Roja: పవన్‌ అభిమానులు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి: రోజా

‘భీమ్లానాయక్‌’ విషయంలో ఏపీ ప్రభుత్వం పక్షపాతంగా వ్యవహరిస్తోందని పలువురు రాజకీయ ప్రముఖులు, పవర్‌స్టార్‌ అభిమానులు చేస్తోన్న కామెంట్లపై నగిరి ఎమ్మెల్యే, నటి రోజా స్పందించారు. అందరి పట్ల ప్రభుత్వ వైఖరి ఒకేలా ఉందని అన్నారు....

Updated : 27 Feb 2022 13:58 IST

తిరుపతి: ‘భీమ్లానాయక్‌’ విషయంలో ఏపీ ప్రభుత్వం పక్షపాతంగా వ్యవహరిస్తోందని పలువురు రాజకీయ ప్రముఖులు, పవర్‌స్టార్‌ అభిమానులు చేస్తోన్న కామెంట్లపై నగరి ఎమ్మెల్యే, నటి రోజా స్పందించారు. అందరి పట్ల ప్రభుత్వ వైఖరి ఒకేలా ఉందని అన్నారు. కొన్ని నెలల నుంచి సినిమా టికెట్‌ ధరలు ఒకేలా ఉన్నాయని.. ఏ ఒక్కరి కోసమో దాన్ని మార్చలేదని.. ఈ విషయాన్ని పవన్‌ అభిమానులు గుర్తు పెట్టుకోవాలని ఆమె తెలిపారు.

‘‘భీమ్లానాయక్‌’ విడుదలైన నాటి నుంచి ఎన్నో రకాల వివాదాలు చూస్తున్నాం. పవన్‌కల్యాణ్‌ను తొక్కేయడం కోసమే.. సినిమా టికెట్‌ ధరలపై కొత్త జీవోని ప్రభుత్వం ఇంకా రిలీజ్‌ చేయలేదని ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇలాంటి ప్రచారాలు జరగడం నిజంగానే బాధాకారం. సినిమా టికెట్‌ ధరలు తక్కువగా ఉండటం వల్ల పవన్‌కు నష్టం కలుగుతుందని అంటున్నారు. ఆయనేమీ నిర్మాత కాదు కదా.. నష్టపోవడానికి..! ‘పుష్ప’, ‘అఖండ’ చిత్రాలకు ఎలాంటి ధరలైతే ఉన్నాయో అవే ధరలు ఇప్పుడు కూడా ఉన్నాయి. అంతేకానీ, పవన్‌కల్యాణ్‌ సినిమా రిలీజ్‌ని దృష్టిలో ఉంచుకొని కొత్తగా ధరల్లో మార్పులు చేయలేదనే విషయాన్ని ఆయన అభిమానులు గ్రహించాలి. ఇటీవల చిరంజీవి, మహేశ్‌బాబు, ప్రభాస్‌ వంటి సినీ ప్రముఖులు సినిమా టికెట్‌ ధరల గురించి ముఖ్యమంత్రితో మాట్లాడారు. ఈ విషయంపై హైకోర్టు సూచన మేరకు ఓ కమిటీ కూడా వేశారు. కొన్నిరోజుల క్రితమే తుది నిర్ణయం వెలువడాల్సింది. కాకపోతే అదే సమయంలో మంత్రి గౌతమ్‌ రెడ్డి మరణించడంతో అది కాస్త వాయిదా పడింది. ఇక్కడ ఎవరూ ఎవరికీ అన్యాయం చేయడం లేదని గుర్తుపెట్టుకోవాలి. సినిమా టికెట్‌ ధరలు తక్కువగా ఉన్నాయని భావించినప్పుడు.. మిగతా హీరోల్లా మార్చిలో సినిమా రిలీజ్‌ చేసుకోవాల్సింది. లేదా, హైకోర్టు చెప్పినట్లు.. తమ చిత్రానికి టికెట్‌ ధరలు పెంచమని కోరుతూ ప్రతి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌కు లేఖ రాయాల్సింది. అది వాళ్లు పరిశీలించి, ఓకే అనుకుంటే ధరలు పెంచుకోవడానికి అవకాశం ఇచ్చేవాళ్లు. ఇవేమీ చేయకుండా సినిమా విడుదల చేశారు. తన పార్టీని నిలబెట్టుకోవడానికి పవన్‌ సినిమాతో రాజకీయం చేస్తున్నారు ఈ విషయాన్ని అందరూ తెలుసుకోవాలి’’ అని రోజా విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని