Published : 27 Oct 2021 12:43 IST

ఝుమ్మంది.. ‘మంజు’నాదం

నటి మంజుభార్గవి


ఇంటర్నెట్‌ డెస్క్‌: కవ్వించే క్లబ్‌ డ్యాన్సుల నుంచి సంప్రదాయ నృత్యాల వరకు అన్నీ చేసి, అందరి మెప్పూ పొందారు మంజు భార్గవి. అయినా  ఆర్టిస్టుగా చెప్పుకోదగ్గ పాత్రలేవీ చేయలేకపోయారు. ఆమె కళ్లల్లో, కాళ్లల్లో.. సంగీతానికి అనుగుణంగా కదలికలు ఉంటాయి. ఆమె నాట్యంలో నయగార సోయగాలుంటాయి. నృత్యంలోనే కాదు.. నటనలో కూడా మేటి అని శంకరాభరణం ద్వారా ఆమె నిరూపించుకున్నారు. ప్రస్తుతం కూచిపూడి కళాక్షేత్రాన్ని బెంగళూరులో స్థాపించి, నిర్వహిస్తున్నారు మంజు భార్గవి.

స్వగతం..
చిత్రసీమకు వస్తానని కానీ.. మీ ఆదరణ పొందుతానని కానీ.. నేనెప్పుడూ ఊహించలేదు. చిత్రసీమకు రావడానికి ప్రధానకారణం మా అమ్మగారు. ఆమె ముందు ఆర్టిస్టు కావాలని చాలా కలలు కన్నారు. కానీ అనేక కారణాల వల్ల ఆమె ముందుకు రాలేకపోయారు. రాబోయే తరంలో అయినా తన వారసత్వాన్ని ప్రవేశపెట్టాలని.. నాకు ఇష్టం లేకపోయినా నన్ను ఎంతో ప్రోత్సహించి ఈ రంగంలోకి ప్రవేశపెట్టారు.

మా మాస్టర్‌ వల్లే ఈ స్థాయికి..
నేను కూచిపూడి డ్యాన్స్‌ నేర్చుకుంది సినిమా రంగానికి ఉపయోగపడుతుందని కాదు. నాకు డ్యాన్స్‌ అంటే చాలా ఇష్టం. నా ఐదో యేటనే మా స్కూల్‌ ఫంక్షన్‌లో మొదటి ప్రదర్శన ఇచ్చాను. దాని తర్వాత మా అమ్మను చాలా పోరు పెడితే.. చిన్నసత్యం గారి దగ్గర నేర్చుకునేందుకు ఆయన తరగతిలో నన్ను చేర్చారు. ఆ తరువాత వారి దగ్గరే నేను ఇంత వరకూ నేర్చుకొన్నాను. నాకింత పేరొచ్చిందంటే మా మాస్టర్‌ గారి వల్లే.

ఆ పాత్రకు వారం పట్టింది..
దొరలు-దొంగలు చిత్రంలో.. క్లాసికల్‌ మిక్స్‌ చేసిన వెస్ర్టన్‌ డ్యాన్స్‌ కూడా చేశాను. వెస్ర్టన్‌ డ్యాన్స్‌ అంటే తీసేస్తాం.. దానికేదో బేస్, ట్రడిషన్‌ లేనట్టు.. కానీ దానిలోనూ వైవిధ్యాలు ఉన్నాయి. వాటికంటూ ఓ ట్రెండ్‌ ఉంది. కానీ పసమర్తి కృష్ణమూర్తిగారు క్లాసిక్‌తో పాటు వెస్ర్టన్‌ రెండు కలిపి మిక్స్‌ చేశారు. దాన్ని అభ్యాసం చేసి షూట్‌ చేసేందుకు నాకు వారం పట్టింది. నేను చాలా కష్టపడ్డాను.. ఆ నృత్యం చేసేందుకు. అలాగే ఆ పాటని చాలా అద్భుతంగా చిత్రీకరించారు.

దానిని సవాలుగా స్వీకరించా..
యమగోలలో నేను చేసింది క్లాసికల్‌ డ్యాన్స్‌ అయినప్పటికీ నాతో చేసిన మిగతా ఇద్దరు కూడా.. మంచి డ్యాన్సర్స్‌. వాళ్లకంటే బాగా చేయాలని సవాలుగా నేను ఆ పాత్ర పోషించాను.

నాకు ఇంకా ఎందుకు గుర్తింపు రాలేదన్నారాయన..
‘ప్రెసిడెంట్‌ పేరమ్మ’ అనే సినిమాలో నేనో క్లాసికల్‌ జావణి ప్రదర్శించాను. దానికి దర్శకత్వం వహించింది కె.విశ్వనాథ్‌ గారు. నా డ్యాన్స్‌, యాక్టింగ్‌ చూసి ఇంత మంచి ఆర్టిస్ట్‌, ఇంత మంచి డ్యాన్సర్‌ని ఎందుకు ఇండస్ట్రీ గుర్తించలేదు. లేకపోతే ఈమెకే సినిమాలంటే ఇష్టం లేదా అని ప్రశ్నవేశారాయన. దానికి వెంటనే నాకో మేకప్‌ టచ్‌ వేశారు. అదే శంకరాభరణం. విశ్వనాథ్‌ గారు నన్ను శంకరాభరణానికి బుక్‌ చేసిన తరువాత నామైండ్‌లో పెద్ద ఛాలెంజ్‌ నిలిచిపోయింది. అదేమిటంటే.. నేనో పెద్ద డ్యాన్సర్‌ అవుతాననే నమ్మకం మా అమ్మగారికి ఉంది. కానీ ఆర్టిస్ట్‌ అవుతాననే నమ్మకం మాత్రం ఆవిడకి లేదు. అలాగే మా గురువు గారికి ఎంతో మంది శిష్యులు ఉన్నా.. నేను డ్యాన్సర్‌ అవుతా అనుకున్నారే కానీ పేరున్న ఆర్టిస్టుని అవుతానని ఆయన ఎప్పుడూ అనుకోలేదు. ఆ విషయంలో ఆయన ఎప్పుడు నన్ను ప్రోత్సహించలేదు కూడా. నేను చేస్తున్న ప్రతి షాట్‌కి వీళ్లిద్దరూ కెమెరా ముందు నిల్చునేవారు. అది.. డూ ఆర్‌ డై రోల్‌. ప్రతి షాట్‌ ఇచ్చేటప్పుడు.. నా పాత్ర, హావభావాలు..  ఇలా నా బెస్ట్‌ ఇవ్వడానికి ప్రయత్నిస్తూ వచ్చా. ఆ క్రెడిట్‌ అంతా దర్శకులు విశ్వనాథ్‌గారికి, అలాగే మా డ్యాన్స్‌ గురువుగారు శేషుగారికి.

కూచిపూడిని ప్రజల్లోకి లోతుగా తీసుకెళ్తా..
 శంకరాభరణం చిత్రం తరువాత నాకు వేరే ఆఫర్స్‌ రాక కాదు.. ఇంత ఇమేజ్‌ ప్రజల హృదయాల్లో క్రియేట్‌ చేసిన తరువాత పోషించే పాత్ర అంతకన్నా గొప్పగా ఉండాలని అనుకున్నాను. కానీ ఇంతమంచి పాత్ర పోషించాక మళ్లీ ఇంత పెద్ద పాత్ర వస్తుందని నాకు నమ్మకం లేదు. సో నా ఫస్ట్‌ లవ్‌ డ్యాన్స్‌ కాబట్టి.. సో కూచిపూడి నృత్యాన్ని ముందుకు తీసుకురావాలి. మన దేశంలో కూచిపూడి సంస్కృతికి  లోతు ఉందని.. సో డ్యాన్స్‌ మీద డ్యాన్స్‌ ప్రోగ్సామ్స్‌ మీద దృష్టి పెట్టాను.

అదే అసలైన గుర్తింపు..
‘కోడళ్లొస్తున్నారు.. జాగ్రత్త’ అనే చిత్రంలో నా పాత్ర ఒక డ్యాన్సర్‌ కోడలు. ఒక క్లాసికల్‌ డ్యాన్స్‌ చేయాల్సి వచ్చింది. దానికి వేటూరి సుందరరామ్మూర్తి స్ర్కిప్ట్‌ రాశారు. అలా రాసేముందు నాకు ఫోన్‌ చేసి.. అమ్మా ఈ పాటను నన్ను రాయమన్నారు. ఇందులో మీ పేరు ఉపయోగించబోతున్నానని చెప్పారు. ఒక ఆర్టిస్టుకి గుర్తింపు వచ్చాక..సన్మానాలు, సన్మాన పత్రాలు సహజమే.. కానీ కొంత మంది ఆ ఆర్టిస్టుని గుర్తించి.. ఆ పాటలో తనని గుర్తించి రాశారంటే.. అది చాలా గొప్ప పురస్కారం అనిపిస్తుంది. ఆ విషయంలో నేను చాలా హ్యాపీ.

ఈతరం కోసమే యమలీల చేశాను..
 చాలాకాలం తరువాత ‘యమలీల’ అనే సినిమాలో నేను నటించాను. చాలామంది అడిగారు. శంకరాభరణం లాంటి పాత్ర చేశాక ఇన్నాళ్లకు ఈ పాత్ర ఎందుకు చేశారనీ? ఇది శంకరాభరణం లాంటి గొప్ప పాత్ర కాకపోవచ్చు. నేను ఒప్పుకుంటాను. ఈ పాత్ర చేయడానికి కారణం.. ఈతరం..ఈ జనరేషన్‌కి ఈ పాత్ర ఒక మెసేజ్‌గా ఉంటుందనే చేశాను. ఒక తల్లి బిడ్డకు ఈ బంధం, బాంధవ్యం.. ఇవన్నీ నామమాత్రం అయిపోతున్నాయని అనిపించింది. ఈతరుణంలో చేయాలనిపించింది. నేనెంత వరకూ న్యాయం చేశానో తెలియదు.. ఈ ఐడియాతోనే ఈ చిత్రం చేశాను.

భవిష్యత్తులో నేనే తీస్తానేమో..
 శంకరాభరణం లాంటి పాత్రను నేను మళ్లీ తెరపై పోషించాలని ప్రజలు ఆశిస్తున్నారు. కానీ ఇలాంటి పాత్రని మళ్లీ నిర్మాతగా వ్యవహరించి చేయాలి. బహుశా భవిష్యత్తులో ఆ పాత్ర పోషిస్తానేమో! (నవ్వుతూ) ఇలా మిమల్ని కలుసుకొని.. నా జ్ఞాపకాలు.. నా మనసులో మాటను పంచుకోవడం సంతోషంగా ఉంది. త్వరలో మిమల్ని మళ్లీ ఇలా కలుస్తానని ఆశిస్తున్నాను.

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని