Raveena Tandon: రేప్‌ సన్నివేశాల్లోనూ అసభ్యతకు నేను చోటివ్వలేదు: రవీనా

‘రథ సారథి’, ‘ఆకాశ వీధిలో’ తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన నటి రవీనా టాండన్‌. బాలీవుడ్‌లో తనకు ఎదురైన విమర్శల గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.

Published : 07 Feb 2023 01:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: స్విమ్మింగ్‌ కాస్ట్యూమ్స్‌ ధరించేందుకు, ముద్దు సన్నివేశాల్లో నటించేందుకు నో చెప్పినందుకు తనపై అహంకారి అనే ముద్ర పడిందని ప్రముఖ నటి రవీనా టాండన్‌ (Raveena Tandon) అన్నారు. ఆంగ్ల మీడియాతో ఆమె ప్రత్యేకంగా మాట్లాడుతూ.. హిందీ చిత్ర పరిశ్రమలో విమర్శలు ఎదుర్కొన్నానని తెలిపారు. కెరీర్‌ తొలినాళ్లలో జరిగిన సంఘటనల గురించి వివరించారు. ‘‘కొన్ని విషయాల్లో నేను అసౌకర్యంగా ఉండేదాన్ని. డ్యాన్స్‌ విషయానికొస్తే.. అన్‌కంఫర్ట్‌గా ఫీలైన స్టెప్పును నేను చేయనని కచ్చితంగా చెప్పేదాన్ని. స్విమ్మింగ్‌ కాస్ట్యూమ్స్‌ ధరించాలని నేనెప్పుడూ అనుకోలేదు. ముద్దు సన్నివేశాల్లో నటించలేదు. అందుకు నాపై అహంకారి అనే ముద్ర వేశారు. రెండు రేప్‌ సన్నివేశాల్లో నటించినప్పటికీ ఎలాంటి అసభ్యతకు తావివ్వకుండా జాగ్రత్త తీసుకున్నా. డ్రెస్సుపై ఒక్క చిరుగూ లేకుండా రేప్‌ సీన్స్‌లో నటించిన నటిని నేనొక్కదాన్నే. అంతలా నా కాస్ట్యూమ్స్‌ చెక్కు చెదరకుండా ఉండేవి’’ అని ఆమె చెప్పారు. ఒకానొక సమయంలో బాడీ షేమింగ్‌ ట్రోల్స్‌ ఎదుర్కొన్నానని తెలిపారు.

వదులుకున్న సినిమా అవకాశాల గురించి చెబుతూ.. ‘‘డర్‌’ (1993) అవకాశం ముందుగా నాకు వచ్చింది. అందులో అసభ్యకర సీన్స్‌ లేవు. కానీ, కొన్ని సన్నివేశాలు ఎందుకో నాకు అసౌకర్యంగా అనిపించాయి. స్విమ్మింగ్‌ కాస్ట్యూమ్స్‌ ధరించనని దర్శక, నిర్మాతలకు చెప్పేశా. కరిష్మా కపూర్‌ కథానాయికగా పరిచయమైన ‘ప్రేమ్‌ ఖైదీ’ (1991) కోసం  ముందుగా నన్ను సంప్రదించారు. అందులోని హీరోహీరోయిన్ల మధ్య వచ్చే ఓ సీన్‌ నాకు నచ్చలేదు. అందుకే ఆ చిత్రాన్ని వదిలేశా’’ అని రవీనా తెలిపారు.

‘పత్తార్‌ కే ఫూల్‌’తో 1991లో నటిగా కెరీర్‌ ప్రారంభించిన రవీనా టాండన్‌ ‘రథ సారథి’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఆ తర్వాత ‘బంగారు బుల్లోడు’, ‘ఆకాశ వీధిలో’ నాయికగా తన అందం, అభినయంతో ఆకట్టుకున్నారు. 2014లో వచ్చిన  ‘పాండవులు పాండవులు తుమ్మెద’లో కీలక పాత్ర పోషించిన ఆమె పాన్‌ ఇండియా చిత్రం ‘కేజీయఫ్‌ ఛాప్టర్‌ 2’ (KGF Chapter 2)తో మరోసారి ఇక్కడి వారిని అలరించారు. అందులో పోషించిన ప్రధాని రమీకా సేన్‌ పాత్ర  ఆమెకు విశేష క్రేజ్‌ తీసుకొచ్చింది. రవీనా సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఆమెను పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక చేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు