీ ఇండస్ట్రీ ఒక్కటే కాదు.. అన్నింటిలోనూ తారతమ్యం ఉంది. సమానత్వం 40శాతం కూడా లేదు. ఇది నిజం. పెళ్లి, పిల్లలు ఇలా మూడేళ్లపాటు కేటాయించాల్సిందే. ఈ పరిశ్రమ నా కన్నతల్లి లాంటిది. ఎవరేమన్నా అంటే ఊరుకోను.

మీరు వ్యాపారవేత్తను వివాహమాడారు కదా..? ప్రేమ వివాహమా..?

ఇంద్రజ: ఆయన పూర్తిస్థాయి వ్యాపారవేత్త కాదు. మన ఇండస్ట్రీకి సంబంధం ఉన్న వ్యక్తే.  తమిళంలో కొన్ని సీరియళ్లు చేశారు. యాడ్‌ ఫిల్మ్స్‌ కొన్ని చేశారు. రచయిత కూడా. మామయ్య బిజినెస్‌ చూసుకుంటూ ఈ పనులు చేసుకుంటున్నారు. మాది ప్రేమ వివాహం. రిజిస్టర్‌ మ్యారేజీ చేసుకున్నాం. 13 మందితో కలిసి హోటల్‌కు వెళ్లి భోజనం చేసి ఇంటికి వెళ్లిపోయాం. రిసెప్షన్‌ చేయలేదు. హానీమూన్‌కూ పోలేదు. అమ్మాయి పుట్టిన తర్వాత మీ అమ్మాయా..? మీకు పెళ్లయ్యిందా..?అని చాలా మంది అడిగారు. మా అమ్మాయి వయసు ఇప్పుడు 14 ఏళ్లు. పెళ్లి తర్వాత నటనకు ఆయన అభ్యంతరం చెప్పలేదు. నాకే సినిమాలు వద్దనిపించింది. నన్ను నేను నిరూపించుకోవడానికి ఆ మార్గాన్ని ఎంచుకున్నా.

పెళ్లికి ముందు మీ ఆయనకు రెండు షరతులు పెట్టారట...?

ఇంద్రజ: అమ్మా, నాన్న నాతోనే ఉంటారు. వాళ్లను వదిలేసి రాలేను. వాళ్ల బాగోగులు నేనే చూసుకుంటా. అమ్మ ఆరోగ్యం సరిగా లేనప్పుడు నాన్న వంట కూడా చేసేవారు. మమ్మల్ని బాగా పెంచారు. చెల్లెళ్లకు పెళ్లి చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పా. ఇవి షరతులు కాదు.. ప్రేమకు అంగీకారం చెప్పడంలోనే ఉంటాయి.

బాలకృష్ణతో పెద్దన్నయ్య, లయన్‌ సినిమాలో నటించారు..? మిమ్మల్ని చూడగానే ఏమన్నారు..?

ఇంద్రజ: ఆయనది చిన్న పిల్లల మనస్తత్వం. ఇదే విషయం ఎవరైనా చెబుతారు. మనసులో ఒకటి, నాలుకపై మరో మాట ఉండదు. ప్రేమగా చూసుకుంటారు. ఆయన ఫాలోయింగ్‌ అద్భుతం. చాలా మంచి వ్యక్తి. 

సౌందర్యతో కలిసి ఎన్ని సినిమాలు చేశారు..?

ఇంద్రజ: ఇద్దరం.. మూడు, నాలుగు సినిమాలు చేశాం. మేకప్‌ లేకపోతేనే సౌందర్య అందంగా ఉంటారు. చాలా సింపుల్‌గా ఉండేవారు. 

ఒక అగ్రహీరో చెప్పడంతో చాలా సినిమాలు రాలేదని విన్నాం..నిజమేనా..?

ఇంద్రజ: అలాంటిదేం లేదు. దర్శకుడు చెప్పిన హీరోయిన్‌ కంటే హీరో సూచించిన హీరోయిన్‌ ఆ పాత్రకు బాగుండొచ్చు కదా.. అలా అనుకొని వెళ్లిపోవడమే..!

ఇప్పటికీ మీ అందం అలాగే ఉండటానికి కారణం?

ఇంద్రజ: మీ చేతి నుంచి రూ.కోటి ప్రాజెక్టు పోయినా మన మంచికే అనే భావనతో ఉండండి. అది మిమ్మల్ని ఇంకో ఎత్తుకు తీసుకెళ్తుంది. నా నుంచి పోయింది కదా.. ‘వాడు తీశాడు.. వీడు తీశాడ’ని ఆలోచిస్తే ఆ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దాంతోనే శరీరంలో మార్పులు వస్తాయి. చాలా వీక్‌ అవుతాం.

షూటింగ్‌ సమయాల్లో ఎవరైనా పిల్లలు చదువుకోకుండా వస్తే వాళ్లను పాఠశాలకు పంపించడానికి ప్రయత్నిస్తారట..?

ఇంద్రజ: అవన్నీ నిజంగా నా గొప్పేమీ కాదు. బాగా చదువుకోవాలని అనుకున్నా. చదువు విలువ బాగా తెలుసు. కొంతమంది పిల్లలు.. సహకారం లేక ఆగిపోతున్నారు. వాళ్లకు నాకు చేతనైనంత చేస్తున్నా. దేవుడు నడిపిస్తున్నాడు..నేను నడుస్తున్నా..!

అమ్మదొంగ సినిమా తర్వాత సినీ జీవితం చాలా మలుపు తిరిగింది.. ఆ విశేషాలు చెప్పండి..?

ఇంద్రజ: నా కెరీర్‌లో చాలా ముఖ్యమైన సినిమా అది. సాగర్‌ గారు ఆ మూవీ ఆఫర్‌ చేసిన తర్వాత పెద్ద పెద్ద సినిమాలు వచ్చాయి. నాకు చాలా విషయాలు ఆ సినిమాతోనే తెలిశాయి. కెమెరామెన్‌ శ్రీనివాసరెడ్డి సహకారం మరచిపోలేను. కృష్ణగారితో ఆ అనుభవం ఎంతో నేర్పింది. ఏమీ పట్టించుకోరు. డైలాగ్‌లు ఒకసారి చెబితే చాలు. చెప్పేస్తారు.

కొత్తగా వచ్చే నటీనటులకు మీరిచ్చే సలహాలు..? అమ్మాయిలు తీసుకోవాల్సిన జాగ్రత్తలేవీ..?

ఇంద్రజ: మనం చెప్పేంత స్థాయి కాదు. ఇప్పటి అమ్మాయిలు చాలా ఇండిపెండెంట్‌గా కెరీర్‌ను తీర్చిదిద్దుకుంటున్నారు.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని