Actress Meena: ఊపిరితిత్తుల సమస్యతో నటి మీనా భర్త మృతి

ప్రముఖ నటి మీనా భర్త విద్యాసాగర్‌ (48) మంగళవారం రాత్రి చెన్నైలో మరణించారు.

Updated : 29 Jun 2022 10:35 IST

చెన్నై: ప్రముఖ నటి మీనా(Meena) భర్త విద్యాసాగర్‌ (48) (Vidya Sagar) మంగళవారం రాత్రి చెన్నైలో మరణించారు. ఆయనకు తీవ్రమైన శ్వాసకోశ సమస్య ఉందని, గత కొన్ని నెలలుగా చికిత్స పొందుతున్నారని తెలుస్తోంది. జనవరిలో మీనా కుటుంబం మొత్తం కొవిడ్‌ (Covid-19) బారిన పడింది. ఆ తర్వాత నుంచి ఆయన ఆరోగ్య సమస్య మరింత తీవ్రమైంది. గత కొన్నిరోజులుగా విద్యాసాగర్‌ ఆరోగ్యం మరింత క్షీణించడంతో కుటుంబసభ్యులు ఆయన్ని చికిత్స నిమిత్తం చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ఈ క్రమంలోనే ఆయన ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. విద్యాసాగర్‌ మరణంతో మీనా కుటుంబంలో విషాదం నెలకొంది. భర్త మృతితో ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. మరోవైపు, విద్యాసాగర్‌ మరణవార్త తెలుసుకున్న నటుడు శరత్‌కుమార్‌, నటి మంచు లక్ష్మిలతో పాటు పలువురు సినీతారలు, నెటిజన్లు ప్రగాఢ సానుభూతి తెలిపారు. విద్యాసాగర్‌ ఆకస్మిక మరణం తమను ఎంతో కలచి వేస్తోందని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

మీనా- విద్యాసాగర్‌లది పెద్దలు కుదిర్చిన వివాహం. దక్షిణాదికి చెందిన ఎంతోమంది స్టార్‌ హీరోలతో పని చేసిన మీనా.. కెరీర్‌లో రాణిస్తోన్న తరుణంలోనే బెంగళూరుకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ విద్యాసాగర్‌తో ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టారు. జులై 12, 2009లో వీరి వివాహం జరిగింది. మీనా దంపతులకు నైనికా అనే కుమార్తె ఉంది.

 



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని