
Maheswari: శ్రీదేవి ఫ్యామిలీ నుంచి వచ్చానని పొగరనుకునేవారు: మహేశ్వరి
ఇంటర్నెట్ డెస్క్: ‘‘స్వతహాగా నేను చాలా సైలెంట్. దాన్ని కొందరు మరోలా అర్థం చేసుకున్నారు. ‘శ్రీదేవి ఫ్యామిలీ నుంచి వచ్చింది కదా అందుకే పొగరు’ అని నా ముందే అనేవారు’’ అని గత జ్ఞాపకాల్ని గుర్తు చేసుకున్నారు నటి మహేశ్వరి. ఆలీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన ఆమె పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. ప్రముఖ నటి, దివంగత శ్రీదేవితో తనుకున్న సంబంధం గురించి వివరించారు. శ్రీదేవి తనుకు పిన్ని అవుతారని, కానీ అక్క అని పిలిచేదాన్నని తెలిపారు. ఆమె లేరనే విషయాన్ని ఇప్పటికీ నమ్మబుద్ధికావడంలేదన్నారు. నటిగా.. దర్శకుడు భారతీరాజా అవకాశం ఇచ్చారని తెలిపారు. తాను నటించిన ‘గులాబి’ చిత్రం అంత పెద్ద హిట్ అవుతుందని ఊహించలేదని పేర్కొన్నారు. సినిమా సెట్స్‌లో.. నటుడు నవీన్ ఎలా ఉండేవారో చెప్పారు. ‘మేఘాలలో తేలిపొమ్మనది’ పాట చిత్రీకరణలో ప్రమాదం చోటుచేసుకొందని తెలిపారు. ‘ఇప్పుడు ఏం చేస్తున్నావ్?’ ఆలీ ప్రశ్నించగా ‘నిజం చెప్పాలా’ అంటూ మహేశ్వరి నవ్వులు పంచారు.
పదహారేళ్లకే మహేశ్వరి నటిగా మారారు. భారతీరాజా దర్శకత్వంలో తెరకెక్కిన ‘కరుతమ్మ’ చిత్రంతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆమె ‘అమ్మాయి కాపురం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ‘గులాబి’, ‘దెయ్యం’, ‘పెళ్లి’, ‘జాబిలమ్మ పెళ్లి’, ‘మా బాలాజీ’, ‘మా అన్నయ్య’, ‘నీకోసం’ తదితర చిత్రాలతో విశేషంగా అలరించారు.